పేదలందరికి ఇండ్లు.. రేషన్‌ కార్డులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికి ఇండ్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు

  • By: Somu    latest    Mar 15, 2024 11:44 AM IST
పేదలందరికి ఇండ్లు.. రేషన్‌ కార్డులు
  • సొంతూరే నా బలం..బలగం
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


విధాత, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికి ఇండ్లు, రేషన్‌ కార్డులు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తన స్వగ్రామం నకిరేకల్‌ నియోజకవర్గం నార్కట్‌పల్లి మండలం బ్రహ్మాణవెల్లంల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి బ్రాహ్మణ వెల్లంల నుండి చిట్యాల వరకు, బ్రహ్మాణవెల్లంల గ్రామంలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి 67 కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆరెస్‌ ప్రభుత్వ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు భవంతులు, ఫామ్‌హౌజ్‌లు కట్టించుకుని భారీ అక్రమ సంపద పోగేసుకున్నారని, పేదలకు మాత్రం ఇండ్లు, రేషన్‌కార్డులు ఇవ్వలేదని విమర్శించారు.


కవిత గల్లిలో బతుకమ్మ, ఢిల్లీలో లీక్కర్ అమ్ముతుందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సమస్యలను తాము పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిగా తన సొంతూరుకు రావడం ఆనందంగా ఉందని, నా రాజకీయ జీవితానికి బాటలు వేసిన సొంతూరు నాకు బలం.బలగం అన్నారు. నన్ను పెంచి పోషించిన గ్రామం ఎంత చేసిన తక్కువేనన్నారు. ప్రతి ఇంటి సమస్యను నా సమస్యగా నేరవేరుస్తానని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని హామీ ఇచ్చారు. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని, నల్గొండ జిల్లాలో బ్రహ్మాణవెల్లంల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు మొదటి శంకుస్థాపన చేశామన్నారు.


గ్రామంలో ప్రతీక్ పేరు మీద లెబ్రరీ నిర్మాణం చేయిస్తామన్నారు. గ్రామాన్ని సోలార్ గ్రామం ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అలాగే ప్రతి మహిళల సంఘాలకు కోటి రూపాయలను అందిస్తామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడాలని కోరారు. దుర్మార్గుడు మాజీ సీఎం కేసీఆర్ బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టును 10 సంవత్సరాలో పూర్తి చేయకుండా మనకు అన్యాయం చేశారన్నారు. వచ్చే ఏడాది వర్ష కాలం వచ్చేనాటికి బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు. 6 నెలల్లో గ్రామానికి వచ్చే డబుల్ రోడ్డును పూర్తి చేయిస్తామన్నారు. గ్రామ అభివృద్ధికి యువకుడైన ఎమ్మెల్యే వీరేశం సహకారం కూడా ఉంటుందన్నారు.


ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఈ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అనేక నిధులు తీసుకువస్తున్న మంత్రి కోమటిరెడ్డికి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టుకు అధిక నిధులు తెచ్చి దీన్ని పూర్తి చేయించడంతో పాటు ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలకు కూడ నిధులు మంజూరు చేయాలని కోరారు. నార్కెట్‌పల్లి డిపోను పున ప్రారంభం చేయాలని, వివిధ గ్రామాల్లో ఉన్న రోడ్లకు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే సహా అంతా గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, అధికారులు  పాల్గొన్నారు.