భారత్‌ను హడలెత్తిస్తున్న నార్కోటిక్‌ టెర్రరిజం

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు స్వర్గధామంగా గుజరాత్‌ సముద్రతీరం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌.. హైద‌రాబాద్‌లో త‌యారీ కేంద్రం.. విధాత: గుజరాత్‌ సముద్రతీర జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన మాదక ద్రవ్యాలతో కూడిన పడవను పట్టుకొన్న ఘటన మరువక ముందే.., హైదరాబాద్‌లో ఏకంగా మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాలు బయట పడటం దేశంలో డ్రగ్‌ దందా ఏ రీతిన సాగుతున్నదో అద్దం పడుతున్నది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటలిజెన్స్ రెవెన్యూ (డీఆర్‌ఐ), మాదక ద్రవ్యాల నిరోధక పోలీసులు కలిసి హైదరాబాద్‌లో […]

భారత్‌ను హడలెత్తిస్తున్న నార్కోటిక్‌ టెర్రరిజం
  • మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు స్వర్గధామంగా గుజరాత్‌ సముద్రతీరం
  • ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌..
  • హైద‌రాబాద్‌లో త‌యారీ కేంద్రం..

విధాత: గుజరాత్‌ సముద్రతీర జలాల్లో పాకిస్థాన్‌కు చెందిన మాదక ద్రవ్యాలతో కూడిన పడవను పట్టుకొన్న ఘటన మరువక ముందే.., హైదరాబాద్‌లో ఏకంగా మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాలు బయట పడటం దేశంలో డ్రగ్‌ దందా ఏ రీతిన సాగుతున్నదో అద్దం పడుతున్నది.

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటలిజెన్స్ రెవెన్యూ (డీఆర్‌ఐ), మాదక ద్రవ్యాల నిరోధక పోలీసులు కలిసి హైదరాబాద్‌లో రెండుచోట్ల మాదక ద్రవ్యాల తయారీ కేంద్రాల(ల్యాబ్‌లు)ను పట్టుకొన్నారు. ఈ తయారీ కేంద్రాల్లో రూ. 49.77 కోట్ల విలువగల 24.885 కిలోల మెఫిడ్రోమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.18.90లక్షల విలువగల మాదక ద్రవ్యాల తయారీ ముడిపదార్థాలు కూడా స్వాధీనం చేసుకొన్నారు. దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టుచేశారు.

ఈ మొత్తం డ్రగ్‌ రాకెట్‌కు ఆర్థిక వనరులు, సరఫరాలను చూస్తున్న ప్రధాన వ్యక్తిని రూ. 60 లక్షలతో నెపాల్‌ పారిపోయే ప్రయత్నంలో ఉండగా గోరఖ్‌పూర్‌లో నిర్బంధంలోకి తీసుకొన్నారు.

సాధారణంగా మాదక ద్రవ్యాలు విదేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. కానీ ఈ మధ్య దేశంలో డ్రగ్‌ తయారీ కేంద్రాలే పట్టుబడటం ఆందోళన కలిగిస్తున్నది. డ్రగ్‌ తయారీ కేంద్రాలను పట్టుకోవటం ఇది రెండో సారి. 2022 జూలై-ఆగస్టులో హర్యానా యమునానగర్‌లో కూడా ఓ డ్రగ్‌ తయారీ కేంద్రాన్ని కనుగొన్నారు.

హైదరాబాద్‌లో పట్టబడిన నిందితులది ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి కేసుల్లో వీరు అరెస్టయి ఉండటం గమనార్హం. 2016లో డీఆర్‌ఐ అధికారులు ఇండోర్‌లో వీరినుంచే 230 కిలోల ఉఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే యమునానగర్‌లో 2022 జూన్‌లో 662 కిలోల ఎఫిడ్రిన్‌ను పట్టుకొన్నారు. వీరిపై హైదరాబాద్‌లో హత్యకేసు ఉన్నది. వడోధరలో దొంగతనం కేసులు కూడా నమోదై ఉన్నాయి.

మాదక ద్రవ్యాల కేసులు వెలుగులోకి రావటం కరోనా తర్వాత కాలంలో ఎక్కువగా ఉంటున్నది. 2018లో 193 కేసుల్లో 269 మందిని యాంటీ నార్కోటిక్‌ అధికారులు, డీఆర్‌ఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1,021 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు.

అదే 2022 నంబర్‌ వరకు చూస్తే… 990 కిలోల హెరాయిన్‌, 88 కిలోల కొకైన్‌, 10వేల మెథాంఫిటమిన్‌ ట్యాబ్‌లెట్లు, 2,400 లీటర్ల ఫిన్సిఫైల్‌ కాఫ్‌ సిరప్‌ను పట్టుకొన్నారు. ఈ గణాంకాలు చూస్తే… దేశంలో మాదక ద్రవ్యాల భూతం ఎంతగా విస్తరించి ఉన్నదో తెలుపుతున్నది. ఈ పరిస్థితినే సామాజిక వేత్తలు నార్కో టెర్రరిజంగా చెప్తున్నారు.

నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), డీఆర్‌ఐ, ఇండియన్‌ కోస్ట్ గార్డ్, ఏటీఎస్‌ అధికారుల నిఘాతో ఈ మధ్య కాలంలో దేశంలో ఏదో మూల డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే… మాదక ద్రవ్యాలకు సింహద్వారంగా గుజరాత్‌ సముద్రతీరమే ఉండటం విశేషం.

ఒక్క గుజరాత్‌.. కాండ్లా పోర్టు నుంచే ఏటీఎస్‌, డీఆర్‌ఐ, ఇండియన్‌ ఆర్మీ, నార్కోటిక్‌ అధికారులు750 కిలోల డ్రగ్‌ను పట్టుకొన్నారు. దీని విలువ సుమారు 2 వేల కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ముంద్రా పోర్టు నుంచి 75 కిలోల హెరాయిన్‌ పట్టుకొన్నారు. ఈ ఒక్క ముంద్రా పోర్టు నుంచే 2,988.21 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. దీని విలువ దాదాపు 21వేల కోట్లుంటుందని అంచనా.

నిన్న గాక మొన్న భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థాన్‌ పడవను భారత నేవీ అధికారులు గుర్తించి నిలువరించి స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న పది మంది అనుమానస్పదంగా కనిపించటంతో పడవలో వెతకగా.. 300 కోట్ల విలువైన 40 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుపడ్డాయి.

అలాగే అనేక మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి పట్టుబడింది. ఇలా పాక్‌ పడవ పట్టుబడటం ఇది ఏడోది. మొత్తంగా పాక్‌ పడవల నుంచి 1,930 కోట్ల విలువైన హెరాయిన్‌ను మన సముద్రతీర రక్షక దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. 44 మంది పాకిస్థానీయులను అదుపులోకి తీసుకొన్నారు.

ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్‌ క్రిమినల్‌ రికార్డ్స్ రిపోర్ట్-2022 ప్రకారం… మాదకద్రవ్యాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ తయారైంది. ఆ క్రమంలోనే గుజరాత్‌ సముద్ర తీరం డ్రగ్‌ అక్రమ రవాణాకు గోల్డెన్‌ గేట్‌గా మారిందని తెలియజేసింది.

మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న ప్రాంతాల్లో పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముందువరుసలో ఉన్నాయనీ, గుజరాత్‌లో డ్రగ్‌ తీసుకోవటం ద్వారా అధిక మరణాలు సంభవిస్తున్నాయని యూఎన్‌ రిపోర్ట్ వివరించింది. యూఎన్‌ రిపోర్టు చూసిన తర్వాతనైనా డ్రగ్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.