విపక్షాల చీలికే.. BJP పాచిక! ఉమ్మడి పోరుకు సిద్ధమైన ప్రతిపక్షాలు
ఐక్యతను దెబ్బకొట్టేందుకు బీజేపీ యత్నం విపక్షాలు ఒక్క తాటిపైకి వస్తే బీజేపీకి కష్టాలే ముందే గ్రహించిన కాషాయ పార్టీ నాయకత్వం కాంగ్రెస్‌కు దగ్గరయ్యే పక్షాలే కేంద్ర సంస్థల టార్గెట్ నితీశ్, తేజస్వీను కలవగానే రాహుల్‌కు పాట్నా కోర్టు నోటీస్ నితీశ్‌ను కలిసిన మరుసటి రోజే కేజ్రీకు ఈడీ సమన్లు ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను లొంగదీసే యత్నం మిత్రబేధం! మిత్రుల మధ్య చీలిక తెస్తే కలిగే లాభం! ఇప్పుడు సరిగ్గా అదే సూత్రాన్ని బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్నది. […]

- ఐక్యతను దెబ్బకొట్టేందుకు బీజేపీ యత్నం
- విపక్షాలు ఒక్క తాటిపైకి వస్తే బీజేపీకి కష్టాలే
- ముందే గ్రహించిన కాషాయ పార్టీ నాయకత్వం
- కాంగ్రెస్‌కు దగ్గరయ్యే పక్షాలే కేంద్ర సంస్థల టార్గెట్
- నితీశ్, తేజస్వీను కలవగానే రాహుల్‌కు పాట్నా కోర్టు నోటీస్
- నితీశ్‌ను కలిసిన మరుసటి రోజే కేజ్రీకు ఈడీ సమన్లు
- ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను లొంగదీసే యత్నం
మిత్రబేధం! మిత్రుల మధ్య చీలిక తెస్తే కలిగే లాభం! ఇప్పుడు సరిగ్గా అదే సూత్రాన్ని బీజేపీ నాయకత్వం అనుసరిస్తున్నది. తనను వ్యతిరేకించే శక్తులను, తనకు వ్యతిరేకంగా ఏకమయ్యే పార్టీలను నయానో భయానో లొంగదీసుకుంటే ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదని, అది రాబోయే ఎన్నికల్లో తనను మూడోసారి గెలిపిస్తుందని నమ్ముతున్న బీజేపీ.. ఆ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ప్రతిపక్షాల ఐక్యత సాధనలో ముందడుగుగా భావించిన నితీశ్, తేజస్విలతో రాహుల్ గాంధీ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతకు పాట్నా కోర్టు నోటీసులు జారీ చేయడం, నితీశ్‌ను కలిసిన మరుసటి రోజే ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విధాత: కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ తన స్థానాన్ని పదిలపరుచుకొని మూడోసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రయత్నాలను వేగం చేసింది. ఏ పార్టీ అయినా మరోసారి అధికారంలోకి రావాలని భావించే క్రమంలో ప్రజామోదం పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి.
నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుని ఓటింగ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉంటాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలను పక్కనపడేసి.. విపక్షాలను వేధించి, లొంగదీసుకోవడం ద్వారా వాటి ఐక్యతాయత్నాలను దెబ్బతీసి మూడోసారి ఎన్నికలను సునాయాసంగా దాటాలని ప్రయత్నాలు చేస్తున్నదన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
పైకి గట్టిగా కనిపిస్తున్నా.. పదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతరేకత ప్రత్యేకించి ఇటీవలికాలంలో పెరిగిందనేది వాదనలు ఉన్నాయి. అదానీ వ్యవహారం బీజేపీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఢిల్లీలో ఈ నెల 12వ తేదీన సమావేశమయ్యారు. ప్రతిపక్షాల ఐక్యతో ఇదొక కీలక ముందడుగని ఆ రోజు నేతలు ప్రకటించారు.
అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా నితీశ్, తేజస్వి కలిసి, ఐక్యంగా ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చించారు. అంతే మరుసటి రోజున అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీస్‌లు జారీ చేసింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు ఒక కేసులో ఈనెల 14వ తేదీన హాజరు కావాలని ఆదేశించడం యాదృచ్ఛికం కాదేమోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది.
ఇప్పటికే తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి లాలు ప్రసాద్‌ను రైల్వే భూముల కేసులో ఈడీ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఆప్ నేతలు పలువురు అరెస్టయి ఉన్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలను బెదిరించే చర్యలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తాను అధికారంలోకి రాలేక పోయిన రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చి, లేదా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
మొన్నటి మహారాష్ట్ర ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ఒకవైపు చీలికలను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలతో ప్రతిపక్ష నేతల నివాసాల్లో సోదాలు చేయిస్తూ బెదిరింపులకు దిగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తొలుత ప్రాంతీయ పార్టీలతో స్నేహం
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మొదట్లో ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలతో స్నేహంగా వ్యవహరించింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీని విస్తరించేందుకు ప్రణాళికలూ అమలు చేసింది. ఈ క్రమంలో వివిధ పార్టీల్లోని కీలక నేతలను నయానో భయానో తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైంది.
