ఇంటింటికీ మంచినీళ్లిచ్చే బాధ్యత సర్పంచ్లకే
రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు

- గ్రామాల్లో ‘మిషన్ భగీరథ’ నుంచి బల్క్ సరఫరా
- తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే
- తాగునీటికి నియోజకవర్గానికో కోటి ప్రత్యేక నిధులు
- కృష్ణా, గోదావరితోపాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం
- రోడ్లులేని 422 గ్రామాలు, 3177 ఆవాసాలకు తారురోడ్లు
- సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేయూతగా కొత్త కార్యక్రమాలు
- కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసిన గత సర్కారు
- పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
విధాత: రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగునీటిని తక్కువ ఖర్చుతో సరఫరా చేయటం సులభమవుతుందని చెప్పారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు.
జవాబుదారీ తనం లేక పోతే..
గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వారికే ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ మాత్రమే విడిగా సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ భగీరథలో చేపట్టిన ఇంట్రా విలేజ్ వర్క్స్, ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేసే నిర్వహణ ఎవరూ పట్టించుకోవటం లేదని అన్నారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ అంశం ఎవరి పరిధిలోనూ లేదని అధికారులు వివరణ ఇచ్చారు. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య పెరిగిపోతుందని సీఎం అన్నారు.
గొప్పలకు పోయి..
వందకు వంద శాతం తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని రేవంత్ అన్నారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు వీలున్న జల్ జీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయని చెప్పారు. అందుకే వాస్తవాలను దాచిపెట్టి, గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడేలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందటం లేదని అన్నారు. ఎన్నికలప్పుడు తాను ఖానాపూర్కు వెళితే తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు చాలా గ్రామాల ప్రజలు తన దృష్టికి తెచ్చిన విషయం గుర్తు చేశారు.
సమగ్ర సర్వే చేయండి..
రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజినీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజనిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జల్జీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని ఆదేశించారు.
తాగునీటికి నియోజకవర్గానికో కోటి
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యంగా అందించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అన్ని యూనిఫామ్లు కుట్టే పని ఎస్హెచ్జీలకే
రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థినీ విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫాంలు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
అన్ని గ్రామాలకు రోడ్లు
రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు, హాబిటేషన్లకు రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎం నివేదించారు. వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి వీటిని పూర్తి చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.