సూదిమందు హ‌త్యకు అక్ర‌మ సంబంధ‌మే కార‌ణం! భార్య కాల్ లిస్ట్‌తో వీడిన మిస్ట‌రీ

ఖ‌మ్మం పోలీసుల అదుపులో నిందితులు విధాత: ద్విచ‌క్ర‌ వాహ‌నంపై వెళుతున్న ఓ వ్య‌క్తిని లిఫ్ట్ అడిగి, వెనుక నుంచి కుక్క‌ల‌ను చంపే సూది మందు పొడిచి వ్య‌క్తి మృతికి కార‌ణ‌మైన కేసులో ఖ‌మ్మం పోలీసులు పురోగ‌తి సాధించారు. అక్ర‌మ సంబంధాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. హ‌తుడి భార్య ఫోన్ కాల్ జాబితాతో ఈ సూది మందు హ‌త్య వెనుక దాగున్న మిస్ట‌రీకి తెర‌ప‌డింద‌ని చెబుతున్నారు. నిందితులకు ఓ ఆర్ ఎంపీ డాక్ట‌ర్ స‌హ‌కారం […]

  • By: krs    latest    Sep 21, 2022 6:16 AM IST
సూదిమందు హ‌త్యకు అక్ర‌మ సంబంధ‌మే కార‌ణం! భార్య కాల్ లిస్ట్‌తో వీడిన మిస్ట‌రీ
  • ఖ‌మ్మం పోలీసుల అదుపులో నిందితులు

విధాత: ద్విచ‌క్ర‌ వాహ‌నంపై వెళుతున్న ఓ వ్య‌క్తిని లిఫ్ట్ అడిగి, వెనుక నుంచి కుక్క‌ల‌ను చంపే సూది మందు పొడిచి వ్య‌క్తి మృతికి కార‌ణ‌మైన కేసులో ఖ‌మ్మం పోలీసులు పురోగ‌తి సాధించారు. అక్ర‌మ సంబంధాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని ప్రాథ‌మికంగా పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. హ‌తుడి భార్య ఫోన్ కాల్ జాబితాతో ఈ సూది మందు హ‌త్య వెనుక దాగున్న మిస్ట‌రీకి తెర‌ప‌డింద‌ని చెబుతున్నారు. నిందితులకు ఓ ఆర్ ఎంపీ డాక్ట‌ర్ స‌హ‌కారం అందించార‌ని అంటున్నారు.

ఖ‌మ్మం జిల్లా చింత‌కాని మండ‌లం మున్నేటికి చెందిన ఇద్ద‌రు వ్య‌క్తులు (ఇద్ద‌రూ డ్రైవ‌ర్లే) ఈ హ‌త్య‌లో పాలుపంచుకోగా, వీరికి ఒక ఆర్ ఎంపీ డాక్ట‌ర్ స‌హ‌క‌రించిన‌ట్లు ఖ‌మ్మం సీపీ విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింది. ప‌క్కా ప్లాన్‌తోనే జ‌మాల్‌సాహెబ్‌ను హ‌త్య చేసిన‌ట్లు నిందితులు విచార‌ణ‌లో చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

వివాహేత‌ర సంబంధం కార‌ణ‌మై ఉంటుందా అన్న కోణంలో పోలీసులు జ‌రిపిన విచార‌ణ‌తో కేసు మిస్ట‌రీ వీడిపోయింది. హ‌తుడి భార్య ఫోన్ కాల్ లిస్టులో నిందుతుల ఫోన్ల‌కు ఎక్కువ‌సార్లు ఫోన్లు వెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

ఖ‌మ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి-బాణాపురం గ్రామాల మధ్య సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపడమే కాకుండా.. తెలియ‌ని వ్యక్తులకు లిఫ్టు ఇవ్వాలంటేనే వ‌ణికిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్‌.జమాల్‌సాహెబ్‌(48) సుతారీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నాడు.

