ఆ.. పార్టీల్లో అగ్గి రాజేసింది వాళ్లేనా?

విధాత‌: మేడ్చల్‌ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి వైఖరిపై ధ్వజమెత్తారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే మంత్రిపై ఐదుగురు ఎమ్మెల్యేల ఆరోపణల వెనుక బీఆర్‌ఎస్‌ అధిష్ఠానమే ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి సంగతి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వద్దే తేల్చుకుంటామ‌న్నారు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి కూడా పదవులు ఇచ్చేది కేసీఆర్‌, కేటీఆర్‌ తప్ప తాను కాదన్నారు. అధికార […]

ఆ.. పార్టీల్లో అగ్గి రాజేసింది వాళ్లేనా?

విధాత‌: మేడ్చల్‌ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డి వైఖరిపై ధ్వజమెత్తారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే మంత్రిపై ఐదుగురు ఎమ్మెల్యేల ఆరోపణల వెనుక బీఆర్‌ఎస్‌ అధిష్ఠానమే ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది.

ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి సంగతి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వద్దే తేల్చుకుంటామ‌న్నారు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి కూడా పదవులు ఇచ్చేది కేసీఆర్‌, కేటీఆర్‌ తప్ప తాను కాదన్నారు. అధికార పార్టీలో తలెత్తిన విభేదాలు టీ కప్పులో తుఫానులా తేలిపోతాయా? లేక కొనసాగుతాయా? ఈ వ్యవహారానికి మరికొంతమంది అసంతృప్తుల వ‌ర్గం ఆజ్యం పోస్తుందా? అనేది త్వరలో తేలుతుంది.

ఈ చర్చ జరుగుతుండగానే.. అసలు ఉన్నట్టుండి ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రిపై విమర్శలు చేయడానికి గల కారణాలు ఏమిటనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. మొదట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌ రావుకు చెందిన సంస్థలపై మొదలైన ఈ దాడులు మంత్రి మల్లారెడ్డి సంస్థలపై జరగడం సంచలనం సృష్టించింది.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తున్నది. బీహార్‌లో జేడీయూ బీజేపీకి కటీఫ్‌ చెప్పిన తర్వాత ఆ రాష్ట్రంలోని స్థానాలపై, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధినేత కేంద్రంలో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాక ఇక్కడి స్థానాలపై ఫోకస్‌ పెట్టింది.

బీఆర్‌ఎస్‌ ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి బీఆర్‌ఎస్‌ విస్తరణ ఇబ్బందిగా మారవచ్చు. అందుకే బీఆర్‌ఎస్‌ అధినేతను రాష్ట్రం దాటి రాకుండా అడ్డుకోవడానికి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేల వెనుక ఆపార్టీ ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతున్నది. ఆ ఆట బీజేపీ అధిష్ఠానం మొదలు పెట్టినా.. బీఆర్‌ఎస్‌ అధినేత దానికి చెక్‌ పెట్టడానికి ఎమ్మెల్యేలను తెర మీదకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే బీజేపీ గత ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. వాటిని తిరిగి నిలబెట్టు కోవడంతో పాటు అదనంగా చేవెళ్ల, మల్కాజ్‌గిరి, ఖమ్మం, నల్గొండ, భువనగిరి, జహీరాబాద్‌, శేర్‌లింగం పల్లి స్థానాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకే పార్లమెంటు స్థానాల్లో బలంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అంతకుముందు ఆయా స్థానాల్లో ఎంపీలుగా పనిచేసిన వారిని పార్టీలోకి రప్పించడానికి యత్నిస్తున్నది.

ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన లోక్‌సభ బరిలో ఉంటారా? లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఏ పార్టీ నుంచి అన్నది త్వరలో తేలుతుంది. బూర నర్సయ్య భువనగిరి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డి కూడా ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దారి ఎటువైపు అన్నది స్పష్టత లేదు. ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వర్‌రావు బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలం కిందట జరిగింది. అలాగే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిలు కూడా బీజేపీలోకి అనే ప్రచారం వాట్సప్‌ యూనివర్సిటీ ద్వారా చేయించింది.

మంత్రి మల్లారెడ్డి కూడా గతంలో మల్కాజ్‌ గిరి ఎంపీగా పనిచేశారు. ఆయనపై ఆరోపణల చేసిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో మైనంపల్లి హనుమంతరావు ప్రస్తుతం మల్లాజ్‌గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికారపార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నది. అందుకే బీజేపీ నేతలు చాలా రోజుల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో చేరికల కమిటీ అని పెట్టి దానికి కన్వీనర్‌గా ఈటల రాజేందర్‌ను పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డిలను పార్టీలోకి తెచ్చి, ఆ పార్టీలో రేవంత్‌ టార్గెట్‌గా పార్టీ పదవుల కమిటీలపై రచ్చ వెనుక బీజేపీ ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అధికారపార్టీలోని మంత్రిపై ఎమ్మెల్యేల విమర్శల బహిరంగ విమర్శలు కలకలం సృష్టించాయి.

ఎందుకంటే మంత్రులపైన, జిల్లా నాయకత్వంపైన కూడా నేరుగా విమర్శలు చేసే సంస్కృతి టీఆర్‌ఎస్‌లో ఇప్పటివరకు లేదు. టీఆర్‌ఎస్‌లో ఆర్థికంగా, నియోజకవర్గంలో కొంత బలం ఉన్న నేతలను పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. అలాంటి నేతల, కుటుంబ సభ్యుల వ్యాపార సంస్థలపై స్వతంత్ర సంస్థలను ప్రయోగించి దారిలోకి తెచ్చుకోవడానికి యత్నిస్తున్నదని అధికారపార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

బెదిరించో.. ప్రలోభపెట్టో.. ఏవైనా హామీలు ఇచ్చో పార్టీ మారేలా ఒత్తిడి తెస్తున్నట్టు ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్న బీజేపీలో త్వరలో భారీ చేరికలు దీనికి బలం చేకూరస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి బీజేపీ ఇలాంటి చర్యలు చేస్తున్నదా? లేదా ఎమ్మెల్యేలు మంత్రిపై విమర్శలు చేయడం వెనుక బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఉన్నదా? అనేది చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జరుగుతున్నది.