లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీచేసేది ఆ సీటు నుంచే?

కాంగ్రెస్‌ పార్టీలో ప్రియాంక గాంధీకి ప్రత్యేకత ఉన్నది. అచ్చం నానమ్మ ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చే ప్రియాంక.. ఈసారి ఎన్నికల బరిలో దిగడం ద్వారా చట్టసభల్లోకి ప్రవేశించేందుకు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీచేసేది ఆ సీటు నుంచే?

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో ప్రియాంక గాంధీకి ప్రత్యేకత ఉన్నది. అచ్చం నానమ్మ ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చే ప్రియాంక.. ఈసారి ఎన్నికల బరిలో దిగడం ద్వారా చట్టసభల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతున్నది. గతంలో ప్రధాని మోదీపై వారణాసి సీటు నుంచి ప్రియాంక పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే.. ప్రియాంక రాజకీయ కెరీర్‌కు అది పెను విఘాతంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయంతో ఆ ప్రతిపాదన పక్కకు పోయింది. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆమె అప్పటి వరకూ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే.. ప్రియాంక గాంధీ కేంద్ర పాలిత ప్రాంతం డామన్‌ అండ్‌ డియూ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రియాంక ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. విజయావకాశాలపై వివరాలను అందించాలని పార్టీ అధిష్ఠానం తనను కోరిందని డామన్‌ అండ్‌ డియూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేతన్‌ పటేల్‌ ఆదివారం చెప్పారు. ‘ప్రియాంక గాంధీ డామన్‌ అండ్‌ డియూ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నాను’ అని ఆయన అన్నారు. దక్షిణ గుజరాత్‌, సౌరాష్ట్ర కాంగ్రెస్‌తోనే ఉన్నాయని, ప్రియాంక ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధి కలుగుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి, ఓటర్లు, గతంలో పార్టీకి వచ్చిన ఓట్లు తదితరాలపై నివేదిక ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం కోరినట్టు పటేల్‌ వెల్లడించారు.

డామన్‌ డియూ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీకి బలమైన స్థానం. 2009 నుంచి ఇక్కడ బీజేపీ నేత లాలుభాయ్‌ పటేల్‌ గెలుస్తూ వస్తున్నారు.