Nakrekal | పొంగులేటితో వేముల.. రాజుకున్న నకిరేకల్ రాజకీయం.!

విధాత : నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గం రాజకీయాలు మరోసారి రగులుకున్నాయి. సూర్యాపేటలో ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ గతంలోను భేటీ అయినట్లుగా ప్రచారం జరిగినప్పటికి దానిని వీరేశం కొట్టిపారేశారు. తాజాగా శనివారం వాళ్లిద్దరూ పెళ్లి వేడుకలో కలుసుకోవడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. నకిరేకల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేసిన […]

  • By: krs    latest    Jun 10, 2023 8:24 AM IST
Nakrekal | పొంగులేటితో వేముల.. రాజుకున్న నకిరేకల్ రాజకీయం.!

విధాత : నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గం రాజకీయాలు మరోసారి రగులుకున్నాయి. సూర్యాపేటలో ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలు కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరూ గతంలోను భేటీ అయినట్లుగా ప్రచారం జరిగినప్పటికి దానిని వీరేశం కొట్టిపారేశారు.

తాజాగా శనివారం వాళ్లిద్దరూ పెళ్లి వేడుకలో కలుసుకోవడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. నకిరేకల్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేసిన వీరేశం, కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరము లింగయ్య బీఆర్ఎస్‌లో చేరిపోవడంతో నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాలలో వీరేశం జోరుకు అడ్డుకట్ట పడింది.

అయితే.. పార్టీలో లింగయ్య చేరికను జీర్ణించుకోలేని వీరేశం వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేసి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వీరేశంకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ నుండి మొండి చేయి ఎదురైన పక్షంలో పొంగులేటి బాటలో సాగి లింగయ్యను ఢీ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పొంగులేటి, వీరేశంల కలయిక జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని పొంగులేటి ప్రకటించిన నేపద్యంలో వీరేశం, పొంగులేటి కలయిక యాదృచ్ఛికంగా జరిగింది కాదని భావిస్తున్నారు.

పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే వీరేశం కూడా ఆ పార్టీలో చేరవచ్చన్న ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ టికెట్ అశవహులలో పలువురు ముఖ్య నేతలు పొంగులేటితో టచ్‌లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

కాగా.. వీరేశంతో పాటు కోదాడ బీఆర్ఎస్ నేత కనమంత రెడ్డి శశిధర్ రెడ్డి, నల్లగొండ బీఆర్ఎస్ మాజీ నేత చకిలం అనిల్ కుమార్లతో పాటు మునుగోడు, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పొంగులేటితో టచ్‌లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.