PV Srinivas | పీవీ శ్రీనివాస్ది ఒక గొప్ప చరిత్ర..తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్
PV Srinivas | భద్రాచలంలో సంస్మరణ సభ హాజరైన పలువురు ప్రముఖులు విధాత: చరిత్రలో ఎవరి పేజీ వారే రాసుకుంటారని, విద్యార్థి నుంచి, యువజన స్థాయిలో ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మించి సామాజిక సేవలో పీవి శ్రీనివాస్ ది గొప్ప చరిత్ర అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక మాజీ జనరల్ మేనేజర్ పీవీ శ్రీనివాస్ సంస్మరణ సభ ఆదివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. […]

PV Srinivas |
- భద్రాచలంలో సంస్మరణ సభ
- హాజరైన పలువురు ప్రముఖులు
విధాత: చరిత్రలో ఎవరి పేజీ వారే రాసుకుంటారని, విద్యార్థి నుంచి, యువజన స్థాయిలో ప్రజా ఉద్యమాలను బలంగా నిర్మించి సామాజిక సేవలో పీవి శ్రీనివాస్ ది గొప్ప చరిత్ర అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. నవతెలంగాణ దినపత్రిక మాజీ జనరల్ మేనేజర్ పీవీ శ్రీనివాస్ సంస్మరణ సభ ఆదివారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.
సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ఆయన స్నేహితులు, అభిమానులు, పార్టీ నాయకులు, బంధువులు హాజరయ్యారు. భద్రాచలం మాజీ జడ్పీటీసీ గుండు శరత్ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ సభలో జూలూరు గౌరీ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
పీవీలో అనేక గొప్ప కోణాలు దాగి ఉన్నాయని, పార్టీని ఎంతో గొప్పగా గౌరవించాడని వ్యాఖ్యానించారు. తన వివాహం కూడా ఆదర్శ వివాహం చేసుకున్నాడని గుర్తు చేశారు. 1980-90 దశాబ్దాల్లో వచ్చిన యువతకు సామాజిక స్పృహ ఎంతగానో ఉందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు.
ఈ దశాబ్దం చాలా భిన్నంగా ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసే వారు ఉద్యమ భావజాలాలను కలిగి ఉంటారని, అటువంటి కోవలో పీవీ శ్రీనివాస్ పయనం జరిగిందని, పీవీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పీవీ ఆశయ సాధనకు నడుంబిగించాలన్నారు. బహుజనులు అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు. పీవీ కుటుంబానికి అండగా నిలవాలని వెల్లడించారు.
నవ తెలంగాణకు పునాది పీవీ: వేణుమాధవ్, నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్
నవ తెలంగాణకు పునాది లాంటి వాడు పీవీ శ్రీనివాస్ అని నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ వేణుమాధవ్ వ్యాఖ్యానించారు. పత్రికను నిలబెట్టడంలో ఆయన సహకారం మరువలేనిది అన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం పత్రిక ద్వారా తనకు చేతనైనంత సహాయం చేశారని గుర్తు చేశారు. పత్రికా ప్రారంభంలో అందులో పని చేసే స్టాప్ లో చైతన్యం తీసుకొచ్చి పత్రిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారన్నారు.
పత్రిక, పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని ఆయన సేవలను గుర్తు చేశారు. నిరంతరం అధ్యయనం మీదనే ఆయన ఫోకస్ పెట్టారని వెల్లడించారు. పీవీ శ్రీనివాస్ ఆశయ సాధన కోసం అందరూ పని చేస్తామన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎలమంచిలి రవికుమార్ మాట్లాడుతూ పీవీ శ్రీనివాస్ లేని లోటు పూడ్చలేనిది అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియశారు.
సీపీఎం భద్రాచలం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు నిర్మించి ఎందరో యువతకు మార్గదర్శకంగా నిలవటమే కాకుండా, పత్రిక ద్వారా తన భావజాలాలను వ్యాపింప చేసి సమసమాజ నిర్మాణం కోసం పివి పరితపించిన విధానం ఎన్నటికీ మర్చిపోలేనిదని అన్నారు. పీవీతో తనకు ఎంతో చక్కని పరిచయం ఉందన్నారు. వారి కుటుంబంతో కూడా చాలా ఏళ్లుగా సన్నిహిత సంబంధం ఉందని వారంతా భావజాలాలు కలిగిన వ్యక్తులని తెలిపారు. పార్టీ అభివృద్ధిలో కూడా పివి ఎంతగానో పాటుపడాలని ఆయన సేవలను గుర్తు చేశారు.
నవ తెలంగాణలో పీవీ పాత్ర ప్రశంసనీయమన్నారు. ఏపీ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాల కాశయ్య , ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బీ రాజు, తెలంగాణ బుక్ ట్రస్ట్ సెక్రటరీ కే చంద్రమోహన్, టీవీ5 ఎడిటర్ వైజే రాంబాబు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి, పివి సతీమణి జ్యోతి, భద్రాచలం మాజీ జడ్పిటిసి గుండు శరత్, భద్రాచలం పట్టణ ప్రముఖ న్యాయవాది టి. చైతన్య మాట్లాడుతూ తమ అనుబంధాన్ని గుర్తు చేశారు.
పీవీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. పీవీ సంస్మరణ సభలో నవతెలంగాణ ఉభయ ఖమ్మం జిల్లా బ్రాంచ్ మేనేజర్ జావెద్, విధాత డిజిటల్ మీడియా ఎడిటర్ తాళ్లూరి జగన్మోహన్, భద్రాచలం ఎంఈఓ సమ్మయ్య, సిపిఎం పార్టీ భద్రాచలం మండల కార్యదర్శి గడ్డం స్వామి, పీవీ తల్లిదండ్రులు కృష్ణారావు, పుల్లమ్మ, పట్టణ ప్రముఖులు, పీవీ స్నేహితులు,బంధువులు, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.