బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు.. సునీల్ బన్సల్ షాక్
పార్టీని గెలిపించండి.. పదవులు ఆశించకండి విధాత: తెలంగాణలో ఇటీవల నియమితులైన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ షాక్ ఇచ్చారు. పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇఛార్జీలతో సమావేశమైన బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ టికెట్ ఆశావహుల ఆశలపై ఆయన నీళ్ళు చల్లారు. సమావేశానికి హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో ఎంతమంది పోటీ చేయాలని అనుకుంటున్నారన్న ఆయన ప్రశ్నకు మూడొంతులకు పైగా మంది […]

పార్టీని గెలిపించండి.. పదవులు ఆశించకండి
విధాత: తెలంగాణలో ఇటీవల నియమితులైన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ షాక్ ఇచ్చారు. పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇఛార్జీలతో సమావేశమైన బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సమావేశంలో పాల్గొన్న అసెంబ్లీ టికెట్ ఆశావహుల ఆశలపై ఆయన నీళ్ళు చల్లారు.
సమావేశానికి హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో ఎంతమంది పోటీ చేయాలని అనుకుంటున్నారన్న ఆయన ప్రశ్నకు మూడొంతులకు పైగా మంది చేతులెత్తారట. అయితే దీనిపై స్పందించిన సునీల్ రెండు పడవల ప్రయాణం కుదరదని కరాఖండిగా చెప్పారట. ఆయా నియోజక వర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే అన్నారని సమాచారం. అంతేకాదు మీకు అప్పగించిన నియోజకవర్గాల్లో ఆరు నెలలు కష్ట పడి పని చేసి ఫలితాలు చూపెడితే రానున్న రోజుల్లో అవకాశాలు ఉంటాయన్నారు. మీకు అప్పగించిన నియోజకవర్గంలో మీరు.. మీ సొంత నియోజవర్గాల్లో మరో ఇన్‌ఛార్జీతో పార్టీని బలోపేతం చేస్తామని అని సెలవిచ్చారట.
దీంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు, అవకాశాలు రావని భావించే వాళ్లు, కాంగ్రెస్ పార్టీ వీడి కాషాయ కండువా కప్పుకున్న వారికి బన్సల్ చేసిన కామెంట్లకు అవాక్కాయ్యారని తెలుస్తోంది. పార్టీ కోసం పని చేయాలి, పార్టీ బలోపేతానికి కష్టపడాలి అలాంటి వారికే అవకాశం ఇస్తామని సునీల్ బన్సల్ చేసిన వ్యాఖ్యలు పోటీ చేయాలని అనుకుంటున్న నియోజవర్గ ఇన్ఛార్జీలకు ఆశ్చర్యం కలిగించాయి.
అయితే కేసీఆర్‌ను తిట్టి, కాంగ్రెస్ అధిష్టానంపై దుమ్మెత్తి పోసి కాషాయ తీర్థం పుచ్చకున్నంత మాత్రాన అవే బీజేపీకి ఓట్లు రాల్చవు, అధికారం దక్కదు, పార్టీ బలోపేతం కాదన్న విషయాల్లో బీజేపీ జాతీయ నేతలకు పూర్తి స్పష్టత ఉన్నది. అధిష్టానం టార్గెట్ కూడా ఇప్పటివరకు గెలవని స్థానాలే.
ఆ దిశలోనే ఆ పార్టీ అధిష్టానం, అర్ఎస్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. పార్టీ పట్టుకుని ఉండే వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ ఆయారం గాయారాంలతో ప్రయోజనం లేదన్నది బీజేపీ అధిష్టాన పెద్దల ఆలోచనగా బన్సల్ కామెంట్ల ను చూడాలి. సునీల్ ఇచ్చిన సందేశం ఇదే. అర్థం అయినోళ్లకు అర్థం అయినంత.