BJP | BRS ప్రజా పాలకులా? ప్రభువులా?.. కనిపించని కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్లు
BJP | BRS డమ్మీలుగా మారిన శాఖల మంత్రులు నిర్ణయాలన్నీ ప్రధాని, ముఖ్యమంత్రులవే! జీవో జారీ కేంద్రాలుగా సెక్రటేరియట్లు దేవతా వస్త్రాల్లా అధికార వ్యవస్థల తీరు రోజువారీ అంశాల్లోనూ పెద్దలదే నిర్ణయం ఆందోళనలతో సాకారమైన తెలంగాణ ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు నిషిద్ధం! అక్కడ ప్రభుత్వాలు నామమాత్రం.. ప్రభువు మాత్రమే సత్యం!! పార్లమెంటు ఒల్లెక్కం! ప్రభువు గుర్తిస్తేనే అది లోకులసభ! అక్కడ 543 మంది కాదు, కాదు, 788 మందీ కాదు ఆయన ఒక్కరే సత్యం! మంత్రివర్గం ఒక […]

BJP | BRS
- డమ్మీలుగా మారిన శాఖల మంత్రులు
- నిర్ణయాలన్నీ ప్రధాని, ముఖ్యమంత్రులవే!
- జీవో జారీ కేంద్రాలుగా సెక్రటేరియట్లు
- దేవతా వస్త్రాల్లా అధికార వ్యవస్థల తీరు
- రోజువారీ అంశాల్లోనూ పెద్దలదే నిర్ణయం
- ఆందోళనలతో సాకారమైన తెలంగాణ
- ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు నిషిద్ధం!
అక్కడ ప్రభుత్వాలు నామమాత్రం.. ప్రభువు మాత్రమే సత్యం!! పార్లమెంటు ఒల్లెక్కం! ప్రభువు గుర్తిస్తేనే అది లోకులసభ! అక్కడ 543 మంది కాదు, కాదు, 788 మందీ కాదు ఆయన ఒక్కరే సత్యం! మంత్రివర్గం ఒక డమ్మీ.. ప్రభువు పలుకులనే వల్లెవేసే మరబొమ్మలు! రాజ్యాంగ వ్యవస్థలు ఉంటాయి.. కానీ కీలుబొమ్మల్లా, తోలుబొమ్మల్లా. సచివాలయాలుంటాయి.. అవి ఒక నిరాకార నిష్క్రియా కేంద్రాలుగా.. ఉన్నాయో లేవో తెలియనంతగా! జీవోలు, చట్టాలు వస్తుంటాయి.. అవి అంతఃపుర రహస్యాలుగా ఉండిపోతాయి! అక్కడ నిరసనలు నిషిద్ధం. హక్కులు అబద్ధం. ఆర్తనాదాలు నిత్యకృత్యం! తగులబడిపోతున్నాం మహాప్రభో అంటే, మీ మతమేమిటి? అని అడిగేంత కర్కశత్వం!!
(మనోహర్‌రెడ్డి, ఢిల్లీ జర్నలిస్టు)
దేశంలో, వివిధ రాష్ట్రాల్లో రాజ్యాంగ, పార్లమెంటరీ వ్యవస్థల హననం.. వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించే రీతిలో సాగుతున్న పరిణామాలు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మనుగడకు సవాలు విసురుతున్నాయి. కేంద్రంలోకానీ, రాష్ట్రాల్లో కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులే సర్వాధికారులుగా, ప్రభువులుగా అజమాయిషీ చెలాయిస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక విధంగా రాచరికపు పోకడలు దేశంలోని పాలకుల్లో కనిపిస్తున్నాయి.
ఆ మాటకొస్తే.. ఆనాడు రాజులు ప్రజాదర్బార్లు ఏర్పాటు చేసేవారట.. అక్కడ ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే వీలు ఉండేదట! అదొక్కటి మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. కేంద్రంలో రైళ్ల మంత్రి చేయాల్సిన పనులు ప్రధాని చేస్తారు. విదేశాంగ మంత్రి పాత్రనూ పోషిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల విషయాలకొస్తే.. ఆయనే సదరు శాఖ మంత్రిగా అవతారం ఎత్తుతారు. ఒకటనేంటి.. ప్రతి శాఖకూ ప్రధానే మంత్రి అన్నట్టు పరిస్థితి తయారైంది.
కేంద్రంలోనే కాదు.. అనేక రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు కొద్దిగా అటూఇటూగా ఉంటున్నాయి. మంత్రులు డమ్మీలు అయిపోతున్నారు. విధానపర నిర్ణయాల సంగతి పక్కనపెడితే.. రోజువారీ అంశాల్లో కూడా నిర్ణయాలు తీసుకోలేని దురవస్థలో ఉన్నారు. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుంటే.. ఏదైనా పరిణామం లేదా ఘోరం జరిగితే.. ముఖ్యమంత్రి లేదా మరో ‘ముఖ్య’ మంత్రి ట్వీట్ చేస్తే.. తప్ప సంబంధిత శాఖ మంత్రి స్పందించలేని పరిస్థితి.
