Nalgonda: గులాబీ కోటలో హ్యాట్రిక్ వీరులెవ్వరో..?

పొత్తులు, పోటీదారులతో సిట్టింగుల్లో గుబులు విధాత: ఉమ్మడి నల్గొండలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు గులాబీ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలో కొనసాగుతుండగా వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా? హ్యాట్రిక్ విజయాలనందుకునే వారెవ్వరన్న చర్చలు నియోజకవర్గాల్లో మొదలయ్యాయి. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నాయకుల నుండి టికెట్ల పోటీ, వామపక్షాల పొత్తుల కత్తులు నిద్ర లేకుండా […]

Nalgonda: గులాబీ కోటలో హ్యాట్రిక్ వీరులెవ్వరో..?

పొత్తులు, పోటీదారులతో సిట్టింగుల్లో గుబులు

విధాత: ఉమ్మడి నల్గొండలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు గులాబీ పార్టీ బీఆర్ఎస్ ఖాతాలో కొనసాగుతుండగా వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందా? హ్యాట్రిక్ విజయాలనందుకునే వారెవ్వరన్న చర్చలు నియోజకవర్గాల్లో మొదలయ్యాయి.

మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నాయకుల నుండి టికెట్ల పోటీ, వామపక్షాల పొత్తుల కత్తులు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

ఆలేరు నియోజకవర్గం

ఆలేరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి హ్యాట్రిక్ విజయ సాధనకు మూడోసారి పోటికీ టికెట్ సాధించే విషయంలో ఆమె భర్త మహేందర్ రెడ్డి అడ్డంకిగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తానే బరిలోకి దిగాలని మహేందర్ రెడ్డి ఆసక్తిగా ఉండగా, ఆయనతోపాటు ఇటీవల మళ్లీ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ కూడా టికెట్ రేసులో ఉన్నారు.

అయితే మహేందర్ రెడ్డి కుటుంబ ఏకచ్చాత్రాధిపత్యం పట్ల నియోజకవర్గ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉన్నా..వారికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో భిక్షమయ్యగౌడ్ మినహా మరో బలమైనా నాయకులెవరు లేకపోవడం వారికి కలిసి వస్తుంది.

సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి సునీతకు టికెట్ ఇస్తే ఆమె హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తుందో లేదో ఎన్నికల క్షేత్రంలో తేలాల్సి ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, యాదాద్రి ఆలయ నిర్మాణం సహా నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి విజయాన్ని అందిస్తాయని ధీమాగా ఉన్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలయ్య, బీజేపీ నుంచి కాసం వెంకటేశ్వర్లు, దాసరి మల్లేశం టికెట్ ఆశిస్తున్నారు. ఎన్నికల నాటికి వలస నేతలు.. కొత్త ముఖాలు కూడా టికెట్ రేసులోకి వచ్చే అవకాశం ఉంది.

భువనగిరి నియోజకవర్గం

అటు భువనగిరి నియోజకవర్గంలో మూడోసారి పోటీకి దిగి హ్యాట్రిక్ విజేత కావాలని ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఈ దఫా టికెట్ విషయంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రూపంలో పోటీ నెలకొంది. నియోజకవర్గ పార్టీలో అంతర్గత గ్రూపులు నానాటికి బలపడుతుండడం పైళ్లకు, మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటం.. సందీప్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి వెంట నడుస్తుండడం పార్టీలో పైళ్లకు కొంత ఇబ్బందికరంగా మారింది.

ప్రజల్లో మాత్రం పెద్దగా వ్యతిరేకత లేకపోవడం ఆయనకు సానుకూలంగా ఉంది. ఇక్కడ సీఎం కేసీఆర్ మరోసారి శేఖర్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే శేఖర్ రెడ్డి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి రెండోసారి బరిలోకి దిగనున్నకుంభం అనిల్ కుమార్ రెడ్డితో, బిజెపి ఆశావాహులు జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, బూర నర్సయ్య గౌడ్ లలో ఒకరితో త్రిముఖ పోటీ ఎదుర్కొనక తప్పదు.

తుంగతుర్తి నియోజకవర్గం

ఎస్సీ రిజర్వుడు తుంగతుర్తి నియోజకవర్గం నుండి కూడా గాదరి కిషోర్ వచ్చే ఎన్నికల్లో మూడోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఆయనకు సొంత పార్టీ నుండి మందుల సామేల్, తెలంగాణ జాగృతి నాయకులు రాజీవ్ సాగర్ నుండి టికెట్ విషయంలో కొంత పోటీ ఉంది.

కాంగ్రెస్ నుండి వరుసగా మూడోసారి పోటీ చేస్తారనుకుంటున్న అద్దంకి దయాకర్ బలమైన ప్రత్యర్థిగా నిలవనున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుడు వడ్డేపల్లి రవి, మాజీ ఎమ్మెల్యే గుడిపాటి నర్సయ్య, అన్నేపర్తి జ్ఞాన‌ సుందర్, నాగరిగారి ప్రీతం కూడా కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నా.. ఎన్నికల నాటికి కాంగ్రెస్ టికెట్ ఇక్కడ ఎవరికి దక్కుతుందో తేలాల్సి ఉంది.

దేవరకొండ నియోజకవర్గం

ఎస్టీ రిజర్వుడ్ దేవరకొండ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ ఇప్పటికే మూడుసార్లు విజయం సాధించినప్పటికి వరుస విజయాల హ్యాట్రిక్ ను మాత్రం కొట్టలేదు. 2004, 2014, 2018 ఎన్నికల్లో సిపిఐ నుండి గెలిచిన రవీంద్ర కుమార్ గత ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ లో చేరిపోయారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టికెట్ సాధించి పోటీ చేస్తే ఆయన కూడా హ్యాట్రిక్ విజయాల రేసులో నిలవనున్నారు. సొంత పార్టీలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం కొంత ఈ దఫా టికెట్ సాధనలో రవీంద్ర కుమార్ కు ఆటంకంగా తయారైంది.

టికెట్ సాధిస్తే రవీంద్ర కుమార్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఎన్. బాలునాయక్ తో, బిజెపి నుండి బరిలోకి దిగే అభ్యర్థులతో గట్టి పోటీ తథ్యంగా కనిపిస్తుంది. అదికాక సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా దేవరకొండ సీటును కోరిన పక్షంలో రవీంద్ర కుమార్ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది.

మిర్యాలగూడ నియోజకవర్గం

మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని తహతహలాడుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావుకు ఈదఫా నియోజకవర్గంలో గట్టి పోటీ తప్పకపోవచ్చు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి పార్టీ టికెట్ విషయంలో భాస్కర రావుకు ప్రత్యామ్నాయంగా ఉన్నారు.

మూడోసారి పోటీకి దిగితే భాస్కర్ రావు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కే. జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీరా రెడ్డిలతో ముఖాముఖి పోటీ తప్పదు. బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారో ఎన్నికల నాటికి స్పష్టత రానుంది. అయితే వామపక్షాల పొత్తులో సిపిఎం మిర్యాలగూడ సీటును కోరుతుండడం భాస్కరరావుకు తలనొప్పిగా మారింది.

సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గం

సూర్యాపేట నుండి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మూడో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాల నమోదుకు సిద్ధమవుతున్నారు. అనుచరులకే ప్రాధాన్యతనిస్తారంటూ కొంత కేడర్లో నెలకొన్న అసంతృప్తి మినహా మంత్రిగా చేసిన నియోజకవర్గం అభివృద్ధి ఆయనకు హ్యాట్రిక్ విజయాలను కట్టబెడుతుందని జగదీష్ రెడ్డి ధీమాగా ఉన్నారు.

