Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్

Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్

Sandhya Theater Incident: విధాత,హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వివాదంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా స్పందించింది. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇప్పటిదాకసమగ్ర నివేదిక లేకపోవడంపై ఎన్‌హెచ్ఆర్సీ.. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సీపీ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం..ఆమె కుమారుడు తేజాకు తీవ్ర గాయలవ్వడం తెలిసిందే.

ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం..పోలీసులు లాఠీజాఛార్జ్ చేయడంతోనే తొక్కిసలాట జరిగిందని..దీంతో మహిళ చనిపోవడం..బాలుడికి తీవ్ర గాయాలయ్యాని న్యాయవాది రామారావు ఎన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్ సీనియర్ ర్యాంకు పోలీస్ అధికారితో విచారణ జరిపించి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఎన్ హెచ్ఆర్సీసీకి సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉండటంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని కమిషన్ నిలదీసింది. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, లాఠీ ఛార్జ్ చేయలేదని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్ కి ఎలా వస్తారంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరువారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది.