Nalgonda | 28న కాంగ్రెస్ నిరుద్యోగ ర్యాలీ.. వారికే బాధ్యతలు!
Nalgonda విధాత: కాంగ్రెస్ పార్టీ ఈనెల 28న నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ని సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు, ఎంపీలు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, కే. జానారెడ్డిల సహకారం ఎంతవరకు ఉంటుందోనన్న అనుమానాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీమ్ […]

Nalgonda
విధాత: కాంగ్రెస్ పార్టీ ఈనెల 28న నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ని సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు, ఎంపీలు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, కే. జానారెడ్డిల సహకారం ఎంతవరకు ఉంటుందోనన్న అనుమానాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీమ్ సొంతంగా నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు ఆరంభించింది.
ప్రధానంగా నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహణ బాధ్యతలను యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి, నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గ నేతలు దుబ్బాక నరసింహా రెడ్డి, కొండేటి మల్లయ్యలకు, అలాగే నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ లకు అప్పగించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఈ నెల 21న జరగాల్సిన నలగొండ నిరుద్యోగ నిరసన ర్యాలీ కాస్త వాయిదా పడి, ఏఐసీసీ నేతల జోక్యంతో రేవంత్ కు, సీనియర్లకు కుదిరిన సయోధ్య నేపథ్యంలో 28వ తేదీకి మారింది.
అయితే నిరుద్యోగ నిరసన ర్యాలీలో వాస్తవంగా నల్గొండ సీనియర్లు ఎవరెవరు హాజరవుతారన్న దానిపై పార్టీ నేతల్లోనే స్పష్టత లేకుండా పోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలోని నల్గొండ ఎంజి యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన ర్యాలీ జరుగుతున్నప్పటికీ తాను ఆ రోజు అందుబాటులో ఉండకపోవచ్చునని, అయితే తన అనుచర వర్గాన్ని ర్యాలీకి పంపిస్తానని వెంకటరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
ఒకవేళ సీనియర్ల సహకారం కొరవడినప్పటికీ నిరుద్యోగ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్న కసితో ఉన్న రేవంత్ రెడ్డి ర్యాలీకి విద్యార్థులను, నిరుద్యోగ యువతను, పార్టీ శ్రేణులను, ప్రజలను తరలించే ఏర్పాట్లను, హైదరాబాద్ నుండి నల్గొండ(Nalgonda) వరకు ప్రచార ఏర్పాట్లను కుంభం, దుబ్బాక, చల్లమలలకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన ర్యాలీ జిల్లా కేంద్రం నల్గొండ పట్టణానికి దూరంగా ఉన్న ఎంజి యూనివర్సిటీకే పరిమితం చేయకుండా అక్కడి నుండి నల్గొండ పట్టణం గడియారం సెంటర్ వరకు రోడ్ షో మాదిరిగా నిర్వహించి ఇక్కడ తన ప్రసంగం ఉండేలా చూడాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తుంది. అయితే నల్గొండ పట్టణంలో రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్రమం తాను స్థానికంగా లేనప్పుడు నిర్వహించడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది మరో సమస్యగా తయారైంది.
వెంకట్ రెడ్డి ఏదో ఒక అభ్యంతరం లేవనెత్తి ఎంజి యూనివర్సిటీ లో తలపెట్టిన రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన ర్యాలీకి దూరంగా ఉండే అవకాశం లేకపోలేదని రేవంత్ వర్గీయులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరసన ర్యాలీ నల్గొండ నియోజకవర్గ కేంద్రం వరకు నిర్వహించిన పక్షంలో వెంకటరెడ్డి స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.