యువకుడి వినూత్న ప్రకటన.. వధువు కావాలంటూ ఆటోపై హోర్డింగ్..
వివాహ వయసు రాగానే వధువు, వరుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. కొందరైతే మ్యాట్రిమోని వెబ్‌సైట్లను సంప్రదిస్తారు. ఇంకొందరైతే వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటారు. అలా వరుడు వధువు కోసం, వధువు వరుడి కోసం చాలా రకాలుగా వెతుకుతుంటారు.

భోపాల్ : వివాహ వయసు రాగానే వధువు, వరుడి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుంటారు. కొందరైతే మ్యాట్రిమోని వెబ్‌సైట్లను సంప్రదిస్తారు. ఇంకొందరైతే వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తుంటారు. అలా వరుడు వధువు కోసం, వధువు వరుడి కోసం చాలా రకాలుగా వెతుకుతుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం వినూత్నంగా ప్రకటన ఇచ్చాడు. అది కూడా తన ఆటో రిక్షాపై వధువు కావాలంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన 29 ఏండ్ల దీపేంద్ర రాథోడ్.. ఆటో రిక్షా నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. మా అమ్మనాన్నలు పూజలు, పునస్కారాలతో బిజీగా ఉంటారు. తనకేమో పెళ్లీడు దాటిపోతోంది. అమ్మాయిలు కూడా తగ్గిపోతున్నారు. మొదట్లో ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాను. కానీ లాభం లేకుండా పోయింది. దీంతో తన పేరెంట్స్ అనుమతి తీసుకొని ఇలా తన ఆటోపై ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశానని చెప్పాడు. ఆటోకు పెళ్లి కుమార్తె కావాలెను అంటూ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఆ హోర్డింగ్‌పై దీపేంద్ర రాథోడ్ తన ఫొటోతో పాటు ఎత్తు, పుట్టిన తేదీ, బ్లడ్ గ్రూప్, విద్యార్హతలు, గోత్రం వంటి వివరాలన్నీ పొందుపరిచాడు. కులం, మతం పట్టింపులు లేవు. స్థానికేతరులైనా ఫర్వాలేదు అని దీపేంద్ర పేర్కొన్నాడు. ఆటో రిక్షా సాయంతో కుటుంబాన్ని పోషిస్తున్న దీపేంద్ర తన జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తానని చెప్పాడు.