ఓ ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే.. ‘వెంటనే నిందితులను పట్టుకోవాలి’ అని ఒక ‘ముఖ్య’ మంత్రి ఆదేశిస్తే.. అప్పుడు హోంమంత్రి.. తన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. భారీగా వర్షాలు పడుతున్నా.. విద్యాసంస్థలకు సెలవులపై సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటన చేయలేరు. ‘ముఖ్యమంత్రి ఆదేశాలతో’ మాత్రమే చేస్తారు. ఏ నిర్ణయాలు జరిగినా.. ‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు’ అని పఠించాల్సిందే! ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద తేడా ఏమీ ఉండదు.
జాతీయ పార్టీలు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకుంటాయి. మంత్రులు ఉన్నా.. తమ అధినేతపై ఈగ వాలనీయకుండా చూసుకోవడానికో లేదా ప్రతిపక్ష నేతలపై నోరుపారేసుకోవడానికో పక్కన నిలబడి ఉంటారు తప్పించి.. స్వీయ నిర్ణయాలు తీసుకోలేని, బయటకు చెప్పుకోలేని పరిస్థితి వారిది. కేంద్రంలో కానీ, రాష్ట్రాల్లో కానీ సెక్రటేరియట్లు ప్రజల సమస్యల పరిష్కార కేంద్రాలుగా పనిచేయడం ఎప్పుడో మానేశాయన్న విమర్శలు ఉన్నాయి. అధికార వ్యవస్థలు దేవతా వస్త్రాల్లా తయారయ్యాయి. రాజ భవంతులను తలపించే భారీ భవనాల్లోకి సామాన్యులకు ప్రవేశాలు గగన కుసుమమే. అవి జీవో జారీ కేంద్రాల పాత్ర పోషించడంలో బిజీబిజీగా ఉంటున్నాయన్న అపవాదును మూటగట్టుకుంటున్నాయి.
రాజరాజ నరేంద్ర!
కేంద్రంలో వన్‌మ్యాన్ షో నడుస్తున్నదనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రాచరికానికి ఏ మాత్రం తగ్గకుండా పాలన తీరు ఉంటున్నదని అంటున్నారు. ఇటీవల అర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. రాజ్యాంగ మూల స్తంభాల్లో ఒకటైన చట్టసభల భవంతి ప్రారంభోత్సవం.. రాజ్యాంగాధిపతి లేకుండానే సాగుతుంది.. రాచరికాన్ని బదిలీ చేసే సందర్భాల్లో వాడుతారని చెప్పే దండాన్ని ఏరి కోరి వెతికి తెచ్చుని.. రాజు వెడలె అంటూ కొత్త పార్లమెంటులోకి అడుగు పెట్టారు ప్రధాని.
పట్టాభిషేకం సమయంలో జరిగే తీరులో పూజలు! ప్రాంగణంలో ఆయన నడుస్తూ వెళుతుంటే.. చుట్టూ ఎవరూ ఉండరు! అంతకు ముందు సర్దార్ పటేల్ విగ్రహ ఆవిష్కరణలోనూ అదే తీరు. కెమెరా కంటికి మరో మనిషన్న వాడు కనిపించడానికి వీల్లేదు. అంతా మోదీ ఒక్కరే! ఆఖరుకు రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించే అవకాశం కూడా రైల్వే శాఖ మంత్రికి దక్కడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం.
‘మంత్రులు చేసే పని వీలున్నప్పుడు పార్లమెంటులో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం.. మిగిలిన సమయం అంతా.. మోదీపై ఈగ కూడా వాలనీయకుండా ఆయన చుట్టూ దడి కట్టి నిలబడటమే’ అని ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అన్నారు. ‘మణిపూర్ హింసపై ప్రధాని మాట్లడరేంటని ప్రతిపక్షాలు నిలదీస్తే.. ఇతర మంత్రులు, బీజేపీ నేతలు.. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో ఘటనల గురించి ప్రస్తావిస్తూ ఎదురుదాడికి సిద్ధంగా ఉంటారు. పరిస్థితి ఇలా తయారైంది.. చక్కదిద్దండి.. అంటే.. మీ హయాంలో మీరేం చేశారంటూ వితండవాదులు పుట్టుకొస్తాయి’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మణిపూర్‌పై స్పందన ఉండదు
మణిపూర్ హింస, పౌర హక్కుల ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ‘ఆ రాష్ట్రంలో శాంతి భద్రల పరిరక్షణకు మీరు చర్యలు తీసుకుంటారా? లేక మేమే తీసుకోవాలా? అని కేంద్రాన్ని ప్రశ్నించాల్సి వచ్చిన తీరు.. పాలన ఎంతటి ప్రమాదకర స్థితిలోకి వెళ్లిపోతున్నదో స్పష్టంగా చాటింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించినా.. మణిపూర్ సమస్యపై మోదీ పార్లమెంటు వెలుపల ప్రకటనకే పరిమితమయ్యారు.
ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకొనే పార్లమెంట్లో మాత్రం నోరు విప్పేదే లే.. అంటూ భీష్మించి.. రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను పాతరేస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ప్రపంచ వేదికల్లో, ఇతరదేశాల సభల్లో భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక ఔన్నత్యాన్ని కీర్తించే మోదీ.. తన దాకా వచ్చే వరకు మాత్రం స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రపంచాన్ని కదిలించిన మణిపూర్ హింస ‘మౌన మోదీ’ని కదిలించి పార్లమెంటులో ప్రకటన చేసే స్థాయిలో ఉందో లేదో ఆయన ‘మన్ కీ బాత్’కే తెలియాలి. ఇంటర్నెట్ల బంద్‌తో వాస్తవ ప్రపంచాన్ని దాచాలనుకోవ డం నిప్పును గుప్పిట పట్టడమే అని మోదీ పరివార్‌కు తెలియంది కాదు. మణిపూర్ మహిళలపై సాగుతున్న హత్యాచార కాండ విశ్వాన్ని కదిలిస్తున్నప్పటికీ విశ్వ గురువుగా కీర్తింపజేసుకునే మోదీని పార్లమెంట్లో ప్రకటన చేసేలా ప్రేరేపించలేకపోతున్న తీరు చూస్తే ఆయన వ్యతిరేకులు చెప్పే ‘విద్వేషపు గురువు’ అన్న విమర్శలు సరైనవే అనిపించక మానదు.
ఢిల్లీ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని, సుప్రీం కోర్టు తీర్పును పరిహసించేలా గ్రూప్ వన్ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ఆర్డినెన్స్ తెచ్చి, మందబలంతో పార్లమెంటులో దానికి చట్టం రూపం కల్పించే ప్రయత్నంలో ఉన్న మోదీ పాలన పార్లమెంటరీ సమాఖ్య వ్యవస్థకు చిల్లు పెట్టేదిగా ఉన్నదని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరు కూడా తీవ్ర చర్చకు దారి తీస్తున్న మరో అంశం.
చట్టాల రూపకల్పనలో కీలక కసరత్తుకు భాగమయ్యే స్థాయీ సంఘాలకు మోదీకి ముందున్న లోక్‌సభలలో 65% బిల్లులను నివేదిస్తే మోదీ హయాంలో రెండు లోక్‌సభల కాలంలో ఇప్పటిదాకా 15% చొప్పున బిల్లులే నివేదించారు. ఇది స్థాయీ సంఘాల పనితీరును నిర్వీర్యం చేయడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నుంచి పదేపదే అక్షింతలు వేయించుకుంటున్న మోదీ సర్కార్.. నాగాలాండ్ ‘పట్టణ స్థానిక సంస్థల’ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలన్న తీర్పుపై నిర్లక్ష్యం వహించడంతో మరోసారి మొట్టికాయలు పడ్డాయి. ఇది కోర్టు ధిక్కారమేనని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.
మీ పార్టీల పాలనలోని రాష్ట్రాలలో పెద్ద తప్పులు చేసినా మౌనాన్ని.. ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో చిన్న తప్పులు చేసినా కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విపక్ష నేత రాహుల్ గాంధీ అనర్హతపై గుజరాత్ కోర్టుల ఆదేశాలను ఆగమేఘాల మీద అమలు చేయడంలో చూపిన శ్రద్ధ తమకు ప్రతికూలంగా ఉండే విధానాలు, వివాదాలపై మాత్రం చెప్పకపోవడం మోదీ మార్క్ రాజకీయమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకు సుదీర్ఘంగా సాగిన రైతు చట్టాల వివాదం.. రెజ్లర్ల నిరసనల వివాదాలే నిదర్శనమని పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రే అన్నీ
అన్నీ తానై వ్యవహరించడంలో, అధికారాన్ని కేంద్రీకరించడంలో కేంద్రంలోని ప్రధాని మోదీకి తానేమీ తక్కువ కాదన్నట్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ వైఖరి ఉన్నదని పలువురు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు సమీక్షలు చేయడానికి లేదా సీఎం నిర్వహించే సమీక్షలో పాల్గొన డానికే తప్ప.. స్వయంగా నిర్ణయాలు చేయలేని పరిస్థితి ఉన్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘ఒకవైపు రాష్ట్రంలో ఒక భాగాన్ని వరదలు ముంచెత్తాయి. మోరంచపల్లె వంటి పల్లెలు వరద బీభత్సంలో చెదిరి పోయి.. శవాల గుట్టలు తేలుతున్నాయి.
