Warangal | అధికార పార్టీకి భద్రత.. విపక్షాలకు నిర్భంధం! ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటె ఇదే?

Warangal పోలీసుల ముందస్తు జాగ్రత్త ఇదొక పద్ధతిగా అమలైతుందీ వినతులకూ అవకాశం లేదు ప్రభుత్వ తీరుపై విపక్షాల విమర్శలు కేటీఆర్ పర్యటన సందర్భంగా అరెస్టులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఎక్కడ పర్యటించినా ముందస్తుగా విపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు ఫ్రెండ్లీగా ఠాణాకు తరలిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో? పర్యటనలు ముగిసే వరకు అక్కడ ఉండాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. కొంచెం పెద్ద నాయకులైతే హౌస్ […]

  • By: Somu    latest    May 05, 2023 12:38 AM IST
Warangal | అధికార పార్టీకి భద్రత.. విపక్షాలకు నిర్భంధం! ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటె ఇదే?

Warangal

  • పోలీసుల ముందస్తు జాగ్రత్త
  • ఇదొక పద్ధతిగా అమలైతుందీ
  • వినతులకూ అవకాశం లేదు
  • ప్రభుత్వ తీరుపై విపక్షాల విమర్శలు
  • కేటీఆర్ పర్యటన సందర్భంగా అరెస్టులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఎక్కడ పర్యటించినా ముందస్తుగా విపక్ష పార్టీల నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు ఫ్రెండ్లీగా ఠాణాకు తరలిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో? పర్యటనలు ముగిసే వరకు అక్కడ ఉండాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. కొంచెం పెద్ద నాయకులైతే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇది ఒక పద్ధతిగా అమలైతున్నది.

తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం వరంగల్ పర్యటన సందర్భంగా మరోసారి విపక్ష పార్టీల నాయకులను గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, హౌసరెస్టులు చేయడం సాధారణంగా సాగిపోతోంది. కాంగ్రెస్, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కొందరు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.

అధికార పార్టీకి భద్రత- విపక్షాలకు ముందస్తు అదుపు?

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అధికార పార్టీకి భద్రత కల్పించి వారి కార్యక్రమాలు సాఫీగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడమే కాకుండా విపక్షాలు, ప్రజా సంఘాలకు నిరసనలు చేపట్టకుండా చూడడం. నీరసం రాకుండా అంటే ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన పేరుతో విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హైరానా పడకుండా, ఆందోళన చెందకుండా, అలసిపోకుండా సహకరిస్తున్నట్టు లెక్క. ముందస్తు అరెస్టులతో అటు వైపూ ఇటు వైపూ ఫ్రెండ్లీగా ఉండటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ గా నిర్వహిస్తూ అమలు చేస్తున్నారు.

కొత్త రాష్ట్రంలో పద్ధతిప్రకారం అమలు

తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నేతలు, ఆఖరికి పోలీస్ ఉన్నతాధికారులు సైతం పదే పదే చెబుతున్నది నిజమే. గత ఎనిమిది ఏళ్లుగా అప్రతిహతంగా ఈ పద్ధతిని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. తూచా తప్పకుండా ఫ్రెండ్లీ పోలీస్ సింగ్ కొనసాగిస్తున్నారు.

గతంలో కూడా ఉండేది

వాస్తవానికి ఈ ముందస్తు అరెస్టుల కార్యక్రమం గతంలో కూడా వేరే పద్ధతుల్లో కొనసాగింది. కాకుంటే ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. ఒకప్పుడు వరంగల్ జిల్లా లాంటి ప్రాంతాల్లో విప్లవోద్యమాల ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పోలీసులు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టారు. అధికార పార్టీ నేతల పర్యటన సందర్భంగా బందోబస్తులో భాగంగా విప్లవ పార్టీ ల కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో బంధించేవారు.

ఇంకా ఎన్నికల లాంటి సమయంలో నాయకులు, కార్యకర్తలే కాకుండా మాజీ మిలిటెంట్లను కూడా రోజుల తరబడి స్టేషన్లలో బంధించేవారు. కొన్ని సందర్భాలలో కార్యకర్తలను, మాజీ మిలిటెంట్లను వెంటబెట్టుకొని పోలీసులు రక్షణ కవచంగా వాడుకున్న సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇదే పద్ధతిని కొంత ఫ్రెండ్లీగా అమలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఉద్యమ కాలంలో అమలు

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో ఈ ముందస్తు అరెస్టుల కార్యక్రమం జోరుగానే సాగింది. అప్పట్లో ఉద్యమకారులను ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులను, జేఏసీ నాయకులను అధికార పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్భందించేవారు. వీటి నుంచి తప్పించుకునేందుకు కాకతీయ యూనివర్సిటీ తోపాటు జేఏసీ నాయకులు రకరకాల ఎత్తుగడలు అమలు చేసేవారు.

అప్పట్లో ఈ ముందస్తు అరెస్టులపై ఇప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్‌ తీవ్రంగా విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అధికార పార్టీలో నేతలుగా ఉన్న ఉద్యమకారులందరికీ ఈ విషయం అనుభవమే. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయంపై నోరు మెదపకపోవడం విచిత్రమని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్లు వీళ్లు అయినప్పుడు ఇలాగే ఉంటుందని కొందరు అనుభవజ్ఞులు చమత్కరిస్తున్నారు.

ముందస్తుల్లో మినహాయింపులు

అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే వారిని స్నేహ పార్టీలను మినహాయించి విపక్ష పార్టీల అందరికి ఈ ముందస్తు అరెస్టులు తప్పవు. ఈ వరుసలో గతంలో ఒక ఎంఐఎం మినహా అందరిని ముందు జాగ్రత్తగా అరెస్టులు చేసేవారు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎం ఎల్ పార్టీలు,ఎంసీపీఐ, ఇతర ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను తరచు ముందస్తు అరెస్టు చేసేవారు.

సీపీఐ, సీపీఎంలకు మినహాయింపు

మునుగోడు తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో గులాబీ పార్టీకి సీపీఐ, సీపీఎం నేతలు స్నేహ హస్తం అందించడంతో పరిస్థితుల్లో కొంత మార్పు జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎర్రన్నల పార్టీలకు సంబంధించిన నాయకులు, కేడర్ కు ఈ ముందస్తు అరెస్టుల నుంచి మినహాయింపు లభించింది. ఈ మధ్యకాలంలో అధికార పార్టీ పై నిరసనలు చేపట్టాలంటే సీపీఐ, సీపీఎం నేతలకు ఇబ్బందిగా మారింది. ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో గానీ అదే పద్ధతిలో గులాబీ పార్టీ నుంచి కూడా సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.

ముందస్తుపై విపక్షాల విమర్శలు

తమ హయములో తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని చెబుతూ మాట్లాడే బీఆర్ఎస్‌ నాయకుల తీరుపై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కి తమ అధికారిక పర్యటనలు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజా సమస్యలపై తాము ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా ఈ అరెస్టులు చేయడమేమంటూ ప్రశ్నిస్తున్నారు.

కనీసం సమస్యలపై వినతి పత్రాలు సమర్పించేందుకు కూడా అనుమతించకపోవడం ఏంటంటూ నిలదీస్తున్నారు. పైగా పొద్దున లేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదరగొట్టడం తప్ప ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.