జనవరి 22న గర్భిణీలకు ఉచిత ప్రసవాలు.. ఎక్కడంటే..?
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గొప్పగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు

సూరత్ : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ గొప్పగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. గుజరాత్ సూరత్‌లోని ఓ హాస్పిటల్ కూడా ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. జనవరి 22న ఆ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ప్రసవాలు చేయాలని నిర్ణయించింది.
సూరత్‌లోని సూరత్ డైమండ్ అసోసియేషన్ ఆరోగ్య సమితి హాస్పిటల్ చైర్మన్ సీపీ వనాని మాట్లాడుతూ.. జనవరి 22న రామమందిరం ప్రాణప్రతిష్ఠ వేడుకలను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తమ భక్తికి చిహ్నంగా ఆ రోజున గర్భిణీ స్త్రీలకు ఉచితంగా ప్రసవాలు చేస్తామన్నారు. ఒక వేళ సీజేరియన్ చేసినా ఎలాంటి ఫీజులు వసూళ్లు చేయమని స్పష్టం చేశారు.
ఆసుపత్రి ట్రస్టీలు, వైద్యులు, నర్సులు, సహాయక సిబ్బంది ప్రాణప్రతిష్ఠ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒక మహా ఆరతి ఇచ్చేందుకు ప్లాన్ చేశామన్నారు. ఆస్పత్రి భవనం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించామన్నారు. దీంతో హాస్పిటల్‌లో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని వనాని పేర్కొన్నారు.
సూరత్ డైమండ్ హాస్పిటల్‌లో ప్రతి రోజు 950 మంది రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. నెలకు 350 నుంచి 400 డెలివరీలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలకు రూ.1800, సీజేరియన్లకు రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 22న మాత్రం ఎలాంటి డబ్బులు తీసుకోమని స్పష్టం చేశారు.
అంతే కాకుండా ఈ హాస్పిటల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆస్పత్రిలో డెలివరీ జరిగి అమ్మాయి పుడితే.. వారికి రూ. లక్ష వరకు బాండ్ అందిస్తున్నామని సీపీ వనాని చెప్పారు. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు రూ. 20 కోట్ల వరకు బహుమానంగా ఇచ్చామని తెలిపారు.