ఆరెస్పీ, బీఆరెస్‌తో పొత్తుకు జనామోదం దొరికేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో పడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సైతం కరువై ఉనికి కోసం పాకులాడే దుస్థితిలో ఉన్న బీఆరెస్‌కు

ఆరెస్పీ, బీఆరెస్‌తో పొత్తుకు జనామోదం దొరికేనా?
  • వలసలు ఆగేనా? ఓటు బదలాయింపు జరిగేనా!
  • గత ఎన్నికల్లో నిప్పులు చెరిగి ఇప్పుడు పొత్తులా?
  • ఆరెస్పీ యూటర్న్‌పై సర్వత్రా భిన్నాభిప్రాయాలు
  • ఎంపీ సీటుకోసం ఇంత దిగజారాలా? అంటూ వ్యాఖ్యలు

విధాత: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నైరాశ్యంలో పడిపోయి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సైతం కరువై ఉనికి కోసం పాకులాడే దుస్థితిలో ఉన్న బీఆరెస్‌కు.. మేమున్నామంటూ పొత్తు కోసం బీఎస్పీ ముందుకు రావడం అనూహ్య పరిణామం. తెలంగాణ రాజకీయాలలో పొడిచిన కొత్త పొత్తుతో బీఆరెస్‌, బీఎస్పీ ఎంత మేరకు లాభపడుతాయన్న అంశంతో పాటు ఏ లక్ష్యాలతో వారు పొత్తు పెట్టుకున్నారన్న రచ్చబండ చర్చలు జోరందుకున్నాయి. గత బీఆరెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనపై కాంగ్రెస్, బీజేపీ కంటే అధికంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా నిరుద్యోగుల సమస్యలు తీసుకుని నాటి బీఆరెస్‌ సర్కార్‌పై ఉద్యమించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై ఆందోళనలు.. యూనివర్సిటీ యాత్రలు చేపట్టారు. కానీ.. అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకుని, కేసీఆర్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయ పరిశీలకుల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నది. వీరి పొత్తును తెలంగాణ సమాజం ఎంత మేరకు ఆమోదిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

బీఆరెస్‌, బీఎస్పీ పొత్తుపై ఎలా రెస్పాండ్‌ కావాలో అర్థం కావడం లేదని మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘గత రెండు సంవత్సరాలు మీరు బీఆరెస్‌ మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన కేసీఆర్‌ ఇప్పుడు హీరో అయిండా? గాడిద మీద ఎక్కిఅయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా? (గాడిదలకు క్షమాపణలు). రేపు కేంద్రంలో బీఆరెస్‌ ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా? అన్యాయం పోలీస్ బాస్.. కరెక్టు కాదు మీ స్టెప్‌. యువత ఇంకా ఎవ్వరినీ నమ్మరు, మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూసాక. సారీ.. మిస్టర్‌ ఆరెస్పీ బీఎస్పీ’ అని మురళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  ‘దొరల చెంతకు చేరి, సామాజిక న్యాయం, స్వేచ్ఛ ఎలా సాధ్యం అవుతుంది సారు? అవి లేకనే కదా తెలంగాణ ప్రజలు దొరల పాలనకు స్వస్తి పలికి ప్రజల పాలన కోరుకున్నారు’ అని పలువురు గుర్తు చేస్తున్నారు.

వ్యతిరేకంగా మాట్లాడిన మూడు నెలలకే..

అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరెస్పీ బీజేపీ, బీఆరెస్‌ లోపాయికారి అవగాహనతో తనను ఓడించాయని ఆరోపించారు. ఎన్నికల్లో బీఆరెస్‌ పరాజయంపై స్పందిస్తూ ప్రజలను నిరంతరం భయపెట్టే దోపిడీదారులకు, భూకబ్జాదారులకు బుద్ధి చెప్పి, గద్దె దించారని అన్నారు. బీఆరెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన మూడు నెలలకే అదే పార్టీతో, తాను అభివర్ణించిన నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగించిన కేసీఆర్‌తో ఆరెస్పీ పొత్తు పెట్టుకోవడం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడిని గుర్తు చేస్తున్నది.

రాష్ట్రమంతటా ప్రచారం చేసినా..

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. కనీసం బీఆరెస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సైతం చీల్చుతారన్న అంచనాలను కూడా చేరుకోలేదు. ఆయన ఉద్యోగానికి వీఆరెస్‌ తీసుకొని రాజకీయాల్లోకి రావడం బీఆరెస్‌ వ్యూహంలో భాగమేనన్న విమర్శలు జోరుగా వినిపించాయి. ఇందుకు వీకే సింగ్‌ వీఆరెస్‌ దరఖాస్తును కేసీఆర్‌ ప్రభుత్వం తిరస్కరించడం, ఆకునూరి మురళీ దరఖాస్తును రెండున్నర నెలలు పెండింగ్‌లో పెట్టడాన్ని అప్పట్లో పలువురు ఉదాహరణగా చూపారు.

