ఇక తెలంగాణే.. మోదీ, షా ద్వయం ఫోకస్!
రాష్ట్రంలో ఉధృతం కానున్న కేంద్ర నేతల పర్యటనలు విధాత: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల ఘట్టం ముగియడంతో ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయం ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలపై ఫోకస్ పెట్టనుండటం తెలంగాణ కమలదళంలో ఉత్సాహం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో తొలిసారిగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధాని సహా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకుల పర్యటనలను ఉదృతం చేసి […]

రాష్ట్రంలో ఉధృతం కానున్న కేంద్ర నేతల పర్యటనలు
విధాత: బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుజరాత్ ఎన్నికల ఘట్టం ముగియడంతో ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా ద్వయం ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలపై ఫోకస్ పెట్టనుండటం తెలంగాణ కమలదళంలో ఉత్సాహం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో తొలిసారిగా వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం ప్రధాని సహా కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకుల పర్యటనలను ఉదృతం చేసి ప్రజాక్షేత్రంలో బలపడాలన్న ఆలోచనతో ప్రణాళికలు రచిస్తుంది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభకు ఈ నెల16న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అయితే రాష్ట్రంలో ముందస్తు ఉహాగానాలు ఊపందుకోవడంతో బండి తన పాదయాత్రను బస్సు యాత్రగా మార్చి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలని చూస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షా ల బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ దాడిని బీఅర్ఎస్ ప్రకటనతో ముమ్మరం చేసి.. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఏకంగా మోదీ-అమిత్ షాలనే టార్గెట్ చేయడంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ రాజకీయాలపై మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
ఒకవైపు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో టీఆర్ఎస్ నాయకత్వాన్ని కట్టడి చేస్తూనే, ఇంకో వైపు రాష్ట్ర ప్రజల్లో బీజేపీకి ఆదరణ లభించేలా రాజకీయ కార్యక్రమాలను విస్తృతం చేయడం.. పార్టీలోకి వలసలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ పటిష్టత వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజాక్షేత్రంలో పార్టీని బలపర్చేందుకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల పర్యటనలు రాష్ట్రంలో ఉదృతం చేయాలని ప్రణాళికలు రచిస్తుంది.
ఇందులో భాగంగా తెలంగాణకు కేటాయించిన వందే భారత్ రైలు( సికింద్రాబాద్ )-విజయవాడ) ప్రారంభానికి, అదే సమయంలో బీబీనగర్ ఎయిమ్స్ నూతన భవన సముదాయాలకు శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో ప్రచారం సాగుతుంది. ఎయిమ్స్ భవనాల సముదాయ శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికే పీఎంవో నుంచి అధికారుల బృందం వచ్చి వివరాలు సేకరించినట్లుగా ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించాయి.
అటు రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం లక్ష్యంగా కేంద్ర మంత్రుల పర్యటనలు వరుసగా కొనసాగుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాల కార్యక్రమాలను కూడా ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి విజయావకాశాలున్న నియోజకవర్గాలపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి వాటిల్లో ఎన్నికలు లక్ష్యంగా పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలని రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేస్తుంది.
బండి సంజయ్ బస్సు యాత్రను జంట నగరాలతో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీజేపీ రాజకీయ కార్యకలాపాలు తెలంగాణ రాష్ట్రంలో మరింత ఉధృతం కానున్నాయి. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెలంగాణలో కాంగ్రెస్ ,టీఆర్ఎస్, బీజేపీల మధ్య మునుముందు పోటా పోటీ రాజకీయాలు సాగడం ఖాయంగా కనిపిస్తుంది.