MLA Seethakka | బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే: ఎమ్మెల్యే సీతక్క
MLA Seethakka | త్యాగాలు మావి.. భోగాలు వాళ్లవి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వారి ధోరణి ఉంటుందని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంత పాలన చేస్తూ, ప్రజలను హింసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం […]

MLA Seethakka |
- త్యాగాలు మావి.. భోగాలు వాళ్లవి
- తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ
- ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా వారి ధోరణి ఉంటుందని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. మంగళవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ నియంత పాలన చేస్తూ, ప్రజలను హింసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అవినీతి పాలకులకు చిక్కి నాశనమైందని, ధనిక రాష్ట్రం అప్పులఊబిలో కూరుకుపోయిందని అన్నారు.
త్యాగాలు కాంగ్రెస్ పార్టీవి అయితే.. భోగాలు బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ దొరల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు అని 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాల వల్ల కేసీఆర్ గద్దెనెక్కారని తెలిపారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని యావత్తు తెలంగాణ సమాజాన్ని నమ్మించి మోసం చేశాడని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని నమ్మించి నట్టేట ముంచారు.
అగ్గిపెట్టెలాంటి ఇండ్లు మనకెందుకు అని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి రెండు పడక గదుల ఇండ్లు కట్టిస్తానని మోసం చేశారని అన్నారు. గిరిజన, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఏమైంది, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ఎంతవరకు వచ్చింది, నిరుద్యోగ భృతి ఎంతవరకు వచ్చిందని, రైతు రుణమాఫీ ఏమైంది, పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశారని, కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ నిత్యావసర సరుకులు, చమురు ధరలు పెంచి సామాన్యుడు బతకలేని స్థితికి తీసుకువచ్చిందని వాపోయారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి కేంద్రం మోసం చేసిందని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించి, దేశ సంపదను అదాని, అంబానిలకు మోడీ దోచిపెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులకు డబ్బుతో వల
అభివృద్ధి చేస్తే తాము చేశామని, పనులు జరగకపోతే మీ ఎమ్మెల్యే చేయలేదని మంత్రులు రెండు నాల్కలతో మాట్లాడడం సిగ్గుచేటని సీతక్క విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేక తనను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని మంత్రులు, బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంచులతో కాంగ్రెస్ నాయకులు, కేడర్ ను కొనుక్కునేందుకు బీఆర్ నాయకులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలు దగ్గరకు రాగానే ప్రజల దగ్గరికి వచ్చి దొంగ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ములుగు జిల్లాను ఇతర జిల్లాల కంటే ఎంతమేరకు అభివృద్ధి చేశారో ఒకసారి ఆలోచించాలని అన్నారు. నేను ప్రజా సేవకురాలిని, ప్రజా క్షేత్రంలో పని చేస్తూ నిత్యం ప్రజా సమస్యల్లో పాల్గొంటూ, కష్టాల్లో ఉన్నవారికి నా వంతు సహాయం చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నానని అన్నారు.
ఓట్ల కోసం రాజకీయం చేసే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని ప్రజలను కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయూభ్ ఖాన్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చిటమట రఘు, ఎండీ అఫ్సర్ పాషా, చింత నిప్పుల భిక్ష పతి పాల్గొన్నారు.