ఇంటి కిటికీలో చిక్కుకున్న భారీ కొండచిలువ.. ఎలా రక్షించారంటే..?

విధాత: వానా కాలంలో సరీసృపాలు ఎక్కడ అంటే అక్కడ దర్శనమిస్తున్నాయి. నదులు, చెరువులకు సమీపంలో ఉండే గ్రామాలు, పట్టణాల్లోకి పెద్ద పెద్ద పాములు, కొండచిలువలు, మొసళ్లు వస్తుంటాయి. జనాలను ఆందోళనకు గురి చేస్తుంటాయి. ఓ భారీ కొండ చిలువ ఏకంగా ఓ బహుళ అంతస్తుల భవనంలోకి దూరింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర థానే పట్టణంలోని ఓ ఇంట్లోకి కొండచిలువ దూరింది. తెలుపు రంగులో ఉన్న ఈ పైథాన్ ఆ ఇంటి కిటికీలో చిక్కుకుంది. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. ఆ ఇంటి వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్స్.. కొండచిలువను బంధించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
కానీ అదుపుతప్పి ఆ పైథాన్.. కిటికీలో నుంచి కిందకు పడిపోయింది. స్నేక్ క్యాచర్స్ నుంచి తప్పించుకున్న ఆ కొండ చిలువ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అనే విషయం మాత్రం తెలియరాలేదు.