సొంత ప్రభుత్వంలో తండ్రికి అలా.. ప్రతిపక్షంలో ఉన్నా కూతురికి ఇలా..!
తండ్రి కూతుళ్లు ఇద్దరూ బీఆరెస్ ఎమ్మెల్యేలే.. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఏడాది వ్యవధిలోనే మృతిచెందడం అత్యంత విషాదకరం

- బీఆరెస్ సర్కారులో చావులోనూ వివక్షే
- సాయన్న అంత్యక్రియల్లో అవమానాలు
- దివంగత దళిత ఎమ్మెల్యేకు సొంత ప్రభుత్వంలో దక్కని అధికార లాంఛనాలు
- నేడు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే లాస్య నందితకు అధికార లాంఛనాలతో..
విధాత: తండ్రి కూతుళ్లు ఇద్దరూ బీఆరెస్ ఎమ్మెల్యేలే.. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఏడాది వ్యవధిలోనే మృతిచెందడం అత్యంత విషాదకరం. ఆ కుటుంబానికి తీరని నష్టం. ఆ కుటుంబం ఇప్పట్లో కోలుకొని సాధారణ జీవితం గడపటం కూడా కష్టమే. ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకుడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. ప్రజా జీవితంలో ఉన్న తండ్రి, కూతుళ్లు ఒకరు ఆనారోగ్యంతో మరణిస్తే.. మరొకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విధి వక్రీకరించి మరణించిన ఈ ఇద్దరు నేతల అంత్యక్రియల తంతు ఇప్పుడు చర్చనీయాంశగా మారింది.
ఐదుసార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన అనారోగ్యంతో మరణించారు. అధికార బీఆరెస్ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే అయిన సాయన్న అంత్యక్రియలు ఆనాడు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రజలు కోరారు. అనేక దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కానీ నాటి సీఎం కేసీఆర్.. సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి ముందుకు రాలేదు.
దీంతో ఆనాడు సాయన్న అనుచరులు చితిపై సాయన్న పార్టీవదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. దళిత ఎమ్మెల్యేకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సాయన్న అంత్యక్రియలు కొద్దిసేపు నిలిచిపోయాయి. చివరకు కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో అంత్యక్రియలు నిర్వహించారు. సాయన్న మరణించిన తరువాత కేసీఆర్‌తోపాటు ఆనాటి మంత్రులు అందరూ వచ్చిన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు.
కానీ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించడానికి కేసీఆర్ సర్కారు సిద్ధపడలేదు. సహజంగా మాజీ ఎమ్మెల్యేలు, పలువురు సినిమా ప్రముఖులు చనిపోయినప్పుడు అదే బీఆరెస్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. దీనిని దళిత సంఘాల నాయకులు, సాయన్న అనుచరులు తప్పు పట్టారు..
సీన్ కట్ చేస్తే.. తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత కార్పొరేటర్‌గా పనిచేశారు. తన తండ్రి మరణానంతరం కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రజల అభిమానం పొందింది. రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ప్రజాభిమానం చూరగొంటున్న లాస్య నందిత.. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి సంవత్సరీకం నిర్వహించిన మూడు రోజులకే తానూ దేహాన్ని చాలించారు. చనిపోయింది బీఆరెస్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
కానీ ఒక ప్రజా ప్రతినిధి చివరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. లాస్య నందిత అంత్యక్రియలు పోలీస్ గౌరవ వందనంతో అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి శాంతికుమారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అంత్యక్రియల కార్యక్రమాల్ని లైవ్ కవరేజ్ ఇవ్వాలని ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌ను ఆమె ఆదేశించారు.
సొంత పార్టీకి చెందిన దళిత నేత, సీనియర్ ఎమ్మెల్యేకు నాటి కేసీఆర్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకున్నా.. ఇప్పడు ప్రతిపక్ష ఎమ్మెల్యే చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించడంపై సర్వతా హర్షం వ్యక్తమవుతున్నది.