రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయండి

రాష్ట్రంలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ల‌ను బలోపేతం చేయాల‌ని తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ‌

రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయండి

సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌

రాష్ట్రంలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ల‌ను బలోపేతం చేయాల‌ని తెలంగాణ డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు వి.ల‌చ్చిరెడ్డి, కె.రామ‌కృష్ణ‌, ఎన్.ఆర్ స‌రిత‌, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, అసోసియేట్ ప్రెసిడెంట్ పూల్‌సింగ్ కోరారు. ఆదివారం డిప్యూటీ క‌లెక్ట‌ర్స్ అసోసియేష‌న్, తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు సంయుక్తంగా సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిసి రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతంకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు, పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల పెండింగ్ స‌మ‌స్య‌లు, తహ‌శీల్దార్ల‌ అద్దె వాహ‌నాల‌కు బిల్లుల చెల్లింపు, క్యాడ‌ర్ స్టెంన్త్ పెంపు, త‌దిత‌ర అంశాల‌ను సీఎం దృష్టికి తీసుకెళ్ల‌డం జ‌రిగింది.

వీటిలో ప్ర‌ధాన‌మైనంగా రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ పథ‌కాలు స‌క్ర‌మంగా అమ‌లు కావాలంటే రెవెన్యూ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌న్నారు. ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. గ్రామ‌స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేయాల‌ని కోరారు. గ‌తంలో వ‌లె గ్రామ‌, మండ‌ల స్థాయిల్లో ఉద్యోగుల సంఖ్య‌నుపెంచాల‌న్నారు.

ప్ర‌జ‌ల సౌక‌ర్యార్ధం రెవెన్యూ ప‌రిపాల‌న‌లో తేవాల్సిన మార్పుల‌కు సంబంధించిన అంశాల‌ను కూడా సీఎంకు వివ‌రించారు. రూర‌ల్‌, సెమీ రూర‌ల్‌, అర్బ‌న్‌గా మూడు స్థాయిలుగా విభ‌జిస్తే ప్ర‌జ‌ల‌కు సేవ‌లు సుల‌భంగా, వేగంగా అందుతాయ‌న్నారు.

పూర్వ వీఆర్ఓల స‌మ‌స్య‌లు నేటికి పూర్తి స్థాయిలో ప‌రిష్కారం కాలేద‌న్నారు. దీంతో రాష్ట్రంలో 5576 మంది పూర్వ వీఆర్ఓలు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టుగా గుర్తు చేశారు. గ‌త స‌ర్వీసును సైతం ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ముఖ్యంగా సీనియారిటీ, ప్ర‌మోష‌న్లు ఉండేలా చూడాల‌ని కోరారు.

ఇదే విధంగా పూర్వ వీఆర్ఏల స‌మ‌స్య‌లు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయ‌న్నారు. వారిని స‌ర్దుబాటు పేరుతో వివిధ జిల్లాల‌కు పంపించి ఆ త‌ర్వాత గత ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. మీరైనా వారి అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

అద‌న‌పు క‌లెక్ట‌ర్ల పోస్టుల విష‌యానికొస్తే ఇదంతా కూడా జీఏడీ ప‌రిధిలో ఉంద‌న్నారు. ఈ విధంగా కాకుండా దీనిని రెవెన్యూ విభాగం ప‌రిధిలోకి తేవాల‌ని కోరారు.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జ‌రిగింది. జిల్లాల‌తో పాటు రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాలు పెరిగాయి. కానీ రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య మాత్రం పెర‌గ‌లేదు. దీంతో ఉన్న ఉద్యోగుల మీద‌నే ప‌ని భారం ప‌డుతుంది. జిల్లాలు, మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్ల‌కు అనుగుణంగా క్యాడ‌ర్ స్టెంన్త్‌ను పెంచాల‌ని కోరారు.

మండ‌ల స్థాయిలో త‌హ‌శీల్దార్ల‌కు అద్దె వాహ‌నాల‌కు గ‌త ఏడాది నుంచి అద్దెలు చెల్లించ‌డం లేద‌న్నారు. అద్దె వాహ‌నాల‌కు అద్దెల‌ను చెల్లించ‌క‌పోవ‌డంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వివ‌రించారు.

అన్ని అంశాల‌పై సీఎం రేవంత్‌రెడ్డి గారు సానుకూలంగా స్పందించిన‌ట్టుగా అసోసియేష‌న్ల ప్ర‌తినిధులు వివ‌రించారు.