BJP | నామమాత్రంగా.. BJP సంస్థాగతం.. బూత్‌ల బాట పట్టని నాయకత్వం!

విధాత, తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికార సాధనకు ఉవ్విల్లూరుతున్న BJP నాయకత్వం పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా చేపడుతున్న కార్యక్రమాలు అమలులో మాత్రం విఫలమవుతుంది. ఫలితంగా మండల, నియోజకవర్గ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు పేపర్లపై రాసిన లెక్కలతో పార్టీ సంస్థాగత బలగం గొప్పగా కనిపిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ గణాంకాల ఆధారంగా కార్యకర్తల బలం కరువై పార్టీ కార్యక్రమాలు అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది. నల్గొండ జిల్లాలో 1600కు పైగా బూత్ లకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం లో […]

  • By: krs    latest    Apr 04, 2023 7:43 AM IST
BJP | నామమాత్రంగా.. BJP సంస్థాగతం.. బూత్‌ల బాట పట్టని నాయకత్వం!

విధాత, తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికార సాధనకు ఉవ్విల్లూరుతున్న BJP నాయకత్వం పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా చేపడుతున్న కార్యక్రమాలు అమలులో మాత్రం విఫలమవుతుంది. ఫలితంగా మండల, నియోజకవర్గ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు పేపర్లపై రాసిన లెక్కలతో పార్టీ సంస్థాగత బలగం గొప్పగా కనిపిస్తుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ గణాంకాల ఆధారంగా కార్యకర్తల బలం కరువై పార్టీ కార్యక్రమాలు అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది.

నల్గొండ జిల్లాలో 1600కు పైగా బూత్ లకు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం లో 281 బూత్ లకు పార్టీ కమిటీలు ఉండాల్సివుంది. పేపర్ లెక్కల్లో అవన్నీ కనిపిస్తున్నప్పటికి నిజానికి సగం బూత్ లలో కూడా పూర్తిస్థాయిలో 22 మందితో కమిటీలు లేవని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో అదనంగా బూత్ కమిటీలను విస్తరించాలంటూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమం అమలుకు ఆ పార్టీ స్థానిక నాయకత్వం ఆసక్తి చూపకపోవడం పార్టీ సంస్థాగత బలోపేత లక్ష్యాలను దెబ్బతీస్తుంది. పార్టీ విస్తరణకు కేంద్ర రాష్ట్రస్థాయి బిజెపి నాయకత్వం ప్రదర్శిస్తున్న దూకుడు ధోరణి క్షేత్రస్థాయి నాయకత్వంలో కొరవడం ఆ పార్టీ విస్తరణ బలోపేత లక్ష్యాలను నీరుగారుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దగ్గరపడిన గడువు.. కదలని సశక్తీకరణ్ అభియాన్

బిజెపి సంస్థాగత బలోపేతంలో భాగంగా బూత్ కమిటీల విస్తరణకు ఉద్దేశించిన సశక్తీకరణ అభియాన్ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా పరిధిలో అటు బిజెపి జిల్లా నాయకత్వంతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ శాఖ బాధ్యులు కూడా పట్టించుకోకపోవడంతో నామమాత్రంగా కూడా సాగడం లేదు.

1600కు పైగా ఉన్న బూత్‌లలో ఇప్పటిదాకా పట్టుమని 100 బూత్‌ల్లో కూడా సశక్తీకరణ్ అభియాన్ పూర్తి కాకపోవడం గమనార్హం. సశక్తీకరణ్ కమిటీల ఏర్పాటు గడువు ఈనెల 10 తో ముగియనుంది. సశక్తీకరణ్ అభియాన్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న 22 మందితో కూడిన బూత్ కమిటీకి అదనంగా మరో పదకొండు మందితో కమిటీ వేయాలి. ఇందులో అధ్యక్షుడు కార్యదర్శితో పాటు బూత్ లెవల్ ప్రతినిధికి సహాయకుడిగా బిఎల్ఎ సహాయ ప్రతినిధిని నియమించుకోవాలి.

ప్రధాని మోడీ మనకి బాత్ నిర్వహణ ప్రముఖ్ ను, బూతు ఓటర్లతో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్, ప్రజలతో కలిసి మరో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసే వాట్సాప్ ప్రముఖ్ ను ఎంపిక చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల భేటీ ప్రముఖ్ ను, మహిళా, యువ,సామాజిక వర్గ ప్రముఖ్ లను, ముఖ్య ఓటర్ల భేటీ ప్రముఖ్ ను నియమించుకోవాలి. పార్టీ ఆవిర్భావము,మహనీయుల జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఆరు కార్యక్రమాల అమలు ప్రముఖ్ లను నియమించాలి.

ముఖ్యంగా ప్రతి బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాలో ఒక్కో పేజీకి ఒక పన్నా ప్రముఖ్ లను నియమించి వారితో తరచూ టచ్ లో ఉండాలి. బూత్ పరిధిలో జరిగే సమావేశానికి హాజరైన కార్యకర్తలు విధిగా నిర్దేశిత పార్టీ ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. సరళ యాప్ ను, నమో యాప్ ను అంతా డౌన్లోడ్ చేసుకొని వారి వివరాలు పొందుపరచాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో, కేంద్ర పథకాల లబ్ధిదారులతో, ప్రభావిత వ్యక్తులతో భేటీలు నిర్వహించాలి. ప్రతి బూత్ పరిధిలో నియమితులైన సదరు అల్పకాలిక్ విస్తారక్ ల సహాయంతో ఒక్కో బూత్ లో BJPకి 51 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించే లక్ష్యాల సాధనకు బూత్ సశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్దేశించారు.

పైకి గంభీరంగా ఉన్న బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు గ్రామాల బాట పట్టాల్సిన జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ బాధ్యులు, మండల నాయకులు ఎవరు కూడా ఆ దిశగా కదలకపోవడంతో కమలం పార్టీ బలం కాగితం పులిగా కనిపిస్తుందన్న విమర్శలకు కారణమవుతుంది.

చివరకు నియోజకవర్గ ఇంచార్జిలు, ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నాయకులు కూడా పార్టీ సంస్థాగత లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం లేదని ఆ పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. ఇలాగైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో, రెండు పార్లమెంటు స్థానాల్లో పార్టీ గెలుపు ఆశలు ఎలా నెరవేరుతాయో కమలనాధులకే తెలియాలి.