దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదట.. మరెవరంటే..!

  • By: Somu    latest    Sep 28, 2023 10:39 AM IST
దేశ తొలి ప్రధాని నెహ్రూ కాదట.. మరెవరంటే..!

విధాత‌: భారతదేశ తొలి ప్రధాని ఎవరంటే జవహర్‌లాల్‌ నెహ్రూ అని చిన్న పిల్లలు కూడా చెబుతారు. కానీ.. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్‌ యత్నాల్‌ మాత్రం తొలి ప్రధాని నెహ్రూ కాదని చెబుతున్నారు. మోదీ కూడా ఇదే విషయం చెబుతున్నారన్న బసన్‌గౌడ.. దానికి కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈయన చేసిన వ్యాఖ్యలు సహజంగానే దుమారాన్ని లేపాయి. ఒక కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే.. ‘నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని కాదు. తొలి ప్రధాని సుభాష్‌ చంద్రబోస్‌’ అని చెప్పారు.


బ్రిటిష్‌వారిలో బోసు పట్ల భయం ఉండటం వల్లే వారు దేశం విడిచి వెళ్లిపోయారనీ అన్నారు. ‘నిరాహార దీక్షల వల్లనో, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించినందుకుకో మనకు స్వాతంత్ర్యం రాలేదని, కానీ.. సుభాష్‌ చంద్రబోస్‌ బ్రిటిష్‌వారిలో కలుగజేసిన భయం వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఒక పుస్తకంలో రాశారు’ అని ఆయన తెలిపారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్‌వాళ్లు దేశం వదిలి వెళ్లిపోయారు.


దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్ర్యం ప్రకటించాక సుభాష్‌ చంద్రబోస్‌ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని. వారికి సొంత కరెన్సీ ఉన్నది. సొంత జెండా, జాతీయ గీతం ఉన్నాయి. అందుకే ప్రధాని మోదీ సైతం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని చెబుతారు’ అని ఆయన పేర్కొన్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బసన్నగౌడ పాటిల్‌ వార్తల్లో ఉంటుంటారు. మొన్న ఆగస్ట్‌లో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరేడు నెలల్లోనే కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు వల్లే ప్రభుత్వం పడిపోతుందని అన్నారు.