రానున్న ఎన్నికల్లో జగదీష్ రెడ్డికి మరోసారి కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, బిజెపి నుండి సంకినేని వెంకటేశ్వరరావు, బూర నర్సయ్య గౌడ్ రూపంలో బలమైన అభ్యర్థుల నుండి పోటీ ఎదురుకానుంది. అయినా రెండు పర్యాయాలు మంత్రిగా కొనసాగుతున్న జగదీష్ రెడ్డికి కాంగ్రెస్, బిజెపిలు ఎంత మేరకు పోటీనిస్తాయన్నది ఎన్నికలే తేల్చాల్సి ఉంది.

మునుగోడు నియోజకవర్గం

మునుగోడు నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో నెగ్గిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం మూడో విజయం కోసం ఆశ పెట్టుకున్నారు. అయితే ఆయనకు వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ దక్కడం కష్టంగా కనిపిస్తుంది. పార్టీ ముఖ్యులంతా వ్యతిరేకించినా సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల్లో కూసకుంట్లనే బరిలోకి దించి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించే లక్ష్యంతో సర్వశక్తులొడ్డి అతి కష్టంగా గెలిపించారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి కూసుకుంట్లకు టికెట్ విషయంలో అసంతృప్తివాదులైన కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, పల్లె రవి నుండి పోటీ తప్పదు. సీఎం కేసీఆర్ నాల్గవ సారి కూడా కూసుకుంట్లకే టికెట్ కేటాయిస్తే ఆయన ఎన్నికల్లో బిజెపి నేత రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాష్, పాల్వాయి స్రవంతిలలో ఒకరితో త్రిముఖ పోటీ ఎదుర్కొనక తప్పదు.

అయితే మిత్రపక్షం సిపిఐ ఇక్కడ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతుండడంతో పొత్తుల్లో భాగంగా ఆ పార్టీకి సిట్టింగ్ స్థానాన్ని బిఆర్ఎస్ వదులుకుంటే పార్టీ టికెట్ ఆశలు పెట్టుకున్న కూసుకుంట్ల సహా ఇతర ఆశావాహులకు నిరాశ తప్పదు.

నకిరేకల్ నియోజకవర్గం

ఎస్సీ రిజర్వుడులో సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గతంలో 2009, 2018 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. గత ఎన్నికల అనంతరం బిఆర్ఎస్ లో చేరిన చిరుమర్తి లింగయ్యకు ఈ దఫా ఎన్నికల్లో మూడో విజయం అందుకోవాలని ఆశిస్తున్నారు.

ఆయనకు పార్టీ టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నుండి నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. సీఎం కేసీఆర్ వారిలో ఎవరికి టికెట్ ఇస్తారో గాని నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ మాత్రం చిరుమర్తి, వేముల గ్రూపులుగా చీలిపోయింది.

బిఆర్ఎస్ నుండి టికెట్ సాధించే అభ్యర్థి ప్రత్యర్థి కాంగ్రెస్, బిజెపిల అభ్యర్థులతోనే కాకుండా సొంత పార్టీ గ్రూపులతో పోరాడక తప్పని పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. కాంగ్రెస్ నుండి దైద రవీందర్, కొండేటి మల్లయ్య టికెట్ ఆశిస్తున్నారు. బిజెపి మాత్రం వలసనేతలపై ఆశలు పెట్టుకుంది.

కోదాడ నియోజ‌క‌వ‌ర్గం

కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు మరోసారి టికెట్ విషయంలో కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, వెనపల్లి చందర్ రావు నుండి పోటీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా బిఆర్ఎస్ లో చేరి అంతే అనూహ్యంగా టికెట్ సాధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ పై విజయం సాధించిన మల్లయ్యయాదవ్ అందరిని ఆశ్చర్య పరిచారు.

రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండోసారి మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇస్తే ఆయన మరోసారి పద్మావతి ఉత్తమ్ తోనే ముఖాముఖి పోటీ పడనున్నారు. బిజెపి అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తండ్రి నోముల నరసింహయ్య అకాల మరణంతో ఉప ఎన్నికల్లో గెలిచిన నోముల భగత్ రెండోసారి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు సొంత పార్టీ నుండి ఎమ్మెల్సీ కోటిరెడ్డి టికెట్ విషయంలో గట్టి పోటీదారుగా ఉన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు ఉన్న కోటిరెడ్డి కొంతకాలంగా నియోజకవర్గంలో తన కార్యకలాపాలు విస్తృతం చేయడం నోముల భగత్ కు మింగుడు పడినదిగా మారింది.

రెండో విజయ సాధనకు ప్రయత్నిస్తున్న నోముల భగత్ కు టికెట్ దక్కితే ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ నుండి సీనియర్ కే.జానారెడ్డి లేదా తనయుడు రఘువీరారెడ్డి నుండి మరోసారి గట్టి పోటీ తప్పదు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల సమయానికి స్పష్టత రానుంది.

హుజూర్ నగర్ నియోజకవర్గం

హుజూర్ నగర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సైతం వరుసగా రెండో విజయం కోసం పట్టుదలగా ఉన్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుండి హ్యాట్రిక్ విజయాలు సాధించిన పిసిసి మాజీ చీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో వచ్చిన 2019 ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిపై సైదిరెడ్డి సంచలన విజయం సాధించారు.

సైదిరెడ్డి అదే ఊపులో నియోజకవర్గంలో తన బలం పెంచుకునేందుకు నిరంతర శ్రమిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ నుండి ఆయనకు టికెట్ విషయంలో పెద్దగా పోటీ కనిపించడం లేదు. అయితే ఆయన దూకుడు వ్యవహార శైలి పట్ల పార్టీలో, నియోజకవర్గంలో కొంత అంతర్గత అసంతృప్తి నెలకొంది.

రానున్న ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుండి పోటీ చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతుండడంతో మరోసారి సైదిరెడ్డి ముఖాముఖి పోటీ ఎదుర్కొనున్నారు. బిజెపి నుండి గట్టు శ్రీకాంత్ రెడ్డి పోటీకి దిగవచ్చు.

నలగొండ నియోజకవర్గం

నలగొండ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ పై భరోసాగా ఉన్నారు. అయితే టికెట్ విషయంలో ఈ దఫా కూడా భూపాల్ రెడ్డికి గుత్తా తనయుడు అమిత్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, మొన్నటి వరకు కంచర్లకు ప్రధాన అనుచరుడిగా ఉన్న పిల్లి రామరాజులు గట్టి సవాల్ గా మారారు.

సీఎం కేసీఆర్ దత్తత నియోజకవర్గమైన నల్లగొండలో వందల కోట్ల అభివృద్ధి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నమ్మకంతో ఆశావహులు పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల అంతర్గతంగా నెలకొన్న తీవ్ర అసంతృప్తి సైతం వారికి కొంత కలిసి రానుంది.

ఇంకోవైపు సీపీఎం సైతం మిర్యాలగూడతో పాటు నల్లగొండ సీటుపై కన్నేయడంతో ఎన్నికల నాటికి సీఎం కేసీఆర్ పార్టీ టికెట్, సీట్ల కేటాయింపులపై తీసుకునే నిర్ణయం పైనే కంచర్ల టికెట్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ప్రకటించగా, నియోజకవర్గం కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహారెడ్డి పోటీ విషయం సందిగ్ధంలో పడింది.

బీజేపీ నుంచి బీసీ నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్, నూకల నరసింహారెడ్డిల పోటీకి ఆసక్తిగా ఉన్నప్పటికి ఎన్నికల నాటికి మరో బలమైన అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు.

మొత్తం మీద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న 12 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో తిరిగి ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపైనే ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల హ్యాట్రిక్ విజయాలు, రెండోసారి పోటీ చేసే వారి గెలుపు ఆశలు ఆధారపడి ఉండటం కొసమెరుపు.