400 స్థానాలు పక్కా.. తెలంగాణలో బీజేపీ గాలి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరనుందని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు

  • By: Somu    latest    Mar 16, 2024 10:38 AM IST
400 స్థానాలు పక్కా.. తెలంగాణలో బీజేపీ గాలి
  • మళ్ళీ బీజేపీ అధికారం లోకి వస్తుందని ప్రజలు నిర్ణయించారు
  • కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పాలన లో తెలంగాణ విధ్వంసం
  • అవినీతిలో రెండు పార్టీ లు అన్నదమ్ములు
  • తెలంగాణ అభివృద్ధి కి కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ అడ్డంకి
  • ఏడు దశాబ్దాలలో దేశాన్ని మోసం, దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది
  • గరీబీ హేటావో అని వారి జీవితాల్లో మార్పులు తీసుకురాని కాంగ్రెస్
  • కాంగ్రెస్ దుష్ట పిడికిల్లోకి తెలంగాణ వెళ్ళింది
  • కాంగ్రెస్ ది 2 జి స్కామ్.. బీ ఆర్ ఎస్ ది ప్రాజెక్టు ల స్కామ్
  • అవినీతి పరులకు ఎప్పుడైనా శిక్ష తప్పదు
  • నాగర్ కర్నూల్ విజయ సంకల్ప యాత్ర సభ లో ప్రధాని మోడీ


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :  బీఆరెస్, కాంగ్రెస్ పాలనల్లో తెలంగాణ విధ్వంసానికి గురైందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దక్షిణ భారత దేశానికి తెలంగాణ గెట్ వే ఆఫ్ సౌత్ అని అభివర్ణించిన మోదీ.. ఇంత పేరున్న రాష్ట్రం అభివృద్ధికి కాంగ్రెస్, బీఆరెస్ పార్టీలు ఆటంకాలుగా మారాయని విమర్శించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్న ప్రధాని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆరెస్లు తెలంగాణ ప్రజల కలలను ధ్వంసం చేశాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకులా వాడుకుని, వారి అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసే సమయంలో బీఆరెస్, కాంగ్రెస్ అడ్డుకున్నాయని ఆరోపించారు. ఇటీవల యాదగిరి గుట్టలో మల్లు భట్టి విక్రమార్క చిన్న స్టూలుపై కూర్చొనడంతో రేగిన వివాదాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. దళిత ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చొనబెట్టి అవమానించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, కేసీఆర్ మోసం చేశారని, కాంగ్రెస్ హయాంలో కూడా దళితులను అవమానాలు తప్పడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రమే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తుందని చెప్పారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానని కేసీఆర్ చెప్పడం చూస్తే.. రాజ్యాంగంపై ఆయనకు ఎంత విశ్వాసం ఉన్నదో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు. ఏడు దశాబ్దాల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను మోసం చేసిన, దోపిడీ చేసిన చరిత్ర కలిగి ఉన్నదని మోదీ ఆరోపించారు. గరీబీ హఠావో అని నినదించిన కాంగ్రెస్.. వారి జీవితాల్లో మాత్రం మార్పులు తీసుకురాలేదని అన్నారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2జీ స్కామ్ చేస్తే.. రాష్ట్రంలో గత బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల స్కామ్ చేసిందని ఆరోపించారు.

అవినీతిలో అన్నదమ్ములు

అవినీతిలో కాంగ్రెస్, బీఆరెస్ అన్నదమ్ములని, ఆ పార్టీలను ప్రజలు నమ్మితే నట్టేట మునుగుతారని ప్రధాని అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా ఎప్పటికీ తప్పించుకోలేరని, అలాంటి వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు. అవినీతికర కాంగ్రెస్, బీఆరెస్లను ప్రజలు తిరస్కరించాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రo దుష్ట పిడికిలిలో ఉన్నదని, వీరి బారినుంచి తెలంగాణ విముక్తి పొందాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడి నుంచి అధిక ఎంపీ స్థానాలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

డబుల్ డిజిట్ స్థానాలు మావే :

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రo నుంచి బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు వచ్చిన ప్రజలని చూస్తే బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఈ పదేళ్లకాలంలో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ ఆ వివరాలు విడమర్చి చెప్పుకొన్నారు. తన పాలనాకాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని వెల్లడించారు. తెలంగాణ గళం ఢిల్లీలో ఉన్న తనకు వినిపించాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కిషన్రెడ్డి, పోతుగంటి భరత్, డీకే అరుణ, సైదిరెడ్డి తెలంగాణ ప్రజల గళాన్ని తనకు వినిపిస్తారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీరిని గెలిపించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు పక్కా

రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువుదీరనుందని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందని చెప్పుకొన్నారు.

దొంగలు వెళ్ళారనుకుంటే గజ దొంగలు వచ్చారు : కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రoలో దొంగలు ఇంటికి వెళ్ళారనుకుంటే గజదొంగలు అధికారం లోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని, ఇక్కడ లిక్కర్ డబ్బులు దోచిందేకాకుండా ఢిల్లీలో బీర్, బ్రాందీ దందా చేసేందుకు వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ రంగంలో చూసినా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి బయటపడుతున్నాదని, అవినీతి కి పాల్పడిన వారిని చట్టం వదిలిపెట్టదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, నాగర్ కర్నూల్ అభ్యర్థి భరత్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి, భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.