CBI నోటీసులకు కవిత ప్రతి స్పందన.. ఫిర్యాదు కాపీ, FIR ఇవ్వండి!
విధాత, హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ శుక్రవారం సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా […]

విధాత, హైదరాబాద్: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ శుక్రవారం సమాచారం ఇచ్చింది.
దానికి కవిత స్పందిస్తూ సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా కవితను ఈ నెల 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, ఢిల్లీలో కానీ ఆమె నివాసంలో విచారించనున్నట్లు సీబీఐ తన నోటీసుల్లో పేర్కొన్నసంగతి తెలిసిందే. తన వివరణ కోరుతూ సీబీఐ నోటీసులు జారీ చేసిందని శుక్రవారం రాత్రి కవిత స్పష్టం చేశారు. 6న హైదరాబాద్‌లోని తన ఇంట్లో సీబీఐ అధికారులకు వివరణ ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత.. శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఈ కేసుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. సీబీఐ విచారణను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు సమాచారం.
న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలనే అంశంపై కేసీఆర్‌తో కవిత మంతనాలు జరిపినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. మొత్తంగా కవిత ప్రగతి భవన్ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం సీబీఐకి కవిత లేఖ రాయడం గమనార్హం.