Luna25 | మాస్కో.. వి హేవ్ ఏ ప్రాబ్లమ్! చందమామ రేసులో రష్యా ల్యాండర్ ఔట్?

Luna25 | పోయిందా: ‘లూనా-25’ గాన్? వ్యోమనౌకతో తెగిన సంబంధాలు? దిగకముందే రష్యా హ్యాండ్సప్? ల్యాండర్ ‘లూనా-25’ ఆఖరి నిమిషంలో విఫలమైందా? కలలు కల్లలయ్యాయా? రష్యా ఆశలు ఆవిరయ్యాయా? సందర్భం ఎలాంటిదంటే.. ఇక జాబిలి దక్షిణ ధృవపు ఉపరితలంపై రష్యా ‘లూనా-25’ ల్యాండర్ మృదువుగా దిగడమే తరువాయి. దిగే ముందుగా వ్యోమనౌకకు అది ఇప్పుడున్న చంద్రకక్ష్యలోనే చేపట్టే చిట్టచివరి, చిన్నపాటి కక్ష్య మార్పు విన్యాసం అది. ‘లూనా-25’ వ్యోమనౌకను ‘ప్రీ-ల్యాండింగ్ కక్ష్య’లోకి బదిలీ చేసేందుకు ఉద్దేశించిన ఆ […]

  • By: krs    latest    Aug 20, 2023 11:27 AM IST
Luna25 | మాస్కో.. వి హేవ్ ఏ ప్రాబ్లమ్! చందమామ రేసులో రష్యా ల్యాండర్ ఔట్?

Luna25 |

  • పోయిందా: ‘లూనా-25’ గాన్?
  • వ్యోమనౌకతో తెగిన సంబంధాలు?
  • దిగకముందే రష్యా హ్యాండ్సప్?

ల్యాండర్ ‘లూనా-25’ ఆఖరి నిమిషంలో విఫలమైందా? కలలు కల్లలయ్యాయా? రష్యా ఆశలు ఆవిరయ్యాయా? సందర్భం ఎలాంటిదంటే.. ఇక జాబిలి దక్షిణ ధృవపు ఉపరితలంపై రష్యా ‘లూనా-25’ ల్యాండర్ మృదువుగా దిగడమే తరువాయి. దిగే ముందుగా వ్యోమనౌకకు అది ఇప్పుడున్న చంద్రకక్ష్యలోనే చేపట్టే చిట్టచివరి, చిన్నపాటి కక్ష్య మార్పు విన్యాసం అది.

‘లూనా-25’ వ్యోమనౌకను ‘ప్రీ-ల్యాండింగ్ కక్ష్య’లోకి బదిలీ చేసేందుకు ఉద్దేశించిన ఆ విన్యాసం… అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా నిర్దేశిత పరామితులకు అనుగుణంగా జరగలేదు. వ్యోమనౌక ముందుకు సాగేందుకు అంటే.. లక్ష్యిత కక్ష్యలోకి దాన్ని నెట్టే యత్నంలో భాగంగా థ్రస్ట్ ఇచ్చేందుకు ఇంజిన్ మండించే సమయంలో ల్యాండర్లోని ఆటోమేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.

రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ మాటల్లో చెప్పాలంటే… అదొక ‘అసాధారణ, అత్యవసర స్థితి’. తాజా సమస్య ఫలితంగా ల్యాండర్ చంద్రుడిపై దిగడానికి ఏవైనా ఇబ్బందులున్నాయా అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. ‘లూనా-25’ చంద్రుడిపై దిగాలంటే.. ఇప్పుడు నిలిచిపోయిన విన్యాసం విజయవంతంగా పూర్తికావాల్సిందే.

నిర్వాహక బృందంలోని నిపుణులు ప్రస్తుతం పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. సాంకేతిక సమస్యను ల్యాండర్ ఏమేరకు అధిగమిస్తుందో చూడాలి. తాజా పరిణామాలతో ‘లూనా-25’ ల్యాండింగులో జాప్యం సంభవిస్తుందేమో తెలియరాలేదు.

సోషల్ మీడియాలో హోరు!

‘లూనా-25 ల్యాండర్ పోయింది’ అంటూ రష్యా సామాజిక మాధ్యమాల్లో వదంతులు వెల్లువెత్తుతున్నాయి. ల్యాండర్లో తలెత్తింది తీవ్ర సమస్య కాకపోతే ‘రోస్ కాస్మోస్’ అసలు దాన్ని ప్రస్తావించేదే కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. వ్యోమనౌకతో రష్యా సమాచార సంబంధాలు కోల్పోయిందంటూ అంతర్జాలంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. సమస్య మరింత సంక్లిష్టమవుతుంది.

వ్యోమనౌకతో కమ్యూనికేషన్స్ పునరుద్ధరించడానికి రష్యాకు ‘డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్’ లేదు. అలాంటి నెట్వర్క్ ఉన్న దేశాలు.. ఉక్రెయిన్ మీద యుద్ధం నేపథ్యంలో ఏకాకిగా మిగిలిన రష్యాకు ఈ సమయంలో ఎంతవరకు సహకారం అందించగలవనేది మరో ప్రశ్న. ఒకవేళ ‘లూనా-25’ ల్యాండర్ ‘చంద్ర కక్ష్యలో మరణిస్తే’ రష్యా అంతరిక్ష పరిశోధనా కార్యక్రమానికి, అంతరిక్ష పరిశ్రమకు పెద్ద ఎదురు దెబ్బే.