ఇప్పుడుంది అసలు ఆట: కేటీఆర్
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

- సాధ్యం కాని హామీలిచ్చి..లెక్కలు వేసుకుంటారా
- మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
విధాత: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్‌కు హాజరైన సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలకు సాధ్యంకాని హామీలిచ్చి మభ్యపెట్టిందన్నారు. లెక్కలు వేసుకుని హామీలిస్తారా..హామీలిచ్చి లెక్కలు వేసుకుంటారా అని నిలదీశారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని, ఇప్పుడుంది అసలు ఆట అని వ్యాఖ్యానించారు.
ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక రాష్ట్రం అప్పుల మయమైందంటూ ప్రచారం మొదలు పెట్టారని, రేపు గవర్నర్ ప్రసంగంలో కూడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రభుత్వం చెబుతుందన్నారు. మేం ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. కాగ్ లెక్కలు కూడా ఆర్ధిక పరిస్థితిపై నివేదించాయన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏనాడు పద్దులపై చర్చ జరుగలేదన్నారు.