కొత్త పొత్తు వలసలను ఆపేనా!

బీఆరెస్‌తో బీఎస్పీ పొత్తు బీఆరెస్‌ నుంచి సాగుతున్న వలసలను ఆపుతుందా? అన్న చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యేలు, సిటింగ్‌ ఎంపీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌, బీజేపీలలో చేరుతున్నారు. పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఆ రెండు పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే నిత్యం బీఆరెస్‌ను వీడుతూనే ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ ఒకటి రెండు సీట్లకే పరిమితమైనా.. ఒక్క సీటు గెలవకపోయినా ఆ పార్టీ మరింత సంక్షోభంలో పడవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడు రానున్న రోజులలో స్థానిక సంస్థలలో బీఆరెస్‌ నుంచి మరింతగా వలసలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆరెస్‌తో బీఎస్పీ పొత్తు గులాబీ నాయకుల్లో భవిష్యత్తుపై నమ్మకం కల్గించి, వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందన్నది చూడాల్సివుంది. బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి తెలంగాణను కాపాడేందుకే పొత్తు పెట్టుకున్నామని ఆరెస్పీ చెప్పారు. నిజానికి ఈ పొత్తు తెలంగాణను కాపాడే దిశగా ఎంతమేరకు సఫలీకృతమవుతుందన్నది పక్కన పెడితే బీఆరెస్‌, బీఎస్పీలను కాపాడుకునేందుకు మాత్రం ఉపయోగపడితే చాలంటున్నారు విశ్లేషకులు.

పొత్తుకు జనామోదం దొరికేనా?

బీఆరెస్‌, బీఎస్పీ మధ్య పొత్తును తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఇటీవలీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌కు దూరమైన ఎస్సీ, ఎస్టీలు ఎంత మేరకు స్వాగితిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆరెస్‌ను వ్యతిరేకించిన ఆ వర్గం ఓటర్లలో ఆరెస్పీ పట్ల సానుకూలతతో యువత కొంత మేరకు బీఎస్పీకి ఓటు వేసినా ఆ వర్గాల సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో వారంతా బీఆరెస్‌, బీఎస్పీ మధ్య పొత్తుతో తిరిగి ఈ రెండు పార్టీల వైపు మళ్లుతారని అనుకోవడం సందేహమేనని అంటున్నారు.

2018తో పోల్చితే బీఎస్పీకి తగ్గిన ఓట్ల శాతం

నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన మొత్తం 4.27 లక్షల ఓట్లలో కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్య 2శాతం ఓట్ల వరకే తేడా ఉంది. బీఆరెస్‌ ఘన విజయాలు సాధించిన హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు పక్కనపెడితే.. ఈ తేడా మరింతగానే ఉన్నది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ 108 సీట్లలో పోటీ చేసింది. హెలికాప్టర్‌ వేసుకుని ప్రచారం చేసినా రాష్ట్ర అధ్యక్షుడైన ఆరెస్పీ సహా ఆ పార్టీ అభ్యర్థులు ఎవ్వరూ గెలువలేదు. సిర్పూర్‌ నియోజవర్గంలో పోటీ చేసిన ఆరెస్పీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. దళితుల ఓటు బ్యాంకును బీఎస్పీ సొంతం చేసుకుంటుందని ప్రచారం జరిగినా ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయింది. చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 92,33,784 ఓట్లు వస్తే, బీఆరెస్‌కు 87,51,391 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 32,56,130 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 5,19,047ఓట్లు రాగా, ఐదవ స్థానంలో ఉన్న బీఎస్పీకి 3,21,047 ఓట్లు వచ్చాయి. ఇదే బీఎస్పీకి 2018లో 4,26,203 ఓట్లు పోలవ్వడం గమనార్హం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 1.35 శాతం ఓట్లు పోలవగా.. 2018 లో ఓట్ షేర్ 2.07 శాతానికి పెరిగింది. 2023లో ఓట్ షేర్ 1.40 శాతానికి పడిపోయింది.

అరెస్పీ నాగర్‌కర్నూల్‌ నెగ్గేనా!

బీఆరెస్‌తో పొత్తులో భాగంగా ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ నాగర్‌ కర్నూల్‌ బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలకుగాను ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. రెండింటిలో బీఆరెస్‌ గెలిచింది. ఓట్ల పరంగా కాంగ్రెస్‌కు ఈ పార్లమెంటరీ నియోకవర్గం పరిధిలో 6,39,628 ఓట్లు పోలవ్వగా, బీఆరెస్‌కు 5,00,654 ఓట్లు, బీజేపీకి 1,18,513 ఓట్లు పోలయ్యాయి. ఈ లెక్కన బీఎస్పీ అభ్యర్థిగా ఆరెస్పీ గెలుపు అంత సులభం కాదంటున్నారు విశ్లేషకులు.