రాజకీయ ప్రయోజనాలే టీఆర్ఎస్, బీజేపీ ఎజెండా
అవినీతికర రాజకీయాలను ఎండగట్టాలి ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి రెండు రోజులపాటు వరంగల్ ఓంకార్ భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం విధాత, వరంగల్: కేంద్రంలోని మనువాద బీజేపీ, రాష్ట్రంలోని నియంతృత్వ టీఆర్ఎస్ పాలకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేస్తూ ప్రజా సమస్యలను విస్మరించి భారం మోపడమే పనిగా విధానాలు రూపొందిస్తున్నారని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆరోపించారు. ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య), ఎంసీపీఐ(యు) రెండు రోజుల రాష్ట్ర కమిటీ […]

- అవినీతికర రాజకీయాలను ఎండగట్టాలి
- ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
- రెండు రోజులపాటు వరంగల్ ఓంకార్ భవన్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం
విధాత, వరంగల్: కేంద్రంలోని మనువాద బీజేపీ, రాష్ట్రంలోని నియంతృత్వ టీఆర్ఎస్ పాలకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేస్తూ ప్రజా సమస్యలను విస్మరించి భారం మోపడమే పనిగా విధానాలు రూపొందిస్తున్నారని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆరోపించారు.
ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య), ఎంసీపీఐ(యు) రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశం అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్‌లో మంద రవి అధ్యక్షతన ప్రారంభమైంది.
రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా…
ఈ సందర్భంగా గాదగోని రవి తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ ప్రయోజనాలే ఏకైక మార్గంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దొంగే దొంగ దొంగ అన్న చందంగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. చాప కింద నీరులా ప్రజలపై ఎవరికి తోచిన విధంగా వారు పన్నుల భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలను చైతన్య పరచాలి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అస్థిత్వాన్ని ప్రజల ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే మతోన్మాద చర్యలకు పూనుకుంటున్నారని ఇది దేశ భద్రతకు, లౌకికత్వానికి పెను ప్రమాదం అన్నారు. ఈ క్రమంలో భారత రాజ్యాంగాన్ని సైతం మనువాద రాజ్యాంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఎన్ఆర్సి, ఉమ్మడి పౌర సంస్కృతి లాంటి చట్టాలను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఆచారాల వ్యవహారాల్లో విద్యాసంస్థల్లో అనేక మతోన్మాద విధానాలకు పాల్పడుతున్నారని వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.
మోసం చేస్తున్న కేసీఆర్
రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను అడియాశలు చేసిందే కాకుండా బీజేపీ పాలన సాకుతో తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నదని అందుకు సీపీఎం, సీపీఐ లాంటి కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ పాలనకు వంత పాడడం సిగ్గుచేటన్నారు. మనువాద అవినీతికర ప్రజా వ్యతిరేక బీజేపీ, టీఆర్ఎస్ పాలక పార్టీలను ఎండగడుతూ ప్రజా పోరాటాలను ఉధృతం చేసి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అందుకు తగిన కార్యాచరణ రాష్ట్ర కమిటీలో రూపొందిస్తామని తెలిపారు.
సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, కుంభం సుకన్య, వస్కుల మట్టయ్య, గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్, ఎన్ రెడ్డి హంసారెడ్డి, తుకారాం నాయక్, కన్నం వెంకన్న, ఎస్కే నజీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, కర్ర రాజిరెడ్డి, నీల రవీందర్, కంచ వెంకన్న, నర్రా ప్రతాప్, వంగల రాగ సుధ, పరికరాల భూమయ్య, మాస్ సావిత్రి, జబ్బార్ నాయక్, తాండ్ర కళావతి, గోపి, పుష్ప, కొమురయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.