జనవరి 22వ తేదీనే డెలివరీలు చేయాలని కోరుతున్న గర్భిణీలు.. ఇదీ సంగతి..

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం భారతీయుల దశాబ్దాల కల. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శరవేగంగా సాగుతున్నది.

జనవరి 22వ తేదీనే డెలివరీలు చేయాలని కోరుతున్న గర్భిణీలు.. ఇదీ సంగతి..

Ayodhya | అయోధ్యలో రామ మందిరం నిర్మాణం భారతీయుల దశాబ్దాల కల. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ఇక ఎన్నో ఏళ్ల భారతీయుల కల త్వరలోనే ఆవిష్కృతం కాబోతున్నది. ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేడుక జరుగనున్నది. ఆ రోజు భారతదేశవ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సంతరించుకోనున్నది.


ఈ క్రమంలో యావత్‌ దేశ ఈ వేడుక కోసం నిరీక్షిస్తున్నది. అయోధ్య రామ మందిర ప్రారంభం ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు జరుగబోతున్నది. గర్భాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ప్రస్తుతం అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొన్నది. అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.


ఇదిలా ఉండగా.. రాముడి విగ్రహ ప్రతిష్ట రోజున, సరిగ్గా అదే ముహూర్తానికి బిడ్డలకు జన్మనివ్వలని గర్భిణులు కోరుకుంటున్నారు. యూపీకి చెందిన పలువురు గర్భిణులు ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలోనే డెలివరీలు చేయాలని వైద్యులను కోరారు. ప్రస్తుతం నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్న వారిని సైతం ఈ నెల 22 వరకు ఆపాలని వేడుకుంటున్నారు. అలాగే, నెలలు నిండని వారు సైతం ముందస్తుగానే ఆపరేషన్లు చేయాలని వైద్యులను కోరడం గమనార్హం.


గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆపరేషన్లు చేస్తామని వారికి వైద్యులు హామీ ఇచ్చారు. అయితే, 22న ప్రత్యేకంగా డెలివరీలు చేయాలని చాలా అభ్యర్థలు వచ్చాయని సీమా ద్విదేవి అనే వైద్యురాలు వెల్లడించారు. ప్రతి రోజూ 14-15 కుటుంబాలు డెలివరీలు చేయలని వస్తున్నారన్నారు. అందరికీ సాధారణ ప్రసవాలు జరగడం అసాధ్యమని.. ఆరోగ్య పరిస్థితులను బట్టి శస్త్రచికిత్స చేస్తామని వివరించినట్లు తెలిపారు. 22న దాదాపు 30 మందికి ఆపరేషన్ల కోసం ఆసుపత్రిలో ఏర్పాట్లు చేసిన తెలిపారు.


ఓ గర్భిణి మాట్లాడుతూ మా ఇంట్లోకి రామ్‌లల్లా రావాలని కోరుకుంటున్నామని తెలిపింది. 100 సంవత్సరాలుగా రామాలయం కోసం ఎదురుచూస్తున్నామని.. ఆలయ ప్రారంభోత్సవం రోజునే మా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఇది అదృష్ణ క్షణాలవుతాయని తెలిపింది. తన ప్రసవం సైతం 22వ తేదీకి దగ్గరగానే ఉందని ఆ మహిళ తెలిపింది. గర్భిణులు డెలివరీ 22వ తేదీన చేయించుకోవడానికి వెనుక ఉన్న కారణాన్ని మనస్తత్వవేత్త దివ్య గుప్తా మాట్లాడుతూ.. శుభ సమయంలో బిడ్డ పుడితే.. అది శిశువు వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారన్నారు.


ఇదిలా ఉండగా.. రామాలయం మొదటి దశ పనులు పూర్తికావడంతో శ్రీరామ్‌ జన్మభూమిక్షేత్ర ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు వారం ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16న వైధిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ వేడుకక కోసం ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మరో వైపు వేడుక కోసం 7వేల మంది అతిథులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ ఆహ్వానాలను పంపించింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, కరసేవలు సైతం హాజరుకానున్నారు.