నోటిఫికేషన్లపై నీలినీడలు!
ఉన్నమాట: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 10 శాతం గిరిజన రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది. ఈ ప్రభావం నోటిఫికేషన్లపై పడుతుందనే అభిప్రాయం ఉన్నది. అదే జరిగితే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా నియామకాలు మరింత జాప్యం కానున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా పార్లమెంటులో దీనికి సంబంధించి చట్టం చేసింది. పార్లమెంటులో చట్టం చేయకుండా 50 శాతానికి […]

ఉన్నమాట: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 10 శాతం గిరిజన రిజర్వేషన్లపై జీవో విడుదల చేసింది. ఈ ప్రభావం నోటిఫికేషన్లపై పడుతుందనే అభిప్రాయం ఉన్నది. అదే జరిగితే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన 80 వేలకు పైగా నియామకాలు మరింత జాప్యం కానున్నాయి.
ఎందుకంటే రిజర్వేషన్లు 50 శాతం దాట కూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా పార్లమెంటులో దీనికి సంబంధించి చట్టం చేసింది. పార్లమెంటులో చట్టం చేయకుండా 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావించినా న్యాయస్థానాల్లో అడ్డంకిగా మారుతుంది అంటున్నారు.
మహారాష్ట్రలో మరాఠీలకు ప్రత్యేక రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళితబంధు వచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక ముందు గిరిజన బంధు ప్రకటన వచ్చింది. మరో ఉప ఎన్నిక వస్తే బహుజన బంధు వస్తుందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తున్నది.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేసీఆర్ ఇస్తున్నగిరిజన బంధు, రిజర్వేషన్ల హామీలన్నీ బూటకమనే మాట నిజమౌతుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ రిజర్వేషన్లపై ఇటు రాజకీయ పార్టీల వాదనలు కొనసాగుతుండగానే, రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలోకి వెళ్తే నోటిఫికేషన్లు ఆగిపోతాయనే ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది.
ఎందుకంటే సీఎం అసెంబ్లీ ప్రకటించినట్టు 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రకటించి నెలలు దాటుతున్నా ఇప్పటికీ పోలీస్, గ్రూప్-1తో పాటు రెండు మూడు ప్రకటనలే వచ్చాయని అభ్యర్థులు అంటున్నారు.
గ్రూప్ 4 నోటిఫికేషన్ త్వరలో అని మంత్రులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ నోటిఫికేషన్ ఊసే లేదు. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో రాబోయే నోటిఫికేషన్లకు అడ్డంకిగా మారుతుందా? అనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఇదిలాఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ 10 ఏళ్ల కిందట అప్పటి బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ నిర్ణయంతో మొత్తం రిజర్వేషన్లు 58 శాతానికి పెరిగాయని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లను 50 శాతం పరిమితికి మించి పెంచడం.. సమాన అవకాశాలను ప్రసాదించే రాజ్యాంగంలోని 16(1) అధికరణానికి విరుద్ధమని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ ఉదంతాలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.