WARANGAL: పార్టీలు చీల్చడం… ప్రభుత్వాలు కూల్చడమే మోడీ పని: KTR

దోస్త్ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు.. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం మెజారిటీలో సిరిసిల్లకు పాలకుర్తి పోటీ కావాలి రాష్ట్ర మంత్రి కేటీఆర్ Splitting parties.. Modi's work : KTR విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దోస్త్ ఇచ్చే కమీషన్ డబ్బులతో బిజెపి నాయకులు ఎమ్మెల్యేలను కొంటూ, పార్టీలను చీలుస్తూ, ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా మోడీ(Modi) ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు. వన్ కంట్రీ […]

WARANGAL: పార్టీలు చీల్చడం… ప్రభుత్వాలు కూల్చడమే మోడీ పని: KTR
  • దోస్త్ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు..
  • అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం
  • మెజారిటీలో సిరిసిల్లకు పాలకుర్తి పోటీ కావాలి
  • రాష్ట్ర మంత్రి కేటీఆర్

Splitting parties.. Modi’s work : KTR
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: దోస్త్ ఇచ్చే కమీషన్ డబ్బులతో బిజెపి నాయకులు ఎమ్మెల్యేలను కొంటూ, పార్టీలను చీలుస్తూ, ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా మోడీ(Modi) ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు.

వన్ కంట్రీ వన్ నేషన్(One Country One Nation) అంటూ చెప్పిన ప్రధాని మోడీ, ఇప్పుడు ఒకే దేశం ఒకే ఫ్రెండ్ అని దోస్త్ కు దోచుపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో చేసింది చాలక శ్రీలంక(Srilanka)కు వెళ్లి మరీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం అంటూ దోస్త్ కోసం రూ.6000 కోట్ల ఒప్పందం చేసుకున్నార‌ని మండిపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Womens day) సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dyakar rao) అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేటీఆర్ మాట్లాడుతూ మోడీని దుయ్యబట్టారు. మాతో పాటే దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆకాశంలో అప్పులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.400 గ్యాస్(Gas) సిలిండర్ ప్రస్తుతం రూ.1200లకు చేరిందని విచారణ వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న మనందరినీ పిచ్చోళ్ళుగా మోడీ భావిస్తున్నాడని, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తూచ్ అయ్యిందని, తెలంగాణకు రావలసిన నిధులు, పథకాలు, పనులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

దేశానికి తెలంగాణ ఆదర్శం

అభివృద్ధిలో రాష్ట్రం దేశానికి పాఠం నేర్పుతుందని కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలతో కాలువలు నిండుగా పారుతున్నాయని దీనికి కాళేశ్వరం ప్రధాన కారణం అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కటకట లేకుండా, రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా, బీమా సౌకర్యం కల్పించిన ప్రభుత్వం అని కొనియాడారు. కెసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అంటూ చమత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, కులవృత్తుల అభివృద్ధికి, దళిత, గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల కంటే ఎక్కువ మెజారిటీతో పాలకుర్తిలో మీ ఎమ్మెల్యే ఎర్రబెల్లిని గెలిపించాలని మీకు మాకు పోటీ అంటూ సవాల్ చేశారు.

అభివృద్ధి పనులు – హామీలు

సభకు ముందు రూ.14.88 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొర్రూరు మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రూ.750 కోట్ల స్త్రీనిధి రుణాలు, మొత్తంగా రూ.1050 కోట్ల నిధులు చెక్కుల రూపంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కొడకండ్లలో 20 ఎకరాల పరిధిలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మహిళలకు 10వేల కుట్టుమిషన్లు అందజేస్తున్నట్లు చెప్పారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు దయాకర్, కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున మహిళలను సమీకరించారు.