PM Modi | తొమ్మిదేళ్లలో మిమ్మల్ని కలవలేక పోయాను..

PM Modi కార్యక్రమాలకు మిమ్మల్ని పిలవలేకపోయాను అయినా ఫిర్యాదు చేయనందుకు ధన్యవాదాలు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు పొరపాట్లు జరిగినా దురుద్దేశంతో కాదని వివరణ కాంగ్రెస్‌పై ఒంటికాలిపై లేచిన నరేంద్రమోదీ దేశాన్ని అస్థిరపర్చే కాంగ్రెస్‌ సంకీర్ణాలు ఏర్పాటు చేసేదీ కాంగ్రెస్‌.. కూల్చేదీ కాంగ్రెస్‌ 1990 దశకంలో కాంగ్రెస్‌ చేసిందిదే దేశంలో సుస్థిరత కోసమే ఎన్డీయే ఆవిర్భావం కానీ.. ప్రజా తీర్పును అవమానించలేదు విధాత‌: బెంగళూరులో ప్రతిపక్షాల బల ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కూడా […]

PM Modi  | తొమ్మిదేళ్లలో మిమ్మల్ని కలవలేక పోయాను..

PM Modi

  • కార్యక్రమాలకు మిమ్మల్ని పిలవలేకపోయాను
  • అయినా ఫిర్యాదు చేయనందుకు ధన్యవాదాలు
  • ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
  • పొరపాట్లు జరిగినా దురుద్దేశంతో కాదని వివరణ
  • కాంగ్రెస్‌పై ఒంటికాలిపై లేచిన నరేంద్రమోదీ
  • దేశాన్ని అస్థిరపర్చే కాంగ్రెస్‌ సంకీర్ణాలు
  • ఏర్పాటు చేసేదీ కాంగ్రెస్‌.. కూల్చేదీ కాంగ్రెస్‌
  • 1990 దశకంలో కాంగ్రెస్‌ చేసిందిదే
  • దేశంలో సుస్థిరత కోసమే ఎన్డీయే ఆవిర్భావం
  • కానీ.. ప్రజా తీర్పును అవమానించలేదు

విధాత‌: బెంగళూరులో ప్రతిపక్షాల బల ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కూడా తన భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరయ్యారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాల ఐక్యతతోనే బీజేపీ మళ్లీ తన పాత భాగస్వామ్య పక్షాలకు ఇన్నాళ్లకు చేరువుతున్నదని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే.. విచిత్రంగా మోదీ సైతం ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు.

ఎన్డీయే సమావేశంలో మాట్లాడిన మోదీ.. తొమ్మిదేళ్ల కాలంలో ఎన్డీయే పక్షాలను కలుసుకోలేక పోయానని అన్నారు. అయినా తమ తప్పిదాలపై ఫిర్యాదు చేయనందుకు మిత్రపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ‘గత తొమ్మిదేళ్లలో మీలో కొందరు నన్ను కలుసుకునేందుకు ప్రయత్నించి ఉండవచ్చు. నేను కలుసుకోలేక పోయి ఉండొచ్చు. ఏదైనా కార్యక్రమానికి మిమ్మల్ని పిలువలేక పోయి ఉండొచ్చు. లేదా నన్ను కలుసుకునేందుకు మీకు అవకాశం దక్కి ఉండకపోవచ్చు’ అని మోదీ అన్నారు.

అయినా సంకీర్ణ ప్రభుత్వ ప్రయోజనాల కోసం అటువంటివాటిపై ఫిర్యాదులు చేయకుండా ఉన్నందుకు ఎన్డీఏ పక్షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏమన్నా పొరపాట్లు చేసి ఉన్నా.. అది దురుద్దేశంతో కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఎన్డీయే అంటే కొత్త అర్థాన్ని చెప్పిన ప్రధాని.. ఎన్‌ అంటూ న్యూ ఇండియా, డీ అంటే డెవలప్‌మెంట్‌, ఏ అంటే ఆస్పిరేషన్‌ అని అభివర్ణించారు.

అస్థిరతకే కాంగ్రెస్‌ సంకీర్ణాలు

ప్రతిపక్షాలపై, ప్రత్యేకించి కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుకుపడ్డారు. దేశంలో సుదీర్ఘకాలంగా సంకీర్ణ ప్రభుత్వాల సంప్రదాయం ఉన్నదని, కానీ, ప్రతికూల ఉద్దేశాలతో ఏర్పాటు చేసిన సంకీర్ణాలు సఫలం కాలేదని అన్నారు. 1990వ దశకంలో కాంగ్రెస్‌ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ, తానే వాటిని కూలదోస్తూ వచ్చిందని ఆరోపించారు.

తద్వారా దేశాన్ని అస్థిరంపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ సమయంలో 1998లో ఎన్డీయే ఏర్పాటైంది. ఎందుకు ఏర్పడింది? అధికారం సాధించడం కోసమా? ఏ ప్రభుత్వాన్నీ కూల్చేందుకు కాదు.. దేశంలో సుస్థిరతను నెలకొల్పేందుకు ఏర్పడింది’ అని మోదీ చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాము సకారాత్మక రాజకీయాలే చేశామన్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పాల్పడిన కుంభకోణాలను వెలుగులోకి తెచ్చా. కానీ.. ప్రజా తీర్పును అవమానించలేదు. అధికార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విదేశీ శక్తుల సహాయం తీసుకోలేదు.

దేశం కోసం ఉద్దేశించిన అభివృద్ధి పథకాలను అడ్డుకోలేదు’ అని మోదీ చెప్పారు. ఎన్డీయే అనేది బలవంతంగా ఏర్పడిన కూటమి కాదని, సహకారంతో ఏర్పడిందని తెలిపారు. ఎన్డీయేలో ఒక పార్టీ పెద్దది, మరో పార్టీ చిన్నది కాదని, తామంతా ఒకే లక్ష్యం కోసం కలిసి నడుస్తున్నామని వివరించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రధానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, శివసేన చీలిక వర్గం నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకుడు ఈకే పళనిస్వామి తదితరులు స్వాగతం పలికారు.

వేదికపై ఆశీనులై మిత్రపక్షాల నేతలను ప్రధాని పలకరించారు. ఎల్జేపీ (రాంవిలాస్‌) నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను మోదీ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆయన మోదీ పాదాలకు నమస్కరించారు. సమావేశం అనంతరం నేతలంతా గ్రూప్‌ ఫొటో దిగారు. మొదటి వరుసలో ప్రధాని, అమిత్‌షా, నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీతోపాటు.. ఎన్సీపీ చీలికవర్గం నేత అజిత్‌పవార్‌, పళనిస్వామి ఉన్నారు.

పరీక్షలను తట్టుకున్న ఎన్డీయే: మోదీ ట్వీట్‌

బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీయే) కాల పరీక్షలకు తట్టకుని నిలబడిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. బెంగళూరు విపక్షాల భేటీలో మాట్లాడిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్డీయేలో పేర్లు తెలియని పార్టీలు ఉన్నాయన్న వ్యాఖ్యలపై ప్రధాని పై విధంగా స్పందించారు.

ఎన్డీయే బలంగా ఉన్నదని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు, ప్రాంతాల ఆకాంక్షలను నెరవేర్చడానికి గట్టి సంకల్పంతో ఉన్నదని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఎన్డీయే పక్షాల సమావేశానికి ముందు ప్రధాని ఒక ట్వీట్‌ చేస్తూ.. తమకు అత్యంత విలువైన ఎన్డీయే పక్షాలు దేశం నలుమూలల నుంచి వచ్చి సమావేశంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నదని అన్నారు.