పేట విడిచి కోటలో రేవంత్ అడుగు
నర్సంపేట నారాజ్ పై శ్రేణుల ఆరా పీసీసీ చీఫ్‌ను పట్టించుకోని దొంతి జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠంపై పీటముడి? రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మధ్యలో నర్సంపేట నియోజకవర్గంలోకి వెళ్లకుండా మానుకోట సెగ్మెంట్‌కు చేరడంలో మర్మమేమిటినే చర్చ సాగుతోంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ తోపాటు రాజకీయ వర్గాల్లో […]

- నర్సంపేట నారాజ్ పై శ్రేణుల ఆరా
- పీసీసీ చీఫ్‌ను పట్టించుకోని దొంతి
- జిల్లా డీసీసీ అధ్యక్ష పీఠంపై పీటముడి?
- రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మధ్యలో నర్సంపేట నియోజకవర్గంలోకి వెళ్లకుండా మానుకోట సెగ్మెంట్‌కు చేరడంలో మర్మమేమిటినే చర్చ సాగుతోంది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీ తోపాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ప్రారంభించిన యాత్రకు నర్సంపేటలో సానుకూలంగా లేకపోవడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. నర్సంపేటలో యాత్ర చేపట్టాలని రేవంత్‌రెడ్డి భావించినప్పటికీ, స్థానిక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పీసీసీ అధ్యక్షుడికి తగిన సహకారం అందించలేదని సమాచారం.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర పట్ల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి కనీస శ్రద్ధ కనబర్చకపోవడం వెనుక అసలు కారణాలేంటని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సీనియర్ల ప్రభావం దొంతిపై ఉందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడి స్థాయి నేత ఏదైనా నియోజకవర్గంలో పర్యటిస్తే ఇతరత్రా భారాలు ఉండవచ్చుకానీ.. స్థానిక కార్యకర్తల్లో జోష్ రావడంతోపాటు ప్రజల్లో చర్చ జరిగేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఈ మంచి తరుణాన్ని మాధవరెడ్డి ఎందుకు మిస్ చేసుకున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దొంతి.. రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన వాడు కావడమే ప్రధాన విషయం అంటున్నారు. దీనితో పాటు వరంగల్ జిల్లా నూతన డీసీసీ ప్రెసిడెంట్ నియామకంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతి నచ్చక పాదయాత్రకు దొంతి దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
- వరంగల్ డీసీసీ అధ్యక్ష పీఠంపై పీటముడి
వరంగల్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం విషయంలో నెలకొన్న పీటముడే రేవంత్ పాదయాత్రకు మాధవరెడ్డి దూరంగా ఉండేందుకు ముఖ్య కారణం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లా పరిధిలో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలు ఉండగా డీసీసీ పీఠాన్ని ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. దీంతో డీసీసీ అధ్యక్ష నియామకం జాప్యమవుతున్నది. డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆ పార్టీ నేతలు కొండా మురళి, మాధవరెడ్డి ఆశిస్తున్నట్లు సమాచారం.
ఇరు వర్గాలూ తమ నేతకే పీఠం చెందాలని పట్టుబడుతుండడంతో సమస్య నెలకొంది. ఇదిలా ఉండగా కొండా వైపు రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉండడంతో దొంతి వర్గం రేవంత్ పై కినుక వహించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి పాదయాత్రకు దొంతి ఆస్తకి చూపలేదని సమాచారం. నూతన అధ్యక్షుడిని నియమించకుండా పీసీసీ చీఫ్ పాదయాత్ర ఎలా చేపడుతారని దొంతి వర్గం గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
- అనుకూలించక పోవడమే కారణమా?
ముందుగా నిర్ణయించిన రేవంత్‌రెడ్డి పాదయాత్ర షెడ్యూల్లో నర్సంపేటకు సంబంధించి నర్సంపేట, ఖానాపూర్ మినహా మిగిలిన ప్రాంతాలు ఏవీ కవర్ కాకపోవడంతో మరోసారి ఇక్కడ పాదయాత్ర చేపడుదామనే ఆలోచనతో నియోజవర్గం మీదుగా సరాసరి రేవంత్ మానుకోటకు వెళ్లిపోయినట్లు మరికొందరు నాయకులు చెబుతున్నారు. దీనికి తోడు ఎనిమిదో తేదీ నుంచి నర్సంపేట నియోజకవర్గంలో మాధవరెడ్డి యాత్ర చేపట్టాలని ముందుగా నిర్ణయించుకోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
- హై కమాండ్ దృష్టికి అసమ్మతి సమస్యలు
ఈ విషయాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రత్యేక పరిస్థితుల్లో తాను చేపట్టిన పాదయాత్ర మధ్యలో ఆగిపోకుండా నర్సంపేట ను వదిలేసి మానుకోట నియోజకవర్గ పరిధిలోని కేసముద్రం మండలం పెనుగొండ నుంచి పాదయాత్ర ప్రారంభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరితో పేచీ పెట్టుకోకుండా కొంతకాలం యాత్ర కొనసాగించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా పావులు కదుపుతున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.