రేవంత్ రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదీ..

రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ స‌ర్కార్ కొలువుదీర‌నుంది. అయితే.. ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న విషయంలో ఇంకా స్పష్టత రావటం లేదు.

  • By: Somu    latest    Dec 04, 2023 10:32 AM IST
రేవంత్ రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదీ..

విధాత‌: కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్‌ గెజిట్‌ విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ స‌ర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి తొలిసారిగా కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌మాణం చేస్తారని తెలుస్తున్నది. అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్‌లో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నాయ‌కత్వంలోని బీఆర్ఎస్ అనూహ్యంగా 39 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. ఇక బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో గెలుపొందాయి.


రేవంత్ రెడ్డి కుటుంబ నేప‌థ్యం..


అనుముల రేవంత్ రెడ్డి..1969 ఆగస్టు 8న ఉమ్మ‌డి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని కొండారెడ్డి పల్లెలో.. దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఆరుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన రేవంత్ రెడ్డి… ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేశారు. అనంతరం డిగ్రీ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు.

 



ఉస్మానియా అనుబంధ కాలేజీ ఏవీ కాలేజీలో డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్) పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలున్న రేవంత్… పాఠశాలలో చదివే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్ ఉన్నారు. దూకుడుగా, చురుకుగా ఉండే రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై పోరాడేవారు. ఏబీవీపీ స్టూడెంట్ యూనియన్‌లో మెంబర్‌గా చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెయింటర్‌గా కొంతకాలం పనిచేశారు.



 


ఆ తర్వాత సోదరుడితో కలిసి ప్రిటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. అది విజయవంతం అవ్వడంతో.. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆర్థికంగా నిలదొక్కుకున్న రేవంత్ రెడ్డి.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. వీరికి ఒక కుమార్తె ఉన్నారు.


రేవంత్ రాజకీయ ప్రస్థానం


ఆర్ఎస్ఎస్‌ను వీడిన రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు రేవంత్ రెడ్డి. 2001-02 మధ్య టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఆ తర్వాత 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించినా.. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ సీటు రేవంత్‌కు ద‌క్క‌లేదు. 2006లో జ‌డ్పీటీసీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇస్తారని భావించినా మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. 2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రాజ‌కీయ దిగ్గజాలు కేసీఆర్, వైఎస్ఆర్ వ్యూహాలను చిత్తుచేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.


అప్పుడే రేవంత్ రెడ్డి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. తనకు ఎంతో ఇష్టమైన టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డికి… చంద్రబాబు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా ఓటమి పాలైనా.. రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నిక‌ల్లో గెలుపొందిన రేవంత్.. 2018లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు.


2017లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రేవంత్..


అయితే తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులు, టీడీపీలోనే ఉంటే రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగే ఛాన్స్ లేదని భావించిన రేవంత్ రెడ్డి… 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డిని… కేసీఆర్ తన అస్త్రాలన్నీ ఉపయోగించి ఓడించారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిటెండ్‌గా నియమించింది.


 


2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి(మంత్రి మ‌ల్లారెడ్డి అల్లుడు)పై 10,919 ఓట్ల తేడాతో గెలుపొంది మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎల్పీగా ఎన్నిక‌య్యారు. పీసీసీ అధ్య‌క్షుడిగా పాదయాత్రలు, పదునైన మాటలు, ప్రత్యర్థి వ్యూహాలను ఛేదిస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.