జైలులో బాబు.. బయట కుటుంబం.. సత్యమేవ జయతే నిరసన దీక్షలు

  • By: Somu    latest    Oct 02, 2023 10:25 AM IST
జైలులో బాబు.. బయట కుటుంబం.. సత్యమేవ జయతే నిరసన దీక్షలు

విధాత, టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట టీడీపీ చేపట్టిన దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగాయి. రాజమండ్రి జైలులోనే చంద్రబాబు దీక్ష కొనసాగించగా, బయట ఇదే పట్టణంలోని క్వారీ మార్కెట్‌ ఏరియాలో ఆయన సతీమణి భువనేశ్వరి దీక్ష నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భువనేశ్వరి దీక్షలో కూర్చున్నారు.


తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సహా పలువురు మహిళా నేతలు భువనేశ్వరితో పాటు దీక్షలో పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలు కూర్చున్నారు. అటు న్యూ ఢిల్లీలో లోథి ఎస్టేట్‌లో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసం వద్ధ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పార్టీ ఎంపీలు కేశినేని నాని, రఘురామకృష్ణంరాజుతో పాటు పార్టీ సీనియర్లతో దీక్ష నిర్వహించారు.


హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరీలు దీక్ష నిర్వహించారు. వారితో పాటు దివంగత తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, ఎన్టీఆర్‌ మనువడు గారపాటి శ్రీనివాస్‌, కుటుంబ సభ్యులు నందమూరి జయశ్రీ, నారా రోహిత్‌ తల్లి నారా ఇందిరా, టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు నిరసన దీక్షలో పాల్గొన్నారు.