వరంగల్: ‘ఆ మూడూ… ముండ్ల కిరిటాలు.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై పీటముడి
మూడు పాతకాపులకు.. మరో మూడు పెండింగ్! విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో మూడు జిల్లాల్లో పాత వారికే కొత్తగా పగ్గాలు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు జిల్లాలకు గానూ మూడు జిల్లాలకు హన్మకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల అధ్యక్షులను నియమించి మరో మూడు జిల్లాలైన జనగామ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టారు. […]

- మూడు పాతకాపులకు.. మరో మూడు పెండింగ్!
విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకంలో మూడు జిల్లాల్లో పాత వారికే కొత్తగా పగ్గాలు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు జిల్లాలకు గానూ మూడు జిల్లాలకు హన్మకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాల అధ్యక్షులను నియమించి మరో మూడు జిల్లాలైన జనగామ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టారు.
నూతనంగా నియమించిన మూడు జిల్లాల అధ్యక్ష బాధ్యతలు పాత కాపులకే అప్పగించారు. మిగిలిన మూడు జిల్లాల్లో భాధ్యతలు నిర్వహించడమంటే ముండ్ల కిరీటాన్ని ధరించడంగా చెబుతున్నారు. ఇక్కడ పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం తీవ్రంగా ఉంది. ఈ కారణంగా భాధ్యతల నిర్వహణతో పాటు గ్రూపుల మధ్య సఖ్యత తీసుకొస్తేనే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొంటారు.
మూడు జిల్లాల్లో పాతవారికే పట్టం
హన్మకొండ జిల్లాకు నాయిని రాజేందర్‌రెడ్డిని, మహబూబాబాద్‌కు జెన్నారెడ్డి భరత్ చందర్‌రెడ్డిని, ములుగు జిల్లాకు నల్లెల కుమారస్వామిని మరోమారు నియమిస్తూ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి ఇప్పటి వరకు వరంగల్, హన్మకొండ జిల్లాలకు అధ్యక్షుడిగా ఉండగా, తాజాగా హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియామకం చేసింది.
వాస్తవానికి డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పాత కొత్త కలయికలతో నియామకానికి అవకాశం ఉంటుందని ప్రచారం జరిగింది. చివరకు కష్టకాలంలో పార్టీని పట్టుకొని పనిచేసే అంకితభావం సీనియారిటీ, పార్టీలో అనుభవం, రాజకీయ సమర్థత వంటి అంశాలను బేరీజు వేసుకుని మూడు జిల్లాల విషయంలో పాత వారి పైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో పాత అధ్యక్షత ఎంపికలో పార్టీ ప్రధాన నాయకత్వంలో పెద్దగా విభేదాలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.
మూడు జిల్లాల్లో ముండ్ల కిరీటం
వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలకు అధ్యక్షుల నియామకాన్ని పార్టీ అధిష్ఠానం వాయిదా వేసింది. ఈ మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపిక అధిష్టానానికి పెద్ద సమస్యగా మారినట్లు భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో పార్టీలో నెలకొన్న గ్రూపులు, ఆధిపత్యం కారణంగా ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు సమాచారం. ఒక వర్గాన్ని ఒప్పించలేక మరో వర్గాన్ని నొప్పించలేక తాత్కాలికంగా కొత్త అధ్యక్షుల నియామకాన్ని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. దీనికి తోడు ఈ మూడు జిల్లాల్లో డిసిసి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం అంటే మురళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకున్నట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆధిపత్య పోరు
ప్రస్తుతం జనగామ అధ్యక్షుడిగా ఉన్న జంగా రాఘవరెడ్డితో పాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ జిల్లాలో పార్టీ సీనియర్ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నా యి. ఈ కారణంగా ఎంపిక విషయం మరింత జాప్యం కావచ్చు.
ఇక వరంగల్ జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మాజీఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు తాము సూచించిన నేతలకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వర్గం నేతగా ఉన్న అయిత ప్రకాష్‌ను కొనసాగించాలని కోరుతుండగా కాంగ్రెస్ లో చేరిన గండ్ర సత్యనారాయణకు లేదా ఆయన సూచించిన వ్యక్తికి డీసీసీ పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానాన్ని నేతలు కోరినట్లుగా సమాచారం.
సమర్ధతకు చాన్స్
పార్టీలో నేతలను సమన్వయంతో కలుపుకునిపోయే వారిని, పార్టీని ముందుకు తీసుకెళ్లగల సమర్థత, సామర్థ్యం గల నేతలకే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, జనగామ జిల్లాల అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తవుతాయని కొందరు నాయకులు చెబుతున్నారు.
అనుభవానికి అవకాశం!
హన్మకొండ డీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీపడినా నాయిని రాజేందర్ రెడ్డి కష్ట కాలంలో పార్టీని నడిపించాడనే భావనతో ఆయనకే అధిష్టానం అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహబూబాబాద్‌లో సుదీర్ఘ కాలంగా పార్టీలో కొనసాగుతున్న భరత్ చందర్‌రెడ్డికి సీనియర్ల సపోర్ట్ ఎక్కువగా ఉండటం, డీసీసీ అధ్యక్ష నియామకంలో అసంతృప్తికి తావు తేకుండాపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా మాజీ కేంద్రమంత్రి బలరామ్ నాయక్ ఆశీస్సులు ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే భరత్ చందర్‌రెడ్డి వైపు మరోసారి మొగ్గుచూపినట్లు భావిస్తున్నారు. ఇక ములుగులో ఎమ్మెల్యే, జాతీయ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క సూచన మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడిగా నల్లెల కుమారస్వామిని మరోమారు కొనసాగించేందుకు అంగీకరించినట్లు సమాచారం.
పార్టీ పటిష్టతకు కృషి
పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామని మరోసారి అవకాశం దక్కిన నూతన జిల్లా అధ్యక్షులు చెబుతున్నారు. పార్టీ శ్రేణులు, అనుచరులు మూడు జిల్లాల్లో సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాల్లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలు చేస్తామన్నారు. పార్టీ మరోమారు తమ పై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయమనీ, అందరి నేతలను కలుపుకుని వెళతామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పారు.