సీనియర్ల లక్ష్యం.. రేవంత్ తొలగింపా..? పాదయాత్ర అడ్డగింపా..?
టీ కాంగ్రెస్‌లో సంక్షోభం.. నష్టనివారణపై దృష్టి సారించిన హై కమాండ్ దిగ్విజయ్‌సింగ్‌కు భాద్యతలు అప్పగింత రంగంలోకి దిగిన డిగ్గీ.. మహేశ్వరెడ్డికి ఫోన్ మారిన సీన్.. అసమ్మతి నేతల సమావేశం రద్దు విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభ నివారణపై పార్టీ హై కమాండ్ దృష్టి సారించింది. సేవ్ కాంగ్రెస్ పేరుతో రేవంత్‌కు వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టిన సీనియర్ నేతలను దారికి తెచ్చే భాద్యతలను ఏ ఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు […]

- టీ కాంగ్రెస్‌లో సంక్షోభం.. నష్టనివారణపై దృష్టి సారించిన హై కమాండ్
- దిగ్విజయ్‌సింగ్‌కు భాద్యతలు అప్పగింత
- రంగంలోకి దిగిన డిగ్గీ.. మహేశ్వరెడ్డికి ఫోన్
- మారిన సీన్.. అసమ్మతి నేతల సమావేశం రద్దు
విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన అంతర్గత సంక్షోభ నివారణపై పార్టీ హై కమాండ్ దృష్టి సారించింది. సేవ్ కాంగ్రెస్ పేరుతో రేవంత్‌కు వ్యతిరేకంగా వేరు కుంపటి పెట్టిన సీనియర్ నేతలను దారికి తెచ్చే భాద్యతలను ఏ ఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించింది.
ఏఐసీసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన డిగ్గీ రాజా సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేత, ఐఏసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఎలేటి మహేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేశారు. మంగళవారం సాయంత్రం నిర్వహించ తలపెట్టిన అసమ్మతి సమావేశాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. తాను త్వరలో హైదరాబాద్‌కు వచ్చి మాట్లాడుతానని తెలిపారు.
ఎలాంటి సమావేశాలు నిర్వహించ వద్దని దిగ్విజయ్ సింగ్ చేసిన ఆదేశాలతో సేవ్ కాంగ్రెస్ పేరుతో తిరుగుబాటు ప్రకటించిన సీనియర్ నేతలు కాస్త సద్దుమనిగారు. హై కమాండ్ దృష్టి సారించినందున తాము సమావేశాన్నిరద్దు చేసుకున్నామని మహేశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై హై కమాండ్ జోక్యం చేసుకున్నందున ఇక ఎలాంటి సమావేశాలు అవసరం లేదని సీనియర్ కాంగ్రెస్‌నేత వి.హన్మంతరావు అన్నారు.
అంటిముట్టనట్లుగా కోమటిరెడ్డి..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపి, అతని నాయకత్వంలో పనిచేయాలని సూచించింది. సీనియర్లందరికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఆతర్వాత సీనియర్ నేతలు కాస్త సర్దుకొన్నా… కోమటిరెడ్డి సోదరులు మాత్రం వెనక్కుతగ్గలేదు.
చివరకు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి బీజేపీలో చేరారు. ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నా అంటి ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఒక వైపు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూనే… మరో వైపు బీజేపీ అగ్ర నేత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
రేవంత్ వర్గం రాజీనామాలు చేసినా..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నరేంద్ర మోదీని కలిసిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌లో అంసతృప్తి తారా స్థాయికి చేరింది. సేవ్ కాంగ్రెస్ పేరుతో రేవంత్ వర్గీయులకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో రేవంత్ వర్గం పార్టీలో తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయినా కాంగ్రెస్ నేతలు వెనక్కు తగ్గలేదు.
పార్టీలో తాముండాలో.., లేక వాళ్లుండాలో తేల్చుకోవాలన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ముదిరింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానం సంక్షోభాన్ని నివారించే బాధ్యత దిగ్విజయ్ సింగ్‌కు అప్పగించింది.
ఉమ్మడి రాష్ట్రానికి ఇంచార్జీగా వ్యవహరించిన డిగ్గీ రాజాకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై అవగాహన ఉన్నది. సీనియర్లతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిష్కార బాధ్యతలను పార్టీ అధిష్టానం డిగ్గీ రాజాకు అప్పగింది.
అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డితో పాటు అందుబాటులోకి వచ్చిన పలువురు నేతలతో మాట్లాడినట్లు తెలుస్తున్నది. దిగ్విజయ్ సింగ్ అతి త్వరలో రాష్ట్రానికి వచ్చి పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వెళ్లడించారు.
రేవంత్ రెడ్డి పాదయాత్రను అడ్డకోవడానికేనా..?
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జనవరి నుంచి పాదయాత్ర చేపడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఏసీసీ అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ తమ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి పాదయాత్రలు చేపట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే రేవంత్ పాదయాత్ర చేయడం సీనియర్ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదన్న చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో రేవంత్ పాదయాత్ర చేస్తే తమకు ఉన్న గుర్తింపు కూడా పోతుందని, రాష్ట్ర నాయకుడిగా అతనికే పేరు వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందితే ప్రమాదమని, పార్టీ అధికారంలోకి వస్తే అతనే సీఎం అభ్యర్థిగా ముందుకు వచ్చే ప్రమాదం ఉన్నందున ముందుగానే అడ్డకట్ట వేయాలని సీనియర్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారన్న చర్చ రేవంత్ వర్గీయుల్లో జరుగుతున్నది. అందుకే రేవంత్ పాదయాత్రను అడ్డుకోవాలని సీనియర్ నేతలు చూస్తున్నట్లు తెలుస్తుంది.
పీసీసీ పదవి కూడా…
మరో వైపు.. పీసీసీ పదవి నుంచి రేవంత్‌ను తొలగించాలని కూడా అధిష్టానం ముందు డిమాండ్ పెట్టాలన్న ఆలోచనలో సీనియర్ నేతలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్న సీనియర్ నేతలను కాదని పార్టీమారి వచ్చిన వారికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఏమిటని గతంలోనే తమ అసంతృప్తిని వెల్లగక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ ముందు ఈ డిమాండ్ పెట్టాలన్న సమాలోచనలు పార్టీ సీనియర్ నేతలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
వచ్చే వారం టీ కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలు
ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ వచ్చే వారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశం కావాలని నిర్వహించినట్లు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల సమస్యలు ఆయన విని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. విభేదాలు పక్కన పెట్టి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కలిసి పని చేయాలని రాష్ట్ర నేతలకు సూచించే అవకాశం ఉంది.