Ponguleti। పొంగులేటి వ్యూహాల వెనుక మతలబేంటి! అస్పష్టతా.. గందరగోళమా?
అస్పష్టతా? గందరగోళమా? పొలిటికల్ గేమ్ నడుస్తున్నదా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతుందా? Ponguleti Political Game । ఖమ్మం జిల్లా రాజకీయ చర్చల్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సెంటర్ ఎట్రాక్షన్‌గా మారారు. కానీ.. ఆయన ఏ పార్టీలోకి మారతారు? అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. జనాలు సరే.. కనీసం పొంగులేటికైనా స్పష్టత ఉన్నదా? లేక ఆయన ఏమైనా గందరగోళంలో ఉన్నారా? ఈ రెండూ కాదంటే రాజకీయ డ్రామా ఎన్నికల సమయం ముందు […]

- అస్పష్టతా? గందరగోళమా? పొలిటికల్ గేమ్ నడుస్తున్నదా?
- అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే తంతు కొనసాగుతుందా?
Ponguleti Political Game । ఖమ్మం జిల్లా రాజకీయ చర్చల్లో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సెంటర్ ఎట్రాక్షన్‌గా మారారు. కానీ.. ఆయన ఏ పార్టీలోకి మారతారు? అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. జనాలు సరే.. కనీసం పొంగులేటికైనా స్పష్టత ఉన్నదా? లేక ఆయన ఏమైనా గందరగోళంలో ఉన్నారా? ఈ రెండూ కాదంటే రాజకీయ డ్రామా ఎన్నికల సమయం ముందు వరకు కొనసాగిస్తారా? ఇప్పడు జిల్లా రాజకీయాల్లో ఇదే చర్చ!
విధాత : నేను లెగిస్తే మనిషిని కాదు అనే విధంగా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వైఖరి ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు నెలలుగా ఆయన వ్యవహారశైలిని గమనిస్తున్న సహచరులు, అనుచరులు అసలేం జరుగుతున్నదో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ‘ఆ పార్టీలో చేరబోతున్నారు.. ఈ పార్టీ నుంచి పిలుపు వచ్చింది..’ అనే వార్తలు గత వారం వరకు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడేమో ‘నేను స్వతంత్రుడిని.. ఎవరితో సంబంధం లేదు’ అనే విధంగా పొంగులేటి వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
స్వతంత్రంగా అభ్యర్థులను రంగంలోకి దించుతానని, సీఎం కేసీఆర్ (CM KCR)ను గద్దె దించడమే తన లక్ష్యమని రెండు రోజుల క్రితం పొంగులేటి ప్రకటించారు. అయినప్పటికీ ఆయనను నమ్మే స్థితిలో ఓటర్లు ఉన్నారా లేదా అనేది మున్ముందు తెలియనున్నది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వరకు ఈ విధంగా మాట్లాడుతూ, జనాలను గందరగోళంలోకి నెట్టేసి తన లక్ష్యం సాధించుకుంటారా? అనే అనుమానాలు కూడా రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది.
కాంట్రాక్టర్‌గా, వ్యాపారిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి 2014 లో రాజకీయ అరంగేట్రం చేశారు. వైసీపీ (YSRCP) అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం (Khammam Lok Sabha Constituency) నుంచి బరిలో దిగారు. ఈయన విజయం సాధించమే కాకుండా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థులను వైసీపీ నుంచి గెలిపించుకున్నారు. ఆ తరువాత అందరూ బీఆర్ఎస్‌లోకి చేరిపోయారు.