సోమవారం ఉదయం ఖమ్మం జిల్లాకు సరిహద్దున ఉన్న ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలోని తన పెద్ద కుమార్తె ఇంటికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో బాణాపురం గ్రామం దాటిన తర్వాత వల్లభి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మాస్క్‌ ధరించి లిఫ్టు కావాలని అడిగాడు. ఈ క్రమంలో జమాల్‌ సాహెబ్‌ సాయం చేద్దామన్న ఉద్దేశంతో సదరు వ్యక్తిని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు.

కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఆ వ్యక్తి జమాల్‌సాహెబ్‌ తొంటి భాగంలో ఇంజక్షన్‌ పొడిచాడు. గమనించిన జమాల్‌సాహెబ్‌ ద్విచక్ర వాహనం వేగం తగ్గించి బైక్‌ ఆపే ప్రయత్నం చేయగా ఆగంతుకుడు బైక్‌ దిగి ప్రణాళిక ప్రకారం అతని కోసం అప్పటికే వారిని అనుసరిస్తూ వచ్చిన మరో ద్విచక్రవాహనంపై ఎక్కి పరారయ్యాడు. ఆ తర్వాత జమాల్‌సాహెబ్‌ కొంతదూరం వెళ్లిన తర్వాత కళ్లు తిరగడం, విపరీతంగా దాహం వేయడంతో రహదారి పక్కనున్న దాసరి తిరుపతిరావు అనే వ్యక్తిని తాగునీరు అడిగాడు.

గుర్తు తెలియని వ్యక్తి ఒకరు తనను లిఫ్టు అడిగి ఎక్కాడని, కొంత దూరం వచ్చాక తనకు ఇంజక్షన్‌ చేసి పారిపోయాడని, తన కుమార్తెకు ఫోన్‌ చేయాలని చెప్పి స్పృహ తప్పిపడిపోయాడు. దాంతో తిరుపతిరావు అతడి స్నేహితుడైన శివ సాయంతో జమాల్‌సాహెబ్‌ను వల్లభి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడి వైద్యుడు ధర్మేందర్‌ ప్రథమ చికిత్స చేసే లోగానే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సూది గుచ్చి పారిపోయిన అగంతుకుడి కోసం సీసీ టీవీ పుటేజీలను, సెల్‌ఫోన్‌ సిగ్నళ్లను పరిశీలించి భిన్నకోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. అలాగే నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వ్యక్తిగత కక్షలా.. ఇంకేమైనా కారణాలా? ఆగంతుకుడు తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తి తొంటిభాగంలో ఇంజక్షన్‌ పొడిచి విషం ఎక్కించడం, వాహనదారుడు గుర్తించి బైక్‌ ఆపేలోపు తనకు సహాయంగా వచ్చిన మరో వ్యక్తి బైక్‌పై పరారవడం, జమాల్‌సాహెబ్‌ మరణించడం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

అయితే ఆగంతుకుడు జమాల్‌ సాహెబ్‌ను వ్యక్తిగత కక్షతో హత్య చేశాడా? లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా కొత్తగా రూపొందించిన సూది మందును పరీక్షించేందుకు ఇలా చేశారా? అన్న కోణాల్లో పోలీసులు లోతైన ద‌ర్యాప్తు జ‌రిపారు.

ఇంజక్షన్‌ ఇచ్చిన అనంతరం దుండగుడు పారిపోయే సమయంలో సిరంజీ, సూది, తాను ధరించిన మాస్కును అక్కడే వదిలివెళ్లగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని విష ప్రయోగానికి వాడిన మందును తెలుసుకొనేందుకు నమూనాలు, అలాగే శవపరీక్ష సమయంలో మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు.

జమాల్‌సాహెబ్‌ అల్లుడు లాల్‌సాహెబ్‌ ఫిర్యాదు మేరకు ముదిగొండ ఎస్‌ఐ తోట నాగరాజు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తానికి 48 గంటల్లోనే పోలీసులు ఈ కేసు మిస్ట‌రీని ఛేదించారు.