తెలంగాణలో మళ్లీ రంగంలోకి తెలుగుదేశం.. అందుకోసమేనా!
(విధాత ప్రతినిధి, హైదరాబాద్): తెలుగుదేశం పార్టీ విస్మరించదగిన రాజకీయ పార్టీ కాదు. సుమారు పదహారు సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన పునాది ఉంది. ఆ పార్టీతో ఎదిగిన వర్గాలు, నాయకులు పుష్కలంగా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం చాలా చోట్ల ఓటు బ్యాంకును కలిగి ఉంది. చెప్పుకోదగిన విజయాలు సాధించింది. తెలుగుదేశం కూడా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు భౌగోళిక ‘తెలుగుదేశం’లో […]

(విధాత ప్రతినిధి, హైదరాబాద్): తెలుగుదేశం పార్టీ విస్మరించదగిన రాజకీయ పార్టీ కాదు. సుమారు పదహారు సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన పునాది ఉంది. ఆ పార్టీతో ఎదిగిన వర్గాలు, నాయకులు పుష్కలంగా ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలుగుదేశం చాలా చోట్ల ఓటు బ్యాంకును కలిగి ఉంది. చెప్పుకోదగిన విజయాలు సాధించింది. తెలుగుదేశం కూడా జాతీయ పార్టీగా ప్రకటించుకుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు భౌగోళిక ‘తెలుగుదేశం’లో భాగమే. అయితే రెండు రాష్ర్టాలలో ఉండే బలం జాతీయ పార్టీ గుర్తింపును తేలేవు. కనీసం నాలుగు రాష్ట్రాలలో పార్టీకి సీట్లు, ఓట్లు వస్తేనే జాతీయ పార్టీ గుర్తింపు సాధ్యం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ 28,32,850 ఓట్లతో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీకి 14.61 శాతం ఓట్లు వచ్చాయి. అందులో 12 మంది ఎమ్మెల్యేలు కొద్దికాలానికే టీఆర్‌ఎస్‌లో చేరారు.
అంతేకాదు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా 13 స్థానాలకు పోటీ చేసి రెండు స్థానాలను గెల్చుకుంది. పదమూడు స్థానాలలో 7,25,714 ఓట్లను, 3.5 శాతం ఓట్లను పొందింది. 2018లో పోటీ చేసిన నియోజకవర్గాలు, ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. అశ్వారావుపేట(61,124), సత్తుపల్లి(1,00,044), ఖమ్మం(91,769), వరంగల్ వెస్ట్(44,555), మక్తల్(26,448), మహబూబ్‌నగర్(28,699), సనత్ న గర్(35,813), మలక్‌పేట(29769), శేరిలింగంపల్లి(99,012), రాజేంద్రనగర్(50,591), ఇబ్రహీంపట్నం(18,053), ఉప్పల్(69,274), కూకట్‌పల్లి(70,563).
రాజకీయ శక్తుల ఏకీకరణ
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ శక్తులన్నింటినీ ఏకతాటి పైకి తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని, బీజేపీ ప్రయత్నాలకు అనువుగానే టీడీపీ కూడా పార్టీని తిరిగి సన్నద్ధం చేస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఇతర రాజకీయ శక్తులతో కలసి పని చేసేందుకు వీలుగా పార్టీని కార్యోన్ముఖం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.
బీఎస్పీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వంటి వాటిని కూడా బీజేపీ కూటమిలోకి తీసుకు వస్తారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ పార్టీలన్నీ ఒకటైతే తమకు అంతకు మించిన ఆయుధం అక్కర లేదని టీఆర్‌ఎస్ భావిస్తున్నది.
తెలంగాణను వ్యతిరేకించిన, తెలంగాణపై కక్షగట్టిన శక్తులందరూ ఒకే వేదిక పైకి వచ్చాయని, తెలంగాణకు ఇంతకంటే ముప్పు ఏముంటుందని టీఆర్‌ఎస్ వాదించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటై పోటీ చేయడాన్నే గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒక అవకాశంగా ఉపయోగించుకుంది.
తెలంగాణ ద్రోహులంతా ఒక్కటై మీదకు వస్తున్నారని తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రాజేసే అవకాశం ఉంది. అయినా టీడీపీ పాత ముద్రలను కడిగేసుకోవడం కోసమయినా తెలంగాణలో పార్టీని నిలబెట్టాలని చూస్తున్నది. రెండు రాష్ట్రాలు తిరిగి కలిసే అవకాశమే లేదని చంద్రబాబు చెప్పడం కూడా అందులో భాగంగానే భావిస్తున్నారు