అయితే.. 2019 ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) నాయకత్వం శ్రీనివాస్ రెడ్డికి మొండి చేయి చూపించింది. ఆ సీటును టీడీపీ (TDP) నుంచి వచ్చిన నామా నాగేశ్వర్ రావు (Nama Nageswar Rao)కు ఇచ్చారు. ఇక అప్పటి నుంచి అధినాయకత్వం చుట్టూ పొంగులేటి కాళ్లు అరిగేలా తిరుగుతునే ఉన్నారు కానీ రాజకీయ భవితవ్యంపై భరోసా ఇవ్వడం లేదు. ఇక తనను నమ్మే పరిస్థితి లేదని ఆయన కూడా ఒక నిర్థారణకు వచ్చారని అంటున్నారు.
ఎమ్మెల్సీ (MLC) టికెట్ ఇస్తారని ఆ మధ్య ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత రాజ్యసభ (Rajya sabha) సీటు వస్తుందని, నాయకత్వం హామీ ఇచ్చిందని అనుచరులు చెప్పుకొన్నారు. హామీలు ఎలా ఉన్నా.. సమయం, సందర్భం బట్టి జిల్లాలో తన బల ప్రదర్శనను చూపించుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ పార్టీ అధినాయకత్వం ఏమాత్రం ఖాతరు చేయలేదు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) కుమార్తె తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ (YSRTP) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ తరువాత పరిణామాలు మనం చూస్తునే ఉన్నాం. రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మితో పొంగులేటి సమావేశమయ్యారన్న వార్త సంచలనం రేపింది. పార్టీలోకి రావాల్సిందిగా షర్మిల కూడా ఆహ్వానం పలికారు.
రానున్న సాధారణ ఎన్నికల్లో పాలేరు (Palair Assembly constituency) నుంచి నిల్చునేందుకు షర్మిల ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswar Rao) బరిలో ఉంటారని తెలుస్తున్నది. పార్టీలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని, పైగా చిన్నచూపు చూస్తున్నారని నాగేశ్వర్ రావు కూడా అసంతృప్తితో ఉన్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవంలో నాగేశ్వర్ రావు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరిణామాలను గమనించిన పొంగులేటి తన దారి తను చూసుకునే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు. తొలుత బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. ఆ తరువాత వైఎస్ఆర్‌టీపీలో చేరతారని, విజయలక్ష్మీ, షర్మిలతో కలిసి చర్చలు జరిపారని సోషల్ మీడియాలో గుప్పుమన్నది. కలిసింది, కలియంది ఎక్కడా ఆయన స్పష్టత నివ్వలేదు.
బహుజన సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తో కూడా భేటీ అయినట్లు ఖమ్మంలో చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ (BJP) బడా నాయకులతో కూడా చర్చించారని, నేడో రేపో తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా పొంగులేటి జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించి సంచలనం సృష్టించారు.
సొంతంగా ఒక పార్టీ పెడుతున్నారని, ఆ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో తన అభ్యర్థులను బరిలో పెడుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని అలా పక్కన పెడితే, ఆయన వైఖరిపై జిల్లా ప్రజలు ఒక నిర్థారణకు రాలేకపోతున్నారు. పూటకో మాట, గడియకో అడుగు అనే విధంగా పొంగులేటి వ్యవహారశైలి ఉందంటున్నారు. అయితే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక బలమైన వర్గం ఉంది. గెలుపుఓటములను నిర్థరించే బలం, బలగం ఉందనేది వాస్తవం.
బీఆర్ఎస్ ఓట్లను చీల్చే లక్ష్యంతో ఆయన ప్రయత్నాలు ఉంటాయని, మరోటి కాదని ఖమ్మం జిల్లాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒక సారి ఖమ్మం పార్లమెంటు నుంచి గెలుపొందిన పొంగులేటి తన లక్ష్యంపై స్పష్టతనివ్వకుండా ఎప్పటికప్పుడు రూటు మార్చుకోవడం గమనార్హం. ఇలా అసెంబ్లీ ఎన్నికల వరకు సస్పెన్స్ కొనసాగించి లక్ష్యం సాధించుకుంటారా లేదా గందరగోళంలో పడతారా అనేది వేచి చూస్తే కానీ తెలియదు.