RPI | క్లీనర్ చేసిన పనికి.. శాస్త్రవేత్తల 20 ఏళ్ల శ్రమ వృథా, 8 కోట్లు నష్టం
RPI విధాత: ఓ ప్రఖ్యాత పరిశోధన సంస్థలో క్లీనర్ చేసిన నిర్వాకం వల్ల దశాబ్దాల శాస్త్రవేత్తల కృషి గాల్లో కలిసిపోయింది. సైన్స్ ప్రపంచానికి ఎంతో ఆవేదనను కలిగించిన ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న రెన్సెలియర్ పాలీటెక్నిక్ ఇన్‌స్టిస్ట్యూట్ ( ఆర్‌పీఐ) లో చోటుచేసుకుంది. 2022లో ఈ ఘటన జరగగా ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. వాటి ప్రకారం… ఆర్‌పీఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేవీ లక్ష్మి… ఫొటోసింథసిస్ అంశంపై పరిశోధన చేస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు […]

RPI
విధాత: ఓ ప్రఖ్యాత పరిశోధన సంస్థలో క్లీనర్ చేసిన నిర్వాకం వల్ల దశాబ్దాల శాస్త్రవేత్తల కృషి గాల్లో కలిసిపోయింది. సైన్స్ ప్రపంచానికి ఎంతో ఆవేదనను కలిగించిన ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న రెన్సెలియర్ పాలీటెక్నిక్ ఇన్‌స్టిస్ట్యూట్ ( ఆర్‌పీఐ) లో చోటుచేసుకుంది.
2022లో ఈ ఘటన జరగగా ఆ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. వాటి ప్రకారం… ఆర్‌పీఐలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేవీ లక్ష్మి… ఫొటోసింథసిస్ అంశంపై పరిశోధన చేస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు సాగే ఈ అధ్యయనం కోసం లక్ష్మి పలు నమూనాలను సేకరించి ఫ్రీజర్‌లో ఉంచారు. వీటికి అతి చల్లదనం అవసరం కావడంతో ఫ్రీజర్‌ను – 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంచారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 14, 2022న ఫ్రీజర్‌లో హెచ్చుతగ్గుల కారణంగా ఫ్రీజర్ బీప్ శబ్దాలను ఇవ్వడం ప్రారంభించింది. ఆ సమయంలో కొవిడ్ ముమ్మరంగా ఉండటంతో దానికి మరమ్మతులు చేయడం కుదర్లేదు. అయితే ఎవరైనా దానిని ఆపేస్తారేమోనని భావించిన ప్రొఫెసర్ లక్ష్మి, ఇతర శాస్త్రవేత్తలు ఆ అలారం శబ్దం ఎందుకు వస్తోందో రాసిపెట్టి, దాని విద్యుత్ సాకెట్‌కు లాక్ వేసేశారు.
అయితే సరిగ్గా నాలుగు రోజుల తర్వాత సెప్టెంబర్ 17న విధులకు వచ్చిన ఓ కాంట్రాక్టు సంస్థ తరపు క్లీనర్.. ఆ అలారం శబ్దాలు ఆగకుండా వస్తుండటంతో చిరాకుపడ్డాడు. విద్యుత్ సరఫరా ఆపకుండా ప్లగ్ సాకెట్‌కు లాక్ వేసి ఉండటంతో ఏకంగా మెయిన్ దగ్గర సర్క్యూట్ బ్రేకర్‌ను ఆఫ్ చేశాడు. దీంతో ఫ్రీజర్ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఆ తర్వాతి రోజు విషయాన్ని గమనించిన శాస్త్రవేత్తల గుండె గుభేలుమంది.
రెండు దశాబ్దాలుగా వారు సేకరించిన నమూనాలు పాడైపోయాయని గుర్తించి కంగుతిన్నారు. తాజాగా ఆ క్లీనర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్ సంస్థపై ఆర్‌పీఐ శాస్త్రవేత్తలు కేసు వేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాము ఆ అలారం శబ్దాన్ని ఆపడానికే ఈ పని చేశామని, ఎప్పుడూ ఎలా చేస్తామో అలానే చేశామని ఆ క్లీనర్ ఇప్పటికీ వాదిస్తుండటం కొసమెరుపు.