ప్రణీత్‌రావు విచారణలో కీలక మలుపు
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక మలుపు తిరిగింది. ఎస్‌ఐబీ చీఫ్ అనుమతితో కొన్ని, అనుమతి లేకుండా మరికొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు

- సిరిసిల్ల..వరంగల్..హైదరాబాద్‌లలో వార్ రూమ్‌లు
- మీడియా సంస్థ యజమాని, బీఆరెస్ నేతల ఆదేశాలతో ట్యాపింగ్
- సర్వీస్ ప్రొవైడర్ సహకారం లేకుండానే…విదేశీ పరికరాలతో ట్యాపింగ్
- ఇద్దరు వరంగల్ సీఐలను విచారిస్తున్న పోలీసులు
విధాత : మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక మలుపు తిరిగింది. ఎస్‌ఐబీ చీఫ్ అనుమతితో కొన్ని, అనుమతి లేకుండా మరికొన్ని ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. ప్రణీత్‌రావు బీఆరెస్ ముఖ్య నేత ఆదేశాలతో పాటు ఓ మీడియా సంస్థ యజమాని ఆదేశాలతో కూడా ట్యాపింగ్ చేశారని, ట్యాపింగ్ కోసం హైదారాబాద్‌తో పాట వరంగల్, సిరిసిల్లలో సర్వర్లతో వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకుని 50 మంది సిబ్బందిని పెట్టుకుని మరి వందల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా పోలీసు విచారణలో బయటకొచ్చింది. మీడియా సంస్థ యజమాని వద్ధ కూడా సర్వర్‌ను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే ప్రైవేట్ వ్యక్తుల కాల్స్‌ను ప్రణీత్ వినడం జరిగిందని, సాధారణంగా ఎస్ఐబిలో నోడల్ ఆఫీసర్ ప్రమాదంతోనే కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం ఉంటుందని, నోడల్ అధికారి లింక్ ఇవ్వడంతో కాల్ రికార్డింగ్స్ వినే సదుపాయం అనుమతి ఉన్న అధికారులకు లభిస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రణీత్ బృందం అనధికారికంగా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను విదేశాల నుంచి కొనుగోలు చేసినట్టు విచారణాధికారులు గుర్తించడం ఈ కేసులో మరో కీలక పరిణామంగా నిలిచింది.
ఎస్ఐబి లోని కొన్ని కంప్యూటర్లలో మాల్వేరును ఇన్‌స్టాల్ చేసిన ప్రణీత్ అండ్ టీం కొత్త మాల్వేర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండానే కాల్స్ విని ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సీసీ కెమెరాలను ఆఫ్ చేసి కొత్త మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్ల నుండి తొలగించడంతో పాటు మాల్వేర్ నుండి విన్న కాల్ రికార్డింగ్స్‌ను కొత్త హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ లోకి ప్రణీత్ ఎక్కించుకుని, పాత హార్డ్ డిస్క్‌లను, డివైస్‌లను ధ్వసం చేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
ప్రణీత్‌రావు ట్యాప్ చేసిన సమాచారంకు సంబంధించిన ఎస్‌ఐబీ డివైస్, హార్డ్ డిస్క్‌లను పగలగొట్టి అడవుల్లో పడేసినట్లుగా విచారణలో చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం పోలీసు బృందాలు అడవికి వెళ్లాయి. ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా లభ్యమైన సమాచారం అధారంగా బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌కు కూడా పాల్పడి అక్రమార్జన చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు.
కాగా ప్రణీత్‌రావుతో ట్యాపింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో సంబధం ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ప్రణీత్‌రావుతో ఆ ఇద్దరు సీఐలకు ఉన్న సంబంధాలు..వారంతా కలిసి చేసిన ట్యాపింగ్ వ్యవహారాలపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.