కానీ.. ముఖ్యమంత్రి ఫోన్లలో సమీక్షలు నిర్వహించడం తప్ప.. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేందుకు ఎందుకో ఆసక్తి చూప లేదు. ఆయన తరఫున ప్రతినిధులుగా మంత్రులు వెళ్లారు. విషాదం చోటు చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళితే బాధితులకు ఒక భరోసా లభిస్తుంది. ఆయన ఆ సమయంలో చెప్పే మాటలు వాస్తవ రూపం దాల్చుతాయన్న ఆశలు కలుగుతాయి. కానీ.. ముఖ్యమంత్రి గారికి చెప్పి.. మీకు న్యాయం చేయిస్తాం.. అనే ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎలాంటి ఆశలు ఉండవు’ అని ఒక విశ్లేషకుడు చెప్పారు.
లాభం లేదంటే.. పక్కన పడేయటమే
తనకు రాజకీయంగా, ఆర్థికంగా అనుకూలత లేని అంశాలపై అణిచివేత వైఖరి అనుసరిస్తూ, సానుకూల అంశాలపై గొప్ప విన్యాసాలు ప్రదర్శించడాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. తన పార్టీకి విజయావకా శాలు ఉంటే.. ఆగమేఘాల మీద ఉప ఎన్నికలైనా, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలైనా తొడగొడుతారని, అదే ఓడిపోయే పరిస్థితులు ఉంటే వాటి ఊసే ఎత్తరని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించడంలో జరుగుతున్న జాప్యంపై కేసీఆర్ సర్కారును హైకోర్టు ఘాటుగానే ప్రశ్నించింది.
ఈ విషయంలో వారం రోజుల డెడ్‌లైన్ కూడా విధించింది. ‘ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో సాధారణ ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదో లేదో తెలియదుగానీ.. గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థల ప్రాధాన్యంపై జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు.. తెలంగాణ జాతి పితగా సొంత పార్టీ శ్రేణుల నుంMR పిలిపించుకుంటున్న సీఎం కేసీఆర్‌కు తెలియంది కాదు.
రాజకీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ.. స్థానిక ఎన్నికలతో ఎందుకొచ్చిన తంటా అనుకొని వాటిని అటకెక్కించారు’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. అలాగే చట్టసభలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై అనుసరించే వైఖరులలోనూ సీఎం కేసీఆర్ ఏకపక్ష నియంతృత్వమే కనిపిస్తుందని ఆయన అన్నారు. ‘తనకు గిట్టకపోతే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్, ఈటల పట్ల అనర్హత వేటును ఆగమేఘాలమీద పూర్తయ్యేలా చేశారు.
అదే తన పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవికి అనర్హుడని హైకోర్టు తేల్చినా నాన్చుడు ధోరణి పాటించడం కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం’ అని ఒక న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఇటీవల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు విద్యాసంస్థలకు వెళ్లవద్దంటూ ఉత్తర్వులిచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తున్న పరిశీలకులు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామికతను, పారదర్శక పాలనను ప్రశ్నార్థకం చేస్తున్నదని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చే వందల జీవోలు ఆన్లైన్లో పెట్టకపోవడం మరో మరో వివాదాస్పద అంశంగా నిలుస్తున్నది.
ఆందోళనలపైనా ఉక్కుపాదం
గతంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తివేత, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు పలు ఉద్యోగ సంఘాల సమ్మెల సందర్భాల్లో ఆయన నియంతృత్వ పోకడలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనేక ఉద్యమాలు, ధర్నాలు సహా అనేక రకాల పోరాట రూపాల్లో ఉద్యమించిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేయడమనే ఊసే లేకుండా పోతున్నది. ప్రతిపక్షాలు ఎదైనా ధర్నాకు లేదా నిరసనకు పిలుపునిస్తే.. ఆయా పార్టీల నాయకుల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు సర్వసాధారణం అయిపోయాయని పలువురు ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు.
అదే సమయంలో ‘విపక్షాలు చేస్తే చట్టవ్యతిరేకం.. రాజుగారి పరివారం చేస్తే ప్రజాస్వామికం’ అన్నట్టు.. కేంద్రంతో గొడవకు దిగాల్సి వచ్చినప్పుడు గ్యాస్ ధరల పెంపు, ధాన్యం కొనుగోలు, ఇటీవలి విద్యుత్తు ఆందోళనల వరకు స్వయంగా అధికార పార్టీ నేతలే ధర్నాలు చేశారు. సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి మరీ దీక్షలు చేశారు. అదే రాష్ట్రంలో కీలక అంశాలపై నిరసనలు మాత్రం నిషిద్ధం అన్న పరిస్థితులు నెలకొన్నాయి’ అని వారు మండిపడుతున్నారు.