కత్తి పీటతో దత్త పుత్రికపై దాడి.. అసలు ఆమె తల్లేనా..?
ఓ తల్లి తన దత్త పుత్రిక పట్ల రాక్షసంగా ప్రవర్తించింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సింది పోయి అరాచకానికి పాల్పడింది.

లక్నో : ఓ తల్లి తన దత్త పుత్రిక పట్ల రాక్షసంగా ప్రవర్తించింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సింది పోయి.. ఆమె పట్ల తల్లి అరాచకానికి పాల్పడింది. దత్త పుత్రికపై కత్తి పీటతో దాడి చేసి హింసించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో వెలుగు చూసింది.
ఓ మహిళ ఇంటి ముందున్న పొయ్యి వద్ద కూర్చుంది. ఇక ఓ చిన్నారి కూడా అక్కడ ఉంది. ఆమె తన ముందు కూరగాయలు పెట్టుకుని కూర్చుంది. చిన్నారేమో వాటిని కడిగేందుకు ఓ పాత్రలో నీళ్లు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూరగాయలను కట్ చేసేందుకు కత్తి పీట కూడా తీసుకొచ్చి తన తల్లి ముందు పెట్టింది. అనంతరం పాప ఓ నోట్ బుక్ తీసుకుని వచ్చి తల్లికి ఎదురుగా కూర్చొని రాసుకుంటుంది.
అంతలోనే ఏమైందో ఏమో కానీ ఆ మహిళ.. చిన్నారిపై కత్తి పీటతో దాడి చేసింది. జుట్టు పట్టి లాగి తీవ్రంగా హింసించింది. దాంతో చిన్నారి కన్నీరు పెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోయింది. భయంభయంగా చిన్నారి అటుఇటు తిరిగింది. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి పై నుంచి చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
చిన్నారి పట్ల హింసకు పాల్పడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలను ఏ మాత్రం ప్రోత్సహించొద్దని కోరుతున్నారు. పిల్లల పట్ల తల్లులు ప్రేమగా ఉండాలి. కానీ ఇంత క్రూరంగా ప్రవర్తించొద్దని నెటిజన్లు పేర్కొంటున్నారు.