‘క్రాంతి ఫార్మా’ అనుమతి రద్దు చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి
మహమ్మారి కంపెనీ మాకొద్దు..! గట్టుప్పల్ వాసుల ఆందోళన!! విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: మా ఆరోగ్యాలను దెబ్బతీసి.. మా బతుకులను.. ఉపాధిని ఛిద్రం చేసే మహమ్మారి ఫార్మా కంపెనీ మాకొద్దు అంటూ గట్టుప్పల్ మండల వాసులు చేపట్టిన ఆందోళనను మళ్లీ ఉధృతం చేశారు. క్రాంతి ఫార్మా కంపెనీకి ఇచ్చిన అన్ని అనుమతులు తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కంపెనీ నిర్మాణ స్థలంలో మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గట్టుప్పల్, పుట్టపాక, వెల్మకన్నె, కల్వకుంట్ల, తెరాట్ పల్లి […]

- మహమ్మారి కంపెనీ మాకొద్దు..! గట్టుప్పల్ వాసుల ఆందోళన!!
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: మా ఆరోగ్యాలను దెబ్బతీసి.. మా బతుకులను.. ఉపాధిని ఛిద్రం చేసే మహమ్మారి ఫార్మా కంపెనీ మాకొద్దు అంటూ గట్టుప్పల్ మండల వాసులు చేపట్టిన ఆందోళనను మళ్లీ ఉధృతం చేశారు. క్రాంతి ఫార్మా కంపెనీకి ఇచ్చిన అన్ని అనుమతులు తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కంపెనీ నిర్మాణ స్థలంలో మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
గట్టుప్పల్, పుట్టపాక, వెల్మకన్నె, కల్వకుంట్ల, తెరాట్ పల్లి తదితర గ్రామాల ప్రజలు, రైతులు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నా లో పాల్గొని ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పచ్చని పల్లెలపై విషం చిమ్ముతున్న ఫార్మా కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే నీళ్లు లేక నియోజకవర్గంలో భూములన్నీ బీడులుగా మారాయని, ఫార్మా కంపనీ వస్తే గాలి, నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యాలకు గురికావలసి వస్తుందన్నారు. గతంలో క్రాంతి ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజాందోళనలతో జిల్లా కలెక్టర్ అనుమతులు నిరాకరించారని, టీఎస్ ఐపాస్ ద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అనుమతులు సంపాదించారని ఆరోపించారు.
ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే అనంతరం జరిగే పరిణామాలకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నియోజక వర్గంలోని అన్నీ ఫార్మా కంపెనీలను ముచ్చర్ల ఫార్మా సిటీకి తరలించాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వం ఫార్మా కంపనీ అనుమతులు వెంటనే రద్దు చేయక పోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామ సర్పంచులు కంపెనీలకు తీర్మానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలిమల కృష్ణారెడ్డి , వివిధ పార్టీల నాయకులు నేలికంటి సత్యం, కర్నాటి మల్లేశం, ఇదం కైలాష్, సర్పంచ్ ఇడం రోజా , బీమగాని మహేష్, బీమగాని మల్లేష్, గోరిగ సత్తయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.