రేవంత్‌ ఆధ్వర్యంలో కదం తొక్కిన కాంగ్రెస్‌.. పోటెత్తిన కార్యకర్తలు.. దద్ద‌రిల్లిన కలెక్టరేట్లు

సీమాంధ్ర పాలనలో మన యాస, భాషపై దాడి.. రైతులను కూలీలుగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్ర కేసీఆర్‌ పాలనలో మన బతుకులపైనే దాడి జరుగుతున్నది పంట బీమా ఇవ్వని కేసీఆర్ రైతుల చావులకు వెలకడుతున్నారు ఎనిమిదేండ్లుగా బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయి క్ష‌ణ‌మే పూర్తి రుణ‌మాఫీ చేయాల‌ని డిమాండ్‌ అందరికీ న్యాయం.. కాంగ్రెస్‌తోనే సాధ్యం వికారాబాద్‌ ధర్నాలో రేవంత్‌ రెడ్డి విధాత: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతు సమస్యలపై పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా […]

  • By: krs    latest    Dec 05, 2022 3:03 PM IST
రేవంత్‌ ఆధ్వర్యంలో కదం తొక్కిన కాంగ్రెస్‌.. పోటెత్తిన కార్యకర్తలు.. దద్ద‌రిల్లిన కలెక్టరేట్లు
  • సీమాంధ్ర పాలనలో మన యాస, భాషపై దాడి..
  • రైతులను కూలీలుగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్ర
  • కేసీఆర్‌ పాలనలో మన బతుకులపైనే దాడి జరుగుతున్నది
  • పంట బీమా ఇవ్వని కేసీఆర్ రైతుల చావులకు వెలకడుతున్నారు
  • ఎనిమిదేండ్లుగా బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయి
  • క్ష‌ణ‌మే పూర్తి రుణ‌మాఫీ చేయాల‌ని డిమాండ్‌
  • అందరికీ న్యాయం.. కాంగ్రెస్‌తోనే సాధ్యం
  • వికారాబాద్‌ ధర్నాలో రేవంత్‌ రెడ్డి

విధాత: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రైతు సమస్యలపై పోరాటంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు దద్ద‌రిల్లాయి. స్థానిక కాంగ్రెస్‌ నేతల నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున కదం దొక్కారు. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తామన్న సీఎం కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. వెంటనే రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో మన యాస, భాషపై దాడి జరిగిందని, కానీ ఇప్పుడు మన బతుకులపై దాడి జరుగుతోందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్ వద్ద ఆందోళనలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అగ్రికల్చర్‌ మన కల్చర్‌ అనీ, అలాంటి అగ్రికల్చర్‌ను కార్పొరేట్‌కు కట్టబెట్టాలని చూస్తూ.. రైతులను కూలీలుగా మార్చేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంలో ఉన్న వారిని గుంజుకొచ్చి జైల్లో పెట్టాలని ప్రధానిని కోరుతున్నానన్నారు.

రాహుల్, సోనియా విచారణ సంస్థలకు సహకరించి వారిని గౌరవించిందని, కానీ బీఎల్ సంతోష్, కవిత ఎందుకు విచారణకు హాజరు కావడంలేదని నిలదీశారు. దీన్ని తెలంగాణ సమాజం అంతా గమనిస్తోందని, కాంగ్రెస్ పార్టీ పై కుట్ర చేసి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని విమర్శించారు. రైతు బీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. పంట నష్టానికి బీమా ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. పంట బీమా ఇవ్వని కేసీఆర్ రైతుల చావులకు వెలకడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతు సాయం చేయాలంటే రైతు చావాల్సిందేనా అని నిలదీశారు.

ఎనిమిదేళ్లు కలిసి ఉన్న బీజేపీ, టీఆరెస్ ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. 80వేల మంది రైతులకు రైతు బీమా వచ్చిందని వ్యవసాయ మంత్రి చెబుతున్నారని, ఐదేళ్లలో 80వేల మంది రైతులు చనిపోయారని ప్రభుత్వం ఒప్పుకున్నట్లేనన్నారు. అంతమంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ సీఎంగా ఉండడానికి వీల్లేదన్నారు. మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని మోదీ చూస్తున్నారని, రాష్ట్ర పెట్టుబడులను గుజరాత్ తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

ఇక్కడ జరిగే దాడులు గుజరాత్‌లో ఎందుకు జరుగడం లేదని నిలదీశారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని, 2015లో అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారని ఆరోపించారు. తన కూతురి పెళ్లికి పోకుండా చేయాలని కేసీఆర్‌ కుట్ర చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చిందని.. మమ్మల్ని మింగిన పాపం ఊరికే పోదంటూ టీపీసీసీ చీఫ్‌ శాపనార్థాలు పెట్టారు.

పక్క పార్టీలను పతనం చేస్తే అధికారం శాశ్వతం అనుకున్నారని, ఆ ఉసురు నీకు తగిలి నీ పార్టీ పీలికలై పోతదన్నారు. గోదావరి జలాలు రంగారెడ్డి జిల్లాకు రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. గోదావరి జలాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న మెదక్ జిల్లాకే పరిమితం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అన్నారు.

అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, ఆ ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేద్దామని, ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేద్దామన్నారు.

కలెక్టరేట్ల వద్ద ధర్నా విజయవంతం

రైతు, భూ సమస్యల పరిష్కారం కోసం టీపీపీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్లరేట్ల వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. రైతుల నుంచి మంచి మద్దతు లభించింది. వికారాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గద్వాల్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, కరీంనగర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కామారెడ్డిలో షబ్బీర్ అలీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రైతు, భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్య‌లో మహిళలు, రైతులు, పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొన్నాయి. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఖమ్మం కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నిర్వ‌హించిన ధర్నాకు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు.

ధర్నాలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు భూమిపై హక్కులు కోల్పోయారని మండిప‌డ్డారు. అలాగే అసైన్డ్, ఇనాం భూముల్లో కబ్జాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎనిమిదేండ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగి ఇప్పుడు దొంగ నాటకాలాడుతున్నాయని విమర్శించారు. రైతుల క్షేమం కోరే ప్రభుత్వం ఇదే అయితే వెంటనే రైతు రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అంద‌రికీ న్యాయం జ‌ర‌గాలంటే అది కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.