ఇంకా ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. కొరుకుడు పడని విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్ వ్యవస్థల ద్వారా చికాకులు కల్పిస్తున్నది. ఈ విషయంలో ఒకనాటి తన మిత్రులు, ఇప్పుడు శత్రువులుగా మారిన వారినీ వదలడం లేదనేందుకు తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రాజ్‌భవన్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులే నిదర్శనం.
ఆప్‌పై ఆగ్రహంతో
తన అహాన్ని దెబ్బతీశారన్న కోపంతో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అంతా చేస్తున్నది. గవర్నర్ వ్యవస్థను ఢిల్లీ ప్రభుత్వంపైకి ఉసిగొల్పింది. పాలనాపరంగా ఆప్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తున్నది. ఇప్పడు ఢిల్లీ లిక్కర్ కేసు పేరుతో ఏకంగా ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రినే అరెస్టు చేసింది. విశేషం ఏమిటంటే.. ఆప్ నేతలు వేటికీ భయపడటం లేదు. వెన్ను చూపడం లేదు. పైగా మరింత ఉధృతంగా నేరుగా ప్రధాని మోదీనే టార్గెట్ చేసుకుని పోరాడుతున్నారు.
తృణమూల్‌పై పగతో వాజపేయి ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు. ఆమె యూపీఏ నుంచి బయటకు వచ్చాక బీజేపీ పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలే కొనసాగించారు. కానీ.. గత లోక్‌సభ ఎన్నికల్లో తమతో పొత్తుకు తృణమూల్ సిద్ధం కాకపోవడం, ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా.. మొన్నటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను చావుదెబ్బ తీయడంతో బీజేపీ రగిలిపోయిందని అంటున్నారు.
ఆ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను చీల్చేందుకు కూడా ప్రయత్నించింది. శారదా చిట్ ఫండ్ స్కామ్‌ను అడ్డం పెట్టుకుని సీబీఐని రంగంలోకి దించింది. రాజ్‌భవన్‌కు కళంకం తెచ్చేలా అక్కడి గవర్నర్ వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
నితీశ్ ప్రయత్నాల వెంటనే కేసులు
అన్నా హజారే ఉద్యమంలో అవినీతి వ్యతిరేక ఉద్యమనాయకుడిగా ముందుకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీని స్థాపించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. ఢిల్లీలో తన స్థానాన్నిపదిల పరుచుకున్న ఆప్.. పంజాబ్‌లోనూ అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌లోనూ ఎప్పటికైనా సవాలు విసరగలదన్న స్థాయికి చేరుకున్నది.
గోవాలో సైతం ప్రభావం చూపింది. తాజాగా జాతీయ స్థాయి రాజకీయ పార్టీగా హోదా సంపాదించుకున్న ఆప్.. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే ప్రణాళికల్లో ఉన్నది. అయితే.. బీజేపీని ప్రస్తుతం ఏదో ఒక పార్టీ నేరుగా నిలదీసే పరిస్థితి లేదు. అనివార్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయితే తప్ప.. దేశంలో మతోన్మాద భావజాలానికి అడ్డుకట్ట వేయలేమన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బాధ్యతను భుజాన వేసుకున్న నితీశ్‌కుమార్. భావసారూప్యం కలిగిన పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందుకు అనుగుణంగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను నితీశ్, తేజస్వియాదవ్ కలిశారు.
అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సైతం ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. సరిగ్గా ఈ సమావేశాలు జరిగిన వెంటనే అటు రాహుల్‌గాంధీకి ఒక కేసులో పాట్నా కోర్టు, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు అందడం గమనార్హం.
గవర్నర్ వ్యవస్థతోనూ
గవర్నర్‌ల వ్యవస్థ ద్వారా పలు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం చిరాకు పెడుతున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, తమిళనాడులో గవర్నర్‌లతో ప్రభుత్వాలు ఢీ అంటున్న పరిస్థితి ఉన్నది.
రాహుల్ ప్రధాన లక్ష్యంగా..
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నశక్తులన్నీ ఒక దగ్గరకు చేరే వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో బయటకు వచ్చిన అదానీ వ్యవహారం ప్రతిపక్షాలను దగ్గర చేసింది.
పార్లమెంట్ వేదికగా విపక్షాలన్నీ ఐక్యమై కాంగ్రెస్‌తో కలిసి అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని పోరాడుతున్న సమయంలోనే సూరత్ కోర్టు కేసులో తీర్పు వచ్చిన వెంటనే రాహుల్‌పై అనర్హత వేటు వేసింది. ఆ వెంటనే అధికారిక బంగళాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఇలా బీజేపీ కాంగ్రెస్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది.
ఇది కూడా ప్రతిపక్షాలను మరింత దగ్గర చేసేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనిని చెదరగొట్టేందుకు బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీల నేతను ప్రజల్లో అప్రదిష్టపాలు చేసి.. వారిని లొంగదీసుకుంటే 2014 ఎన్నికల్లో తనకు తిరుగు ఉండదనేది బీజేపీ వ్యూహంగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.