తెలంగాణలో ఏడాది తర్వాత బీజేపీ సర్కార్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌

కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే దాని పతనం గురించి రాజాసింగ్‌ మాట్లాడటం సంచలనం రేపుతున్నది.

  • By: Somu    latest    Dec 06, 2023 10:00 AM IST
తెలంగాణలో ఏడాది తర్వాత  బీజేపీ సర్కార్‌: ఎమ్మెల్యే రాజాసింగ్‌

విధాత: తెలంగాణలో ఏడాదిలోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే కూలిపోయే ముచ్చట చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లిపోయిందని, ఆ అప్పులను సర్ధుబాటు చేసుకుని, కాంగ్రెస్‌ గ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెను సవాల్‌గా నిలుస్తుందన్నారు.


ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని, ఏడాది మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. కాగా కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌ 60 స్థానాలకు అధికంగా కేవలం మిత్రపక్షం సీపీఐతో కలిసి 5 స్థానాలే ఉండటంతో పాటు కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం సీనియర్లు పొంచి ఉండనున్న రీత్యా ఆ పార్టీలో ఎప్పుడైనా అసమ్మతి తలెత్తవచ్చని బీజేపీ, బీఆరెస్‌లు అంచనా వేస్తున్నాయి.


అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని పడగొడితే రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో ప్రతికూలత ఎదురవుతుందని భావిస్తున్న బీజేపీ.. పార్లమెంటు ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్‌పై ఆపరేషన్‌ లోటస్‌ను అమలు చేయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు కొంత సమయం ఇచ్చి చూశాక ఆ ప్రభుత్వ వైఫల్యాలపై దాడి ఆరంభించాలని బీఆరెస్‌ కూడా భావిస్తున్నది. పార్లమెంటు ఎన్నికల తర్వాతా కాంగ్రెస్‌లో అసమ్మతి తలెత్తితే వాటిని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం బీఆరెస్‌ కూడా చేయవచ్చంటున్నారు.


ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలలో తలెత్తే ప్రమాదకర, అప్రజాస్వామిక పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అయితే రేవంత్‌ రెడ్డి సైతం తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వీలైనంత త్వరగా బీఆరెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నం కూడా చేయవచ్చంటున్నారు  పరిశీలకులు.