Kavitha: స్వరం పెంచిన కవిత..పార్టీ నాయకత్వంపై ఫైర్!

పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు
సొంత బిడ్డపై పెయిడ్ అర్టిస్టులతో తిట్టిస్తున్నారు
కోవర్టులు..లేఖ లీక్ వీరులు ఎవరో చెప్పాలి
పరోక్షంగా కేటీఆర్ పై దాడి
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అడ్డుగా ఉన్నాననే దూరం పెడుతున్నారు
తెలంగాణ సోయి కరువైందని వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుక పడ్డారు. నాకు ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అంటూనే..పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్న కేటీఆర్ పై విమర్శల దాడి చేశారు. మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్ కు అంతర్గతంగా రాసిన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. లేఖ లీక్ వ్యవహారంలో బీజేపీ కోవర్టులు బీఆర్ఎస్ లో ఎవరని ప్రశ్నించారు. పార్టీ అంతర్గత సమస్యలను ఇంటర్నల్ ఫోరంలోనే మాట్లాడుకోవాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను కవిత ఎద్దేవా చేశారు. ఫోరం లోపల ఏముందని.. అందుకే బయట మాట్లాడుతున్నానని కవిత తెగేసి చెప్పారు. నా లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలంటే..గ్రీకు వీరుల్లాగా నాపై విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. సొంత బిడ్డపై డబ్బులిచ్చి మరి తిట్టిస్తున్నారని.. అటువంటి బయటి వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని..దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుంటాం..నీ మీద దాడులు చేస్తాం అంటే ఎలా అని..అ తెలివి ప్రతిపక్ష పార్టీలపై చూపించండని పరోక్షంగా కేటీఆర్ పై విమర్శలు సంధించారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని..ముందు ఒకటి వెనుక ఒకటి ఉండదని..నేను కేసీఆర్ కంటే తిక్కదాన్ని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా జోలికి వస్తే బాగుండదని..అసలే నేను మంచిదాన్ని కాదన్నారు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నాం అని కార్టూన్లు వేసుకొని చెప్పుకుంటున్నారని..కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళా మీరు అని కవిత ప్రశ్నించారు. గతంలో నేను 25 ఏళ్ల నుంచి మా నాన్నకు లేఖలు రాస్తున్నానని..వందల లేఖలు రాశానని.. ప్రతిసారి లేఖ చూడగానే కేసీఆర్ చదివి చించేస్తారని.. కానీ ఈసారి ఏమైందో ఆ లేఖ బయటకి వచ్చిందన్నారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అడ్డుగా ఉన్నాననే దూరం పెడుతున్నారు
బీజేపీలో బీఆర్ ఎస్ ను విలీనం చేసేందుకు కుట్ర జరుగుతుందని..దీనిని తాను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్నందుకే నన్ను దూరం పెడుతున్నారని కవిత ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన తెస్తే నేను అప్పుడే వ్యతిరేకించానని..తెలంగాణ సాధించిన పార్టీని మరో పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం ఎందుకని వ్యతిరేకించడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం 101శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నేను ఉంటే అది కుదరదని నన్ను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు. నాకు, కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని..నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు. కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదని..నేను కాంగ్రెస్ పార్టీలో 2013లో మాట్లాడటం జరిగిందని..అప్పటి నుంచి వారితో మాటలు లేవన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని..ఆ పార్టీ బాగుంటే, రాహుల్ గాంధీ బాగుంటే దేశంలో బీజేపీ ఇన్నిసార్లు గెలవదని కవిత అభిప్రాయపడ్డారు. నాకు కొత్త పార్టీ ఆలోచన ఎందుకని..ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సోయి కరువైంది
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యతిరేకంగా తాను పోవడం లేదని.. అయన పోస్ట్ కు ఉండే గౌరవం ఉంటుందని అంటూనే కవిత విమర్శలు చేశారు. పార్టీ ప్రెసిడెంట్ కు నోటీసులు వస్తే లేని హంగామా ఇతరులకు వస్తే ఎందుకని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఊరురా నిరసనలు చేయాల్సింది కదా ఆ పని ఎందుకు చేయలేదని కవిత నిలదీశారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని చెప్పినప్పుడు వారిని ఎందుకు పక్కనపెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ సోయితో పాలన జరగట్లేదని..కొందరు కేసీఆర్ కింద ఉన్నవాళ్లు సరిగ్గా పనిచేయడం లేదని కవిత ఆరోపించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితమైతే ఎలా..ప్రభుత్వ వైఫల్యాలపై..ప్రజాసమస్యలపై పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు. నాకు నీతులు చెప్పే వారికి పార్టీని నడిపించే సత్తా ఉందా ఆలోచించుకోవాలన్నారు. పార్టీని నడిపించే తీరు ఇది కాదన్నారు. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటే జనం నవ్వుకుంటున్నారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ చేయాల్సిన పని చేయకే జాగృతి నుంచి చేస్తున్నా
జాగృతిని స్వంతగా డబ్బుతో నడిపిస్తున్నానని, వాళ్ళ డబ్బులు తీసుకోలేదని కవిత స్పష్టం చేశారు. పార్టీ కోసం చేయాల్సిన సగం పని నేను జాగృతి తరుపున చేస్తుంటే నాపై విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. నేను పదవి అడగలేదు, పైసలు అడగాలేదని..తన వద్ధకు వచ్చిన మధ్యవర్తులతో తాను అలా అడినట్లుగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. గతంలో జైలుకు వెళ్లినప్పుడు నాపై ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పగా..ఆయన వద్ధన్నారని కవిత వెల్లడించారు. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని ఊరూరు తిరిగానని..తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ఈ బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మన పార్టీ నేతల కాలేజీలు కూలగొడుతుంటే ఏం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ లో నాకు ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే అని.. నాకు ఇంకెవరు నాయకులు లేరని..నేను ఎవరి నాయకత్వంలో పనిచేయబోనని.. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని పరోక్షంగా కేటీఆర్ నాయకత్వంపై తన వ్యతిరేతను ప్రకటించారు. తాజా పరిణామాలపై కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది ఇప్పుడే చెప్పలేనని..ఇందుకోసం నేను డెడ్ లైన్ ఏమి పెట్టలేదన్నారు.