ఆ పోస్ట్ విషయంలో ఎంతో కలత చెందాను: కంగనా రనౌత్
కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రినేత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మండి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ వివాదస్పదంగా మారింది.

విధాత: కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రినేత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మండి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్ట్ వివాదస్పదంగా మారింది. దీనిపై స్పందించిన కంగనా తీవ్రంగా ఖండించారు. మంగళవారం చండీఘడ్ విమానశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పోస్ట్‌తో తాను ఎంతగానో కలత చెందానన్నారు. ఆ పోస్ట్ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పోస్టు విషయాన్ని తాను వివిధ మాద్యమాల్లో షేర్ చేయడంతో వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించిందన్నారు. మండి పార్లమెంట్ సీటు విషయంలో తనపై దుష్ప్రచారం చేయడానికి సుప్రియా ఆ పోస్ట్‌ను పెట్టారని వెల్లడించారు. ప్రతి మహిళకు ఆత్మ గౌరవం అవసరమన్నారు.
మండి ప్రజలను కించ పరిచే విధంగా దుర్భాషను వాడారని, అక్కడి ప్రజల గౌరవ, మర్యాదలకు, ఆచారాలకు వ్యతిరేకంగా ఉందని కంగనా పేర్కొన్నారు. మండి ప్రాంతాన్ని చిన్న కాశిగా పిలుస్తారని, గతంలో ఆ గడ్డపై అనేక మంది మహాపురుషులు, ఋషులు, ముణులు జన్మించారన్నారు. అలాంటి పుణ్య భూమిని ఎద్దేవ చేస్తూ కించపరచడం ఏమాత్రం సరైంది కాదన్నారు. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అనంతరం మహిళా కమిషన్ ఛీప్ రేఖాశర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టు తీవ్రం అభ్యంతరకరంగా ఉన్నదన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తెలియజేశామని, పోస్ట్ పెట్టిన సుప్రియా శ్రినేత్, హెచ్ ఎస్ అహిర్‌లపై చర్యలు తీసుకోవాలని రేఖాశర్మ డిమాండ్ చేశారు.