బెంగాల్‌లో ఒంటరిగా పోటీచేస్తాం: సీఎం మ‌మ‌త‌

ప‌శ్చిమ‌బెంగాల్‌లోని 42 లోక్‌స‌భ స్థానాల‌కు తృణమూల్ కాంగ్రెస్ ఒంట‌రిగా పోటీచేస్తుంద‌ని ఆ పార్టీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టంచేశారు

బెంగాల్‌లో ఒంటరిగా పోటీచేస్తాం: సీఎం మ‌మ‌త‌
  • కాంగ్రెస్‌తో ఎలాంటి బంధం లేదు
  • ఫ‌లితాల త‌ర్వాతే కాంగ్రెస్‌తో
  • అఖిల భారత పొత్తుపై ప‌రిశీల‌న‌
  • తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌త స్ప‌ష్టీక‌ర‌ణ‌


విధాత‌: ప‌శ్చిమ‌బెంగాల్‌లోని 42 లోక్‌స‌భ స్థానాల‌కు తృణమూల్ కాంగ్రెస్ ఒంట‌రిగా పోటీచేస్తుంద‌ని ఆ పార్టీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్ప‌ష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేద‌ని బుధ‌వారం చెప్పారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో పొత్తుపై ప‌రిశీలిస్తామ‌ని తెలిపారు.


“నాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. మేము ఒంటరిగా పోరాడుతాం. ఎన్నికల ఫ‌లితాల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాము” అని బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా చెప్పారు. సీట్ల భాగస్వామ్య ఒప్పందాల గురించి తాను ఇప్పటివరకు ఎవరితోనూ మాట్లాడలేదని స్ప‌ష్టంచేశారు.


కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భారత్ జోడో నయ్ యాత్ర గురువారం బెంగాల్‌లోకి ప్రవేశించాల్సి ఉన్న‌ది. కానీ, తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కోల్‌కతాను యాత్ర సాగ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. “నా రాష్ట్రానికి రాహుల్ యాత్ర వస్తున్న‌ది. కానీ, నాకు తెలియజేసే క‌నీస మర్యాద వారికి లేదు” అని ఆమె పేర్కొన్నారు.


బెంగాల్‌లో 10-12 లోక్‌సభ స్థానాల‌ను కాంగ్రెస్ కోరడంపై మంగళవారం బెనర్జీ ఆక్షేపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 2014లో నాలుగు సీట్లు గెలుచుకోగా, 2019లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న‌ట్టు ఆమె గుర్తుచేశారు. ఈ నేప‌థ్యంలో తాము కాంగ్రెస్‌తో సీట్ల పంపకం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డిన తృణ‌మూల్‌ సీనియర్ నాయకుడు ఒక‌రు తెలిపారు. మ‌రోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు చౌదరి కూడా తృణమూల్‌తో సీట